Begin typing your search above and press return to search.

నందిత‌.. ఎందుకింత గ్యాప్‌?

By:  Tupaki Desk   |   15 Sep 2018 6:01 AM GMT
నందిత‌.. ఎందుకింత గ్యాప్‌?
X
కాటుక క‌ళ్ల‌తో మాయ చేసింది తెలుగ‌మ్మాయ్ నందితా రాజ్. నా క‌ళ్ల‌కు ఫ్యాన్స్ ఉన్నారు తెలుసా? అంటూ `ప్రేమ‌క‌థా చిత్ర‌మ్`లో చాలానే హొయ‌లు పోయింది. ఆ చిత్రంలో దెయ్యం పూనిన అమ్మాయిగా అద్భుత‌మైన అభిన‌యంతో ఆక‌ట్టుకుంది. కామెడీ థ్రిల్ల‌ర్‌ ని బ్లాక్‌ బ‌స్ట‌ర్ చేయ‌డంలో నందిత పాత్ర‌కు క్రిటిక్స్ నుంచి గొప్ప ప్ర‌శంస‌లు వెల్లువెత్తాయి. ఆ క్రమంలోనే నందిత కెరీర్ తిరిగి చూసుకునే ప‌నే లేద‌నుకున్నారంతా. అందుకు త‌గ్గ‌ట్టే వ‌రుస‌గా నాలుగైదు చిత్రాల‌కు నందిత సంత‌కాలు చేసింది. మ‌ల‌యాళంలో మోహ‌న్‌ లాల్ అంత పెద్ద స్టార్ సినిమాలో న‌టించింది. అయితే ఎందుక‌నో అవేవీ పెద్ద‌గా బ్రేక్ నివ్వ‌లేదు. ప్ర‌స్తుతం నందిత‌కు సినిమాలు త‌గ్గాయ్.

దానికి ఓ కార‌ణం ఉంద‌ని ఇటీవ‌లే ఓ అసిస్టెంట్ డైరెక్ట‌ర్ చెప్పాడు. నందిత‌పై లేనివి, ఉన్న‌వి కొన్ని రూమ‌ర్లు పుట్టుకొచ్చాయ‌ని - త‌న‌పై కొంద‌రు కుట్ర చేశార‌ని స‌ద‌రు అసిస్టెంట్ చెప్ప‌డం షాకిచ్చింది. ఈ భామ స‌రిగా క్ర‌మ‌శిక్ష‌ణ పాటించ‌ద‌ని, సెట్స్‌కి స‌మ‌యానికి రాద‌ని త‌న‌పై దుష్ప్ర‌చారం చేశారు. క‌మిట్‌ మెంట్ అస్స‌లు కుద‌ర‌ద‌ని తెలిపాడు. మొత్తానికి నందిత కెరీర్ విష‌యంలో ఏదో జ‌రిగింద‌న్న సందేహాల్ని అది రాజేసింది.

అదంతా అటుంచితే.. ప్ర‌తిభ‌ను గుప్పిట ప‌ట్ట‌డం అన్నిసార్లు కుద‌ర‌ద‌ని నిరూపించేందుకు నందిత మ‌రో ప్ర‌య‌త్నం చేస్తోంది. `విశ్వామిత్ర‌` అనే థ్రిల్ల‌ర్ బేస్డ్ సినిమాలో న‌టిస్తోంది. ఇందులో సత్యం రాజేష్ ఓ కీల‌క పాత్ర పోషించాడు. గీతాంజ‌లి ఫేం రాజ్‌ కిర‌ణ్ ఈ చిత్రాన్ని స్వీయ‌నిర్మాణంలో డైరెక్ట్ చేస్తున్నారు. స్విట్జ‌ర్లాండ్‌ బ్యాక్‌ డ్రాప్‌ లో ఊహాతీతం అనిపించే ఓ నిజ‌ఘ‌ట‌న ఆధారంగా ఈ సినిమాని తెర‌కెక్కిస్తున్నామ‌ని నిర్మాత‌లు తెలిపారు. తాజాగా రిలీజ్ చేసిన ఫ‌స్ట్‌ లుక్ ఆక‌ట్టుకుంది. నందిత ఈ చిత్రంలో న‌ట‌న‌కు ఆస్కారం ఉన్న పాత్ర‌లో న‌టించింద‌ని ద‌ర్శ‌కుడు చెబుతున్నారు. అశుతోష్ రాణా - విద్యురామ‌న్ ఈ చిత్రంలో కీల‌క‌పాత్ర‌లు పోషించారు. ప్ర‌తిభ మ‌రోసారి గెల‌వాలనే ఆశిద్దాం.