Begin typing your search above and press return to search.

అప్పుడు అది తప్పు.. ఇప్పుడు ఇది కూడా తప్పే: నాని

By:  Tupaki Desk   |   6 Jun 2022 8:30 AM GMT
అప్పుడు అది తప్పు.. ఇప్పుడు ఇది కూడా తప్పే: నాని
X
టాలీవుడ్ లో టికెట్ రేట్లు అనేవి గత కొంతకాలంగా చర్చనీయాంశంగా మారుతున్నాయి. ఇంతకముందు తక్కువ టికెట్ ధరల కారణంగా నష్టపోతున్నామని సినీ ప్రముఖులు ఆవేదన చెందితే.. ఇప్పుడు అధిక టికెట్ రేట్ల వల్ల జనాలు థియేటర్ల వైపు చూడకపోవడంతో నష్టపోతున్నామని వాపోతున్నారు.

ఈ నేపథ్యంలో 'నేడే చూడండి.. మీ అభిమాన థియేటర్లలో.. తగ్గింపు టికెట్ ధరలతో' అంటూ పోస్టర్స్ వేసుకొని ప్రచారం చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో ఒక్కప్పుడు టికెట్ ధరలు పెంచమని డిమాండ్ చేసి.. ఇప్పుడు రేట్లు తగ్గించి సినిమాలు రిలీజ్ చేస్తున్నవారిని నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. అలాంటి వారిలో హీరో నాని కూడా ఉన్నాడు.

'శ్యామ్ సింగరాయ్' మూవీ ప్రమోషన్స్ లో భాగంగా నాని మీడియాతో మాట్లాడుతూ.. ఏపీ ప్రభుత్వం టికెట్ ధరలను తగ్గించి ప్రేక్షకులను అవమానించిందని కీలక వ్యాఖ్యలు చేశారు. పాలిటిక్స్ ను, సినిమాలను అన్నింటినీ పక్కన పెడితే.. టికెట్ ధరలు తగ్గించడమనేది ప్రేక్షకులను అవమానించినట్లే అని నాని అన్నారు.

చిన్నప్పుడు స్కూల్లో పిక్నిక్ కు వెళ్తున్నప్పుడు అందరి దగ్గరా రూ.100 తీసుకొనేవారు. అందరూ రూ.100 ఇవ్వగలరు.. నాని నువ్వు మాత్రం ఇవ్వలేవు అంటే అది నన్ను ఇన్సల్ట్ చేసినట్టే కదా? అని దానికి ఉదాహరణ కూడా చెప్పారు. ఆ సమయంలో నాని మీద సోషల్ మీడియాలో అనేక విమర్శలు ఎదుర్కోవాల్సి వచ్చింది.

ఈ క్రమంలో రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు సినిమా టికెట్ రేట్లు పెంచుకోడానికి అనుమతిస్తూ జీవోలు జారీ చేశాయి. అయితే గతంలో సినిమా టిక్కెట్ ధరలు తగ్గించి ప్రేక్షకులను అవమానించవద్దని చెప్పిన నాని.. ఇప్పుడు తాను నటించిన 'అంటే.. సుందరానికీ!' సినిమాని తగ్గించిన టిక్కెట్ ధరలతో బుకింగ్స్ ఓపెన్ చేయమని డిస్ట్రిబ్యూటర్లను కోరుతున్నాడని తెలుస్తోంది.

దీనికి కారణం ఇటీవల పెంచిన టికెట్ ధరలతో థియేటర్లలోకి వచ్చిన పలు సినిమాలకు ఆశించిన స్థాయిలో ప్రేక్షకాదరణ దక్కకపోవడమే అని తెలుస్తోంది. ఏదైతేనేం అప్పుడు రేట్లు పెంచమని కోరిన నాని.. ఇప్పుడు తన సినిమాని తక్కువ టికెట్ ధరలతో రిలీజ్ చేయడానికి ప్రయత్నాలు చేయడంపై నెట్టింట ట్రోల్స్ వస్తున్నాయి.

తాజాగా ఈ వ్యవహారంపై హీరో నాని స్పందిస్తూ ట్రోలర్స్ కు కౌంటర్ ఇచ్చారు. టిక్కెట్ ధరల సమస్యలపై నన్ను కామెంట్ చేసేవాళ్ళు తెలివి తక్కువవారు. నేను టికెట్ రేటు రూ. 500 పెంచమని అడగలేదు.. 20 - 40 - 60 రూపాయలతో ఇండస్ట్రీ మనుగడ సాగించలేదని మాత్రమే చెప్పానని నాని అన్నారు. అది తప్పు (తక్కువ ధర) అయితే.. ఇప్పుడు ఇది కూడా తప్పే (అధిక ధర) అని వ్యాఖ్యానించారు.