Begin typing your search above and press return to search.

'అంటే..' టైటిల్ కార్డ్ పై 'నాని అండ్ నజ్రియా ఇన్' అని వేశారేంటి..?

By:  Tupaki Desk   |   20 April 2022 2:38 PM GMT
అంటే.. టైటిల్ కార్డ్ పై నాని అండ్ నజ్రియా ఇన్ అని వేశారేంటి..?
X
నేచురల్ స్టార్ నాని హీరోగా వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో తెరకెక్కిన రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ ''అంటే.. సుందరానికీ!". మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన ఈ సినిమాలో నజ్రియా నజీమ్ ఫహాద్ హీరోయిన్ ‏గా నటించింది. ఇది ఆమెకు ఫస్ట్ స్ట్రెయిట్ తెలుగు సినిమా. సాధారణంగా టాలీవుడ్ స్టార్స్ నటించే సినిమాల టైటిల్ కార్డ్స్ పై హీరో పేరుని వేస్తుంటారు. కానీ ఈ సినిమా టైటిల్ కార్డ్ లో 'నాని & నజ్రియా ఇన్' అని పేర్కొనబడటం అందరినీ ఆశ్చర్యపరిచింది. దీనిపై తాజాగా హీరో నాని క్లారిటీ ఇచ్చారు.

'అంటే.. సుందరానికీ!' సినిమా జూన్ 10న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఈ నేపథ్యంలో బుధవారం ఉదయం టీజర్ రిలీజ్ ఈవెంట్ ఏఎంబీ మాల్ లో నిర్వహించారు. ఈ సందర్భంగా టైటిల్ కార్డ్స్ పై 'నాని అండ్ నజ్రియా ఇన్' అని మీడియా మిత్రులు ప్రశ్నించారు. దీనికి నాని సమాధానమిస్తూ.. ''కథ ప్రకారమే టైటిల్ ఉంటుంది. కొన్ని హీరో కథలుంటాయి. కానీ ఇది హీరో కథ కాదు'' అని అన్నారు.

''ఇది సుందర్ ప్రసాద్ - లీలా థామస్ ల మధ్యలో జరిగిన కథ. సో ఆటోమేటిక్ గా అలా పెట్టారు. డైరెక్టర్ అండ్ టీమ్ అంతా కలిసి ఈ నిర్ణయం తీసుకున్నారు. వాళ్ళ ఛాయిస్.. మార్కెటింగ్.. ఇలా దాని వెనుక వంద కారణాలు ఉంటాయి. అప్పుడు కానీ ఇప్పుడు కానీ టైటిల్ కు మాకు ఏం సంబంధం లేదు. మేము యాక్టర్లం మాత్రమే. కేవలం వచ్చి నటించి వెళ్లిపోయామంతే'' అని నాని తెలిపారు.

''ఈ సినిమాలో నాతో పాటుగా మిగతా పాత్రలకు కూడా అంతే ప్రాధాన్యత ఉంది. లీడ్ క్యారెక్టర్స్ ఉన్నారు తప్పితే.. హీరోహీరోయిన్ అనే కాన్సెప్ట్ ఇందులో లేదు. సో అలాంటి కథ కుదిరింది.. దాన్ని ఈ విధంగా సెలబ్రేట్ చేసుకుంటున్నాం'' అని నాని అన్నారు. 'అంటే.. సుందరానికీ!' చిత్రాన్ని తెలుగుతో పాటుగా తమిళ మలయాళ భాషల్లో విడుదల చేయనున్నారు. నజ్రియా కు మిగతా రెండు భాషల్లో మంచి క్రేజ్ ఉంది. మార్కెట్ పరంగా కచ్చితంగా ఇది కలిసొస్తుంది.

ఇంకా నాని మాట్లాడుతూ.. ''ప్రేక్షకుల సమక్షంలో టీజర్ రిలీజ్ చేయడం నాకు సెంటిమెంట్ అయిపోయేలా ఉంది. దర్శకుడు వివేక్ ఏ సినిమా చేసినా.. కథను అతడు తప్ప వేరే ఎవరూ అతడి కంటే బాగా చెప్పలేరు. నజ్రియా ని తెలుగు సినిమాల్లోకి తీసుకురావాలని ఎంతోమంది ప్రయత్నించారు. అందుకోసం ఎందరు ఫోన్లు చేసినా ఆమె లిఫ్ట్ చేయలేదు. ఎవరి రిక్వెస్ట్ ఆమె ఒప్పుకోలేదు. కానీ, ఆమె ఈ సినిమాలో నటించడానికి ఒప్పుకుంది. అందుకు ఆమెకు థాంక్స్. టీజర్ కు రెండు రెట్లు ట్రైలర్ ఉంటుంది.. పది రెట్లు సినిమా ఉంటుంది" అని చెప్పుకొచ్చారు.

పాన్ ఇండియా అంటే ఏమిటో నాకు తెలియదని.. దేశవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులందరూ ఆకట్టుకునే సినిమాలు చేస్తే అవే పాన్ ఇండియా చిత్రాలని తాను నమ్ముతానని నాని అన్నారు. ఈ సందర్భంగా నజ్రియా మాట్లాడుతూ.. ''ఇది నా ఫస్ట్ తెలుగు సినిమా. తెలుగులోకి ఎంట్రీ ఇవ్వడానికి ఇదే సరైన కథ అనిపించింది. ఈ టీమ్ మొత్తంతో కలిసి వర్క్ చేయడం నాకెంతో ఆనందంగా ఉంది. వీరి నుంచి ఎన్నో విషయాలు నేర్చుకున్నా. ఈ ప్రాజెక్ట్ కోసం తెలుగు నేర్చుకొని సొంతంగా డబ్బింగ్ చెప్పుకొన్నాను'' అని తెలిపింది.