Begin typing your search above and press return to search.

తెలంగాణ పిలగాడుగా తెరపై సందడి చేయనున్న నాని!

By:  Tupaki Desk   |   22 Sep 2021 3:32 AM GMT
తెలంగాణ పిలగాడుగా తెరపై సందడి చేయనున్న నాని!
X
మొదటి నుంచి కూడా నాని వైవిధ్యభరితమైన కథలకు .. పాత్రలకు ప్రాధాన్యతనిస్తూ వస్తున్నాడు. ఆయన ఎంచుకునే కథలు .. పాత్రలు సహజత్వానికి దగ్గరగా ఉండటం వలన, ఆడియన్స్ కి వెంటనే కనెక్ట్ అవుతున్నాయి. ఫ్యామిలీస్ థియేటర్లకు వస్తేనే సినిమాలు హిట్ అవుతాయని బలంగా నమ్మిన హీరోగా నాని కనిపిస్తాడు. అందువలన తన సినిమాలు యూత్ కోసం .. మాస్ కోసం అనే విభజన చేయకుండా, అందరికీ అవసరమైన అంశాలు తన కథల్లో ఉండేలా చూసుకుంటాడు. ఆయన తీసుకున్న ఈ నిర్ణయమే ఆయనను స్టార్ హీరోల సరసన నిలబెట్టింది.

ఎప్పటికప్పుడు నాని ట్రెండును ఫాలోఅవుతూ తనని తాను కొత్తగా ఆవిష్కరించుకునే ప్రయత్నం చేస్తుంటాడు. ఇప్పుడు తెలుగు సినిమాల్లో తెలంగాణ యాస మాట్లాడటం కొత్త ట్రెండ్. 'వకీల్ సాబ్'లో పవన్ తెలంగాణ యాసను ట్రై చేశాడు. 'లవ్ స్టోరీ' సినిమాలో చైతూ తెలంగాణ యాసలోనే మాట్లాడతాడు. ఇక ఆ జాబితాలో నాని కూడా జాయిన్ కానున్నట్టుగా తెలుస్తోంది. సుకుమార్ శిష్యుడైన శ్రీకాంత్ అనే కుర్రాడు ఇటీవల నానీకి ఒక కథను వినిపించాడట. ఈ తరహా కథను .. పాత్రను తాను ఇంతవరకూ టచ్ చేయకపోవడం వలన వెంటనే నాని గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడని అంటున్నారు.

ఈ సినిమాలో నాని తెలంగాణ ప్రాంతానికి చెందిన యువకుడిగా .. తెలంగాణ యాస మాట్లాడుతూ కనిపిస్తాడట. ఇంతకుముందు నాని తెలంగాణ నేపథ్యంలో సాగే కథల్లో కనిపించాడు. కానీ తెలంగాణ యాసలో మాట్లాడటం మాత్రం ఇదే మొదటిసారి అవుతుంది. గతంలో నాని కథా నేపథ్యం .. పాత్రల నేపథ్యం పరంగా రాయలసీమ .. నెల్లూరు ప్రాంతాల యాసలో మాట్లాడవలసి వచ్చింది. నిజంగానే ఆయన ఆ ప్రాంతానికి చెందినవాడా? అన్నంత సహజంగా ఆ పాత్రలను ఆయన రక్తి కట్టించాడు. అలా ఈ సారి తెలంగాణ యాసలో కూడా చెలరేగిపోవడం ఖాయమనే టాక్ వినిపిస్తోంది.

ఈ సినిమాకి 'దసరా' అనే టైటిల్ ను పరిశీలిస్తున్నట్టుగా కూడా చెప్పుకుంటున్నారు. ఈ 'దసరా' రోజున ఈ సినిమా పూజా కార్యక్రమాలు జరుపుకోనుందని అంటున్నారు. నాని తాజా చిత్రంగా ప్రేక్షకుల ముందుకు రావడానికి 'శ్యామ్ సింగ రాయ్' సిద్ధమవుతోంది. ఆ తరువాత సినిమాగా 'అంటే సుందరానికీ!' కొంతవరకూ పూర్తి చేశాడు. ఈ సినిమా పూర్తయిన తరువాత, 'దసరా' పట్టాలెక్కనుందని చెప్పుకుంటున్నారు. ఈ సినిమాకి నిర్మాతగా చెరుకూరి సుధాకర్ పేరు వినిపిస్తోంది.