Begin typing your search above and press return to search.

కులం ట్వీట్ పై చిర్రెత్తిపోయిన నాని

By:  Tupaki Desk   |   30 May 2017 5:09 PM GMT
కులం ట్వీట్ పై చిర్రెత్తిపోయిన నాని
X
ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా చిత్ర‌ప‌రిశ్ర‌మ‌లో నెగ్గుకు రావ‌టం క‌ష్ట‌మంటారు. కానీ.. టాలెంట్‌ను మాత్ర‌మే న‌మ్ముకొని హీరోగా త‌న‌కంటూ ఒక స్టైల్‌ను క్రియేట్ చేసుకున్నోడు నాని. నేచుర‌ల్ హీరోగా పేరున్న నానిలో ఉన్న మ‌రో గుణం ఏమిటంటే.. ఎంత ఎదిగినా ఒదిగి ఉండ‌టం. వ‌రుస హిట్లు వ‌చ్చినా త‌న తీరులో ఏ మాత్రం మార్పు లేకుండా అంద‌రితోనూ క‌లుపుగోలుగా వ్య‌వ‌హ‌రించే వ్య‌క్తిగా నానికి పేరుంది.

స‌క్సెస్ ఫుల్ హీరోగా పేరున్నా.. అలాంటివేమీ లేన‌ట్లుగా ఉండ‌ట‌మే కాదు.. సీనియ‌ర్ హీరోల విష‌యంలో గౌర‌వాన్ని ఇస్తూ అంద‌రితోనూ స్నేహంగా ఉంటారు. అలాంటి నానికి పిచ్చ కోపం వ‌చ్చేసింది.

తాను చేసిన ఒక ట్వీట్ పై ఒక అభిమాని చేసిన కామెంట్‌ను నాని అస్స‌లు భ‌రించ‌లేక‌పోయారు. అత‌నికి దిమ్మ తిరిగేలా ఘాటు ట్వీట్ తో బదులిచ్చారు. నానికి అంత ఆగ్ర‌హాన్ని క‌లిగించిన ఆ ట్వీట్‌ను చూస్తే.. అత‌గాడి కోపంలో ధ‌ర్మం ఉంద‌నిపించ‌క మాన‌దు.

మే 28న తెలుగువారంతా.. ప్రాంతాల‌కు అతీతంగా ప్రేమించే అతి కొద్ది మంది తెలుగోళ్ల‌లో ఎన్టీవోడు ఒక‌రు. ఆయ‌న జ‌యంతి సంద‌ర్భంగా నాని ఒక ట్వీట్ చేశారు. దీనికి ఒక అభిమాని మొర‌టుగా స్పందించాడు. కులం పేరుతో అత‌గాడు చేసిన ట్వీట్ పై నాని తీవ్ర ఆగ్ర‌హాన్ని వ్య‌క్తం చేశారు. నేను మీలానే తెలుగువాణ్ని.. ఎన్టీఆర్ కు మాత్ర‌మే కాదు.. చిరంజీవికి కూడా నేను పెద్ద అభిమానిని.. పెద్ద‌ల్ని గౌర‌వించ‌గ‌లిగే సంస్కారం ఉన్న వాడినినంటూ ఘాటు రిప్లై ఇచ్చారు.

నానిపై అభిమాని చేసిన ట్వీట్‌.. దానికి నాని ఇచ్చిన రిప్లైపై పెద్ద చ‌ర్చే జ‌రిగింది. ఇరు వ‌ర్గాల అభిమానులు ఈ విష‌యం మీద వాదోప‌వాదాలు చేసుకున్నారు. ఈ వ్య‌వ‌హారం ముదురుతుంద‌న్న విష‌యాన్ని గుర్తించిన స‌ద‌రు అభిమాని తాను చేసిన మొర‌టు ట్వీట్‌ను డిలీట్ చేయ‌టంతో ఈ ఇష్యూ అక్క‌డితో క్లోజ్ అయ్యింది.