Begin typing your search above and press return to search.

ఈ వారం నాని క్లాస్ పీకుడు నెటిజ‌న్ల‌పైన‌!

By:  Tupaki Desk   |   23 July 2018 4:33 AM GMT
ఈ వారం నాని క్లాస్ పీకుడు నెటిజ‌న్ల‌పైన‌!
X
నానికి కోపం వ‌చ్చేసింది. వినోదం పంచ‌టానికి యాంక‌ర్ అవ‌తారం ఎత్తిన అత‌గాడు వీకెండ్ వ‌స్తే చాలు.. క్లాసులు పీకే అల‌వాటును కొత్త‌గా తెచ్చుకున్నాడు. గ‌త వారం ఎలిమినేష‌న్ రౌండ్ సంద‌ర్భంగా బిగ్ బాస్ పార్టిసిపెంట్ మీద ఓ రేంజ్లో క్లాసులు పీకిన వైనంపై ప‌లువురు మండిప‌డ్డారు.

ఒక క‌మ‌ర్షియ‌ల్ ప్రోగ్రాంలో పాల్గొనే సెల‌బ్రిటీల‌కు నువ్వు అలా చేశావ్‌.. నువ్వు ఇలా చేశావ్ అంటూ స్కూల్లో పిల్ల‌ల్ని టీచ‌ర్ తిట్టిన చందంగా ముఖం ప‌గిలేలా తిట్లు తిట్టేశారు. ఒక మ‌నిషి ఇలా ఉండాల‌న్న రూల్ ఎక్క‌డా ఉండ‌దు. ఎవ‌రి మైండ్ సెట్ ఆధారంగా వారు వ్య‌వ‌హ‌రిస్తూ ఉంటారు. ఒక‌వేళ స‌రిగా వ్య‌వ‌హ‌రించ‌కుంటే.. ప్రేక్ష‌కులు వారిని బిగ్ బాస్ హౌస్ నుంచి బ‌య‌ట‌కు పంపేలా తాము చేయాల్సింది చేస్తార‌న్న విష‌యాన్ని మ‌ర్చిపోకూడ‌దు.

అలాంట‌ప్పుడు బిగ్ బాస్ కు.. ఆ షోలో పాల్గొంటున్న వారికి మ‌ధ్య సంధాన‌క‌ర్త‌లా వ్య‌వ‌హ‌రించే నాని.. అదే ప‌నిగా సీరియ‌స్ కావ‌టం.. క్లాసులు పీక‌టం బాగోలేద‌న్న మాట బ‌లంగా వినిపిస్తోంది. ఇది స‌రిపోన‌ట్లుగా తాజాగా.. నెటిజ‌న్ల మీద తీవ్ర‌స్థాయిలో విరుచుకుప‌డ్డారు. వారిలో కొంద‌రి తీరు ఏ మాత్రం బాగోలేద‌ని.. బిగ్ బాస్ కంటెస్టెంట్ల‌పై ఆన్ లైన్లో వారు చేస్తున్న వ్యాఖ్య‌లు ఒళ్లు జ‌ల‌ద‌రించేలా.. జుగుప్సాక‌రంగా ఉన్నాయ‌న్నారు.

సోష‌ల్ మీడియాలో వ‌స్తున్న కామెంట్ల‌పై తీవ్ర‌స్థాయిలో విరుచుకుప‌డిన నాని.. న‌చ్చ‌ని స‌భ్యుడ్ని వ‌ద్ద‌న‌టం వ‌ర‌కూ ఓకే. కానీ.. అన‌టానికి వీల్లేని ప‌దాల‌తో కామెంట్స్ చేయ‌టం ఏమిటంటూ ఫైర్ అయ్యారు. తేజ‌స్వీ విష‌యంలో ఇలాంటి కామెంట్స్ వ‌స్తున్నాయ‌ని.. మూడు రోజుల క్రితం త‌న‌కు అలాంటి కామెంట్స్ ను కొన్ని చూపించార‌ని.. వాటిని చూసిన‌ప్పుడు ఇలాంటి మ‌నుషులు కూడా ఉన్నారా? అనిపిస్తోందన్నాయ‌న‌.. సోష‌ల్ మీడియాలో నెగిటివ్‌ కామెంట్స్ తో వ్యాఖ్య‌ల చేస్తున్న వారి తీరును తీవ్రంగా త‌ప్పు ప‌ట్టారు.

నాని తీరు చూస్తే.. ఈ మ‌ధ్య కాలంలో వార్తా ఛాన‌ల్స్.. న్యూస్ పేప‌ర్లు చూడ‌టం లేద‌న్న సందేహం క‌లుగ‌క మాన‌దు. సెల‌బ్రిటీలు.. ప్ర‌ముఖులు.. రాజ‌కీయ.. సినీ వ‌ర్గాల‌కు చెందిన వారిపై నెటిజ‌న్లు విరుచుకుప‌డ‌టం.. ఒక రేంజ్లో మాట‌లు రువ్వవ‌టం మామూలే. ఇదేదో కొత్త విష‌యం అన్న‌ట్లుగా మాట్లాడ‌ట‌మే విచిత్రంగా అనిపిస్తుంది. ఇప్పుడీ మాట అన‌టంలో ఉద్దేశం.. పిచ్చ మాట‌ల్ని మేం స్వాగ‌తించ‌టం లేదు. కాకుంటే.. ఒక స‌మూహంలో అంద‌రూ ఉంటారు.

అందులోకి ఎవ‌రేం చేస్తున్నారో మానిట‌ర్ చేయ‌టం క‌ష్టంగా ఉండే ఫ్లాట్ పాం మీద‌.. స్వేచ్ఛ దుర్వినియోగం అవుతోంద‌న్న‌ది ఒప్పుకోవాల్సిందే. అలా అని.. సీరియ‌స్ గా తిట్టేసి.. ఛ‌డామ‌డా నాలుగు మాట‌లు అనేస్తే విష‌యం మ‌రింత ర‌చ్చ కావ‌టం ఖాయం. తేజిస్వీ మీద అన్నేసి కామెంట్స్ రాస్తున్నారు.. కానీ.. అలాంటివి వారిపై ప్ర‌భావాన్ని చూపుతాయి.. మ‌న‌సులు నొచ్చుకుంటాయని చెప్ప‌టంతో పాటు.. వారి కుటుంబ స‌భ్యుల‌కు ఇబ్బందిక‌రంగా ఉంటాయ‌న్న మాట‌ల్ని సున్నితంగా చెబితే బాగుండేది. అలా కాకుండా.. బెత్తం ప‌ట్టుకున్న మాష్టారిలా టీవీ స్క్రీన్ మీద నాలుగు అరుపులు అరిచేయ‌టం చూస్తే.. బిగ్ బాస్ లో ఈ క్లాస్ పీకుడు షో ఏందిరా బాబు అనుకోకుండా ఉండ‌లేం.