Begin typing your search above and press return to search.

నాని కెరీర్లోనే అతి పెద్ద టార్గెట్

By:  Tupaki Desk   |   11 Sep 2019 1:30 AM GMT
నాని కెరీర్లోనే అతి పెద్ద టార్గెట్
X
నేచురల్ స్టార్ నాని తన కెరీర్లో అతి పెద్ద బాక్సాఫీస్ పరీక్షకు సిద్ధమయ్యాడు. అతడి కొత్త సినిమా ‘గ్యాంగ్ లీడర్’ ఈ శుక్రవారమే ప్రేక్షకుల ముందుకు వస్తోంది. నాని కెరీర్ గత ఏడాది కాలంలో కాస్త ఒడుదుడుకులకు లోనైంది. పోయినేడాది ‘కృష్ణార్జున యుద్ధం’తో పాటు ‘దేవదాస్’ కూడా నిరాశ పరిచాయి. ‘జెర్సీ’తో కాస్త కోలుకున్నాడు. అయినప్పటికీ ‘గ్యాంగ్ లీడర్’కు నాని కెరీర్లోనే అత్యధిక బిజినెస్ జరగడం విశేషం. దీని థియేట్రికల్ హక్కులే రూ.30 కోట్ల మేర అమ్ముడవడం విశేషం. ఇతర మార్గాల్లో వచ్చిన ఆదాయంతో కలిపి రూ.50 కోట్ల దాకా నిర్మాతలకు వర్కవుట్ అయిందట. సినిమాకు ఖర్చు కూడా బాగానే అయింది. ఏమాత్రం రాజీ లేకుండా సినిమాను నిర్మించారు. ప్రోమోల్లో ఆ క్వాలిటీని చూడొచ్చు. ఐతే బయ్యర్ల టార్గెట్ అందుకోవడం మాత్రం ‘గ్యాంగ్ లీడర్’కు ఎంత సులువో అంత కష్టం.

‘సాహో’ నిరాశ పరిచాక ప్రేక్షకులు మంచి సినిమా కోసం ఎదురు చూస్తున్న సమయంలో ‘గ్యాంగ్ లీడర్’ వస్తోంది. ‘సాహో’ థియేట్రికల్ రన్ దాదాపుగా పూర్తయింది. గత వారం వచ్చిన సినిమాలేవీ నిలబడలేదు. ఫ్యామిలీస్ ఇష్టపడే ఎంటర్టైనర్‌ లాగా కనిపిస్తుండటం ‘గ్యాంగ్ లీడర్’కు కలిసొచ్చే విషయం. కానీ వచ్చే వారం ‘వాల్మీకి’ లాంటి మరో క్రేజీ మూవీ రిలీజవుతున్న నేపథ్యంలో ‘గ్యాంగ్ లీడర్’ ఏం సాధించినా వారం రోజుల్లోనే సాధించాలి. ముఖ్యంగా వీకెండ్ వసూళ్లు అత్యంత కీలకం అవుతాయి. బయ్యర్ల పెట్టుబడిలో కనీసం 60 శాతం తొలి వారాంతంలో రాబట్టలేకపోతే సినిమాలు బ్రేక్ ఈవెన్ కావడం కష్టం. మరి ‘గ్యాంగ్ లీడర్’ తొలి మూడు రోజుల్లో 15-20 కోట్ల మధ్య రాబట్టగలదా? నానికి అంత స్టామినా ఉందా అన్నది చూడాలి. ఈ నేపథ్యంలో సినిమాకు పాజిటివ్ టాక్ రావడం అత్యంత కీలకం. మరి శుక్రవారం తొలి షో తర్వాత ‘గ్యాంగ్ లీడర్’ గురించి జనాలేం మాట్లాడుకుంటారో చూడాలి.