Begin typing your search above and press return to search.

ఏపీ ప్రభుత్వంపై హీరో నాని సంచలన వ్యాఖ్యలు..!

By:  Tupaki Desk   |   23 Dec 2021 7:45 AM GMT
ఏపీ ప్రభుత్వంపై హీరో నాని సంచలన వ్యాఖ్యలు..!
X
ఆంధ్రప్రదేశ్ లో టిక్కెట్ ధరలకు సంబంధించి ప్రభుత్వ జారీ చేసిన జీవోపై టాలీవుడ్ లో గత కొన్ని నెలలుగా వివాదం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. సినిమా టికెట్ ధరలను తగ్గిస్తూ ప్రభుత్వం తీసుకొచ్చిన జీవోపై పునరాలోచించాలని ఇప్పటికే పలువురు ఇండస్ట్రీ పెద్దలు - నిర్మాతలు - ఎగ్జిబిటర్స్ విజ్ఞప్తి చేసారు. ప్రస్తుతం టికెట్ రేట్ల వ్యవహారంపై హైకోర్టులో విచారణ జరుగుతోంది. అయితే తాజాగా ఏపీలో టికెట్ ధరల అంశంపై స్పందించిన హీరో నాని.. ప్రభుత్వం పై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.

నేచురల్ నాని హీరోగా నటించిన 'శ్యామ్ సింగరాయ్' చిత్రాన్ని డిసెంబర్ 24న థియేటర్లలో విడుదల చేయనున్నారు. ఈ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా మీడియాతో ముచ్చటించిన నాని.. ఏపీ ప్రభుత్వం టికెట్ ధరలను తగ్గించి ప్రేక్షకులను అవమానించిందని అన్నారు. ''టిక్కెట్ల విషయమై ఏం జరుగుతుందో అది కరెక్ట్ కాదని మనందరికీ తెలుసు. మీరు ప్రేక్షకులను అవమానిస్తున్నారు. ఈ పాలిటిక్స్ ను, సినిమాలను అన్నింటినీ పక్కన పెడితే.. ఇలా చేయడం ప్రేక్షకులను అవమానించినట్లే'' అని నాని తెలిపారు.

''ఇప్పుడు టికెట్ రేట్స్ రూ.10 - రూ.15 - రూ. 20 ఇలా ఉన్నాయి. మళ్ళీ అనవసరంగా దీనికి ఏ థంబ్ నెయిల్స్ పెడతారో. అసలే రేపు సినిమా రిలీజ్ కూడా ఉంది. 10 మందికి ఉద్యోగాలు ఇచ్చి థియేటర్ కౌంటర్ కంటే.. పక్కనే ఉన్న కిరాణా షాప్ కౌంటర్ ఎక్కువగా ఉంటే కరెక్ట్ కాదు. నా చిన్నప్పుడు స్కూల్లో అందరం పిక్నిక్ కు వెళ్లేవాళ్లం. ఆ టైంలో అందరి దగ్గరా రూ.100 అడిగేవారు. అందరూ రూ.100 ఇవ్వగలరు.. నాని నువ్వు మాత్రం ఇవ్వలేవు అంటే అది నన్ను ఇన్సల్ట్ చేసినట్టే కదా?'' అని నాని చెప్పుకొచ్చారు.

నాని గతంలో 'తిమ్మరుసు' ప్రీ రిలీజ్ ఈవెంట్ లో కూడా ఏపీలో థియేటర్స్ - టికెట్ రేట్ల అంశాన్ని లేవనెత్తిన సంగతి తెలిసిందే. అలానే 'స్కైలాబ్' ఈవెంట్ లో కూడా పరోక్షంగా తన అభిప్రాయాన్ని వెల్లడించారు. 'మేము మాట్లాడాల్సింది అయిపోయింది. మిగతా వాళ్ళు మాట్లాడాలి. మాట్లాడతారో లేదో చూద్దాం' అంటూ మిగతా హీరోలను టార్గెట్ చేశారు. ఈ క్రమంలో ఇప్పుడు మరోసారి నాని ఏపీ ప్రభుత్వం మీద ఆసక్తికరమైన కామెంట్స్ చేశారు.

కాగా, టికెట్ ధరలపై ఏపీ ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో నెం. 35ను రద్దు చేయాలని కోరుతూ కొందరు హైకోర్టుకు వెళ్లిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆ జీవోని రద్దు చేస్తూ న్యాయస్థానం తీర్పు చెప్పింది. అయితే సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ ప్రభుత్వం డివిజనల్ బెంచిలో అప్పీల్ చేసింది. ప్రస్తుతం దీనిపై విచారణ జరుగుతోంది. ఇకపోతే హైకోర్టు చెప్పిన దాని ప్రకారం జీవో రద్దు చేయబడినా.. టికెట్ రేట్లు పెంచుకోవాలంటే జాయింట్ కలెక్టర్ ముందస్తు అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది.