Begin typing your search above and press return to search.

నాని కెరీర్లో మరో గుర్తుండిపోయే పాత్ర

By:  Tupaki Desk   |   18 April 2016 7:30 AM GMT
నాని కెరీర్లో మరో గుర్తుండిపోయే పాత్ర
X
కెరీర్ ఆరంభం నుంచి భిన్నమైన సినిమాలు.. ప్రత్యేకమైన పాత్రలే చేస్తూ వస్తున్నాడు నాని. మధ్యలో వరుస ఫ్లాపులు ఎదురైనపుడు కూడా అతను రాజీ పడలేదు. వరుసగా రెండు మూడు ఫ్లాపులు ఎదురైన సమయంలో సైతం ‘ఎవడే సుబ్రమణ్యం’ లాంటి ప్రయోగాత్మక చిత్రం చేయడం అతడికే చెల్లింది. ఆ తర్వాత భలే భలే మగాడివోయ్.. కృష్ణగాడి వీర ప్రేమగాథ సినిమాల్లో కూడా నానికి మంచి పాత్రలు పడ్డాయి. ఈ హ్యాట్రిక్ హీరో తర్వాతి సినిమా మీద ఇప్పుడు అందరి దృష్టీ నిలిచి ఉంది. ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో నాని చేస్తున్న ‘జెంటిల్మన్’పై మంచి అంచనాలున్నాయి. ఇటీవలే రిలీజైన ఫస్ట్ లుక్ పోస్టర్ ప్రేక్షకుల్లో ఆసక్తి రేకెత్తించింది.

నాని పోస్టర్ మీద ‘హీరోనా.. విలనా’ అని వేసిన ట్యాగ్ లైన్ ఈ సినిమా వైవిధ్యంగా ఉండబోతోందన్న సంకేతాలిస్తోంది. ఈ సినిమా యూనిట్ నుంచి అందుతున్న సమాచారం ప్రకారం ఇందులో నాని పాత్ర చాలా కొత్తగా ఉంటుందట. కెరీర్లో తొలిసారి ఎక్కువ నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రను నాని చేస్తున్నట్లు సమాచారం. నాని పాత్ర రెండు రకాలుగా ఉంటుందని.. అది డ్యూయల్ రోల్ తరహాలో ఉంటుందని.. కానీ డ్యూయల్ రోల్ కాదని అంటున్నారు. ఇంతకుముందు పిల్ల జమీందార్.. ఎవడే సుబ్రమణ్యం లాంటి సినిమాల్లో ముందు నెగెటివ్ షేడ్స్ ఉండి.. తర్వాత రియలైజేషన్ వచ్చే పాత్రల్లో కనిపించాడు నాని. ఐతే ‘జెంటిల్మన్’లో నెగెటివ్ షేడ్స్ బాగా ఎక్కువుంటాయని సమాచారం. ఇది నాని కెరీర్లో మరో గుర్తుండిపోయే పాత్ర అవుతుందంటున్నారు. సీనియర్ ప్రొడ్యూసర్ శివలెంక కృష్ణ ప్రసాద్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో నాని సరసన నివేదా థామస్.. సురభి హీరోయిన్లుగా నటిస్తున్నారు. మణిశర్మ సంగీత దర్శకుడు.