Begin typing your search above and press return to search.

నేచుర‌ల్ స్టార్ నెక్ట్స్ లెవ‌ల్ ఎప్పుడు?

By:  Tupaki Desk   |   16 Sep 2019 4:20 AM GMT
నేచుర‌ల్ స్టార్ నెక్ట్స్ లెవ‌ల్ ఎప్పుడు?
X
ప్ర‌తీ హీరోకు ఫ్యాన్ వుంటాడు.. అయితే ఆ హీరోలంద‌రి ఫ్యాన్స్ ఇష్ట‌పడే హీరోలు చాలా అరుదు. అలా అంద‌రు హీరోల ఫ్యాన్స్ ని త‌న వైపు తిప్పుకున్న ఏకైక హీరో నేచుర‌ల్ స్టార్ నాని. ఎటో వెళ్లిపోయింది మ‌న‌సు- పైసా- జెండా పై క‌పిరాజు- ఆహా క‌ల్యాణం వంటి వ‌రుస ప‌రాజ‌యాల త‌రువాత `ఎవ‌డే సుబ్ర‌హ్మ‌ణ్యం` సినిమాతో మ‌ళ్లీ స‌క్సెస్‌ బాట ప‌ట్టాడు. `భ‌లె భలే మ‌గాడివోయ్‌` సినిమాతో ఓవ‌ర్సీస్ లో త‌న స‌త్తా చాటుకున్న నాని సినిమా సినిమాకి త‌న స్టార్ డ‌మ్ ని పెంచుకుంటూ పోతున్నాడు. దిల్ రాజు నిర్మించిన `ఎమ్ సీఏ` చిత్రంతో బాక్సాఫీస్ వ‌ద్ద డీసెంట్ మార్కెట్ ని క్రియేట్ చేసుకున్నాడు.

వ‌రుస‌గా నాలుగు చిత్రాల‌తో బాక్సాఫీస్ పై దండ‌యాత్ర చేయ‌డం క‌లిసొచ్చింది. ఇంత‌వ‌ర‌కూ బాగానే ఉంది కానీ నానీకి నెక్ట్స్ లెవ‌ల్ ఏది? అంటే మాత్రం సందిగ్ధ‌త నెల‌కొంది. నాని న‌టించిన తాజా చిత్రం `నానీస్ గ్యాంగ్ లీడ‌ర్‌`. విక్ర‌మ్ కె. కుమార్ డైరెక్ట్ చేసిన ఈ సినిమా తొలి రోజు 4 కోట్ల 50 ల‌క్ష‌ల గ్రాస్‌ని సాధించి ఫ‌ర్వాలేద‌నిపించింది. కొన్ని ఏరియాల్లో ఈ చిత్రానికి హైర్స్ రావ‌డం విశేషం. కృష్ణార్జున యుద్ధం- దేవ‌దాస్‌- జెర్సీ చిత్రాల‌కు ఒకే త‌ర‌హా ఓపెనింగ్స్ వ‌చ్చాయి. గ్యాంగ్ లీడ‌ర్ తొలి రోజు ఒపెనింగ్స్ ఆ మూడు చిత్రాల త‌ర‌హాలోనే కొన‌సాగాయి. ఓపెనింగ్ డే చూస్తే.. క‌లెక్ష‌న్స్ 4 కోట్ల 50 ల‌క్ష‌లు వ‌సూలైంది. జెర్సీ- 4 కోట్ల 50 ల‌క్ష‌లు, దేవ‌దాస్‌- 4 కోట్ల 61 ల‌క్ష‌లు, కృష్ణార్జున యుద్ధం- 4 కోట్ల 58 ల‌క్ష‌లు, నేను లోక‌ల్ - 4 కోట్ల 45 ల‌క్ష‌లు, నిన్ను కోరి- 4 కోట్ల 59 ల‌క్ష‌లు వ‌సూలు చేశాయి. అంటే నాని రేంజ్ ఒకేలా ఉండిపోయింది.

ఈ లెక్క‌ల‌ని బ‌ట్టి చూస్తుంటే నాని స్టార్‌డ‌మ్ ఒక‌ స్టేజ్‌కి వ‌చ్చ ఆగిపోయిందా? అన్న సందిగ్ధ‌త‌ నెల‌కొంది. అయితే ఇలా ఎందుకు జ‌రుగుతోంది? త‌న కంటే జూనియ‌ర్ హీరోలు త‌న స్పీడ్ ని ఓవ‌ర్ టేక్ చేస్తుంటే అత‌డు ఎత్తుగ‌డ‌లు ఎందుక‌ని మార్చ‌డం లేదు? దేవ‌ర‌కొండ న‌టించిన‌ డియ‌ర్ కామ్రేడ్‌- మ‌జిలీ- ఇస్మార్ట్ శంక‌ర్ చిత్రాలు `గ్యాంగ్ లీడ‌ర్` ని మంచి ప్రారంభ వ‌సూళ్ల‌ని సాధించాయి. నానీ రేంజును దాటేస్తున్నాయి. డియ‌ర్ కామ్రేడ్ - 6 కోట్ల 97 ల‌క్ష‌లు - ఇస్మార్ట్ శంక‌ర్ - 7 కోట్ల 83 ల‌క్ష‌లు - మ‌జిలీ - 5 కోట్ల 35 ల‌క్ష‌లు ప్రారంభ వ‌సూళ్లు సాధించి ముందు వ‌రుస‌లో నిలిచాయి. అంటే దీన‌ర్థం నానీకి మాస్ ప‌వ‌ర్ మ‌రింత‌గా క‌లిసి రావాలి. దూకుడు పెర‌గాల‌నే దీన‌ర్థం. అయితే అందుకు త‌గ్గ స్క్రిప్టుల్ని ఎంచుకోవాల‌న్న‌ది ఇంపార్టెంట్. నాని త‌దుప‌రి న‌టిస్తున్నవీ స‌హా లైన‌ప్ లో ఉన్న‌వేవీ పూర్తిగా మాసిజానికి సంబంధించిన‌విగా క‌నిపించ‌డం లేదు. అందుకే ఇప్పుడు మ‌రో మెట్టు పైకెక్కాలంటే నానీ ఇంకేదైనా మాస్ట‌ర్ ప్లాన్ వేయాలేమో!