Begin typing your search above and press return to search.

మరోసారి నాని జోడీ కట్టనున్న రష్మిక?

By:  Tupaki Desk   |   21 May 2021 11:30 AM GMT
మరోసారి నాని జోడీ కట్టనున్న రష్మిక?
X
తెలుగులో స్టార్ హీరోయిన్స్ రేసులో రష్మిక ఉంది. వరుస అవకాశాలు .. వరుస విజయాలు ఆమె దూకుడును మరింతగా పెంచుతున్నాయి. తెలుగులో 'సరిలేరు నీకెవ్వరు' .. ' భీష్మ' వంటి భారీ హిట్లు కొట్టేసిన రష్మిక, ప్రస్తుతం అల్లు అర్జున్ సరసన నాయికగా 'పుష్ప' సినిమా చేస్తోంది. ఈ సినిమాలో ఆమె గ్రామీణ యువతి పాత్రను పోషిస్తోంది. ఈ పాత్ర తనకి చాలా సంతృప్తిని కలిగించిందనీ, ఆడియన్స్ కి బాగా కనెక్ట్ అవుతుందని ఆమె చెప్పడంతో మరింతగా అంచనాలు పెరిగిపోతున్నాయి.

ఈ సినిమా తరువాత రష్మిక వేరే ప్రాజెక్టులపైకి వెళ్లనుంది. ఈ నేపథ్యంలోనే నాని జోడీగా ఆమె కనిపించే అవకాశాలు ఉన్నాయనే టాక్ ఫిల్మ్ నగర్లో బలంగా వినిపిస్తోంది. ఇటీవల 'వకీల్ సాబ్' సినిమాతో హిట్ కొట్టిన వేణు శ్రీరామ్ .. తదుపరి సినిమాను లైన్లో పెట్టే పనిలో ఉన్నాడు. ఆల్రెడీ కథను రెడీ చేసుకున్న ఆయన, పెద్ద బ్యానర్లతో సంప్రదింపులు జరుపుతున్నాడని అంటున్నారు. నానీని దృష్టిలో పెట్టుకునే ఆయన ఓ కథను రెడీ చేసుకున్నాడని చెబుతున్నారు.

ఇంతకు ముందు నాని - వేణు శ్రీరామ్ కాంబినేషన్లో తెరకెక్కిన 'మిడిల్ క్లాస్ అబ్బాయ్' సినిమా విజయాన్ని సాధించింది. అప్పటి నుంచి ఇద్దరి మధ్య మంచి సాన్నిహిత్యం ఉంది. అందువలన నానీని దృష్టిలో పెట్టుకునే కథను రెడీ చేసుకున్నాడని చెప్పుకుంటున్నారు. ఈ కథలో నాయిక పాత్రకి రష్మిక అయితే బాగుంటుందని ఆయన అనుకుంటున్నాడట. గతంలో 'దేవదేసు'లో నాని - రష్మిక సందడి చేశారు. మళ్లీ ఇప్పుడు ఈ ప్రాజెక్టు కోసం వాళ్ల పేర్లు వినిపిస్తున్నాయి. అటు నాని .. ఇటు రష్మిక వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. మరి వాళ్ల కాంబినేషన్లో ఓ ప్రాజెక్ట్ సెట్ కానుందనే ఈ వార్తలో వాస్తవమెంతన్నది చూడాలి.