Begin typing your search above and press return to search.

మంచు.. మంచు.. మధ్యలో కంచు

By:  Tupaki Desk   |   21 Jan 2017 10:15 AM GMT
మంచు.. మంచు.. మధ్యలో కంచు
X
సాధారణంగా వేర్వేరు హీరోల సినిమాలు ఒకేరోజున రిలీజ్ అయ్యే క్రమంలో కాస్త సంఘర్షణ వాతావరణం కనిపిస్తుంటుంది. పైకి ఎంత ఫ్రెండ్లీ మాటలు చెప్పినా లోలోన మాత్రం థియేటర్లు సంపాదించడం నుంచి ప్రమోషన్ వరకు అన్ని విషయాల్లోనూ ఎత్తుకు పైఎత్తులు పడుతుంటాయి. అయితే... తాజాగా ఇప్పుడు ఒకే కుటుంబంలోని నటుల మధ్య ఇలాంటి పరిస్థితి వచ్చింది. అయినా.. అందులో ఏ ఒక్కరూ తగ్గకుండా నువ్వే వాయిదా వేసుకో అంటే నువ్వే వాయిదా వేసుకో అంటూ సరదాగా కొట్లాడుతున్నారట. ఈ రిలీజ్ డేట్ ఫ్యామిలీ వార్ మంచు విష్ణు, ఆయన సోదరీమణి మంచు లక్ష్మిల మధ్య చోటుచేసుకుంది.

మంచు ల‌క్ష్మి వ‌ర్సెస్ మంచు విష్ణు మ‌ధ్య రిలీజ్ డేట్ వార్ సాగుతోందట. మంచు లక్ష్మి ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం ‘లక్ష్మి బాంబ్ – ఫ్రమ్ శివకాశి’. ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని చాలా రోజులు అయినా ఇప్ప‌ట‌కి రిలీజ్ కాలేదు. ముందుగా ఈ ల‌క్ష్మిబాంబ్‌ ను డిసెంబ‌ర్ 23న రిలీజ్ అనుకున్నారు. అయితే నోట్ల ర‌ద్దు ఎఫెక్ట్‌ తో వాయిదా వేశారు. త‌ర్వాత సంక్రాంతి సినిమాలు థియేట‌ర్ల‌ను ఆక్ర‌మించ‌డంతో ఈ సినిమా రిలీజ్‌ కు స‌రైన డేట్ ద‌క్క‌లేదు. ఎట్ట‌కేల‌కు ఈ సినిమాను ఫిబ్ర‌వ‌రి 3న రిలీజ్ చేసేందుకు నిర్మాత‌లు స‌న్నాహాలు చేస్తున్నారు.

అయితే, ఈలోగానే విష్ణు న‌టించిన ల‌క్కున్నోడు సినిమా రెడీ అయిపోయింది. దాన్ని కూడా అదే రోజు రిలీజ్ చేయడానికి నిర్మాతలు డిసైడ్ చేశారు. ఇలా వీరిద్ద‌రు న‌టించిన రెండు చిత్రాలు ఒకే రోజున బాక్సాఫీస్ వ‌ద్ద పోటీకి రెడీ అవుతున్నాయి. ఈ రెండు సినిమాల్లో విష్ణు సినిమా కామెడీ+యాక్ష‌న్ ఎంట‌ర్‌ టైన‌ర్‌ గా తెర‌కెక్కింది. ఇక ల‌క్ష్మి న‌టించిన ల‌క్ష్మిబాంబ్‌ లో ఆమె జ‌డ్జిగా క‌నిపించ‌నుంది. ఈ పాత్ర‌ పవర్ ఫుల్ గా ఉంటుందని తెలుస్తోంది. మ‌రి ఈ అక్కాత‌మ్ముళ్ల వార్‌ లో ఎవ‌రు పైచేయి సాధిస్తారో చూడాలి.

అయితే... సినీ విమర్శకులు మాత్రం ఇంకో మాట చెబుతున్నారు. వీరిద్దరూ ఒకరితో ఒకరు కొట్లాడడం కాదు... అదే రోజు సినిమా రిలీజ్ చేస్తున్న నానితో కొట్లాడితే కానీ ఫలితం ఉండదంటున్నారు. పెద్దపెద్ద సినిమాలకే దెబ్బేసిన అనుభవం ఉన్న నాని నటించిన నేను లోక‌ల్ సినిమా కూడా అదే రోజు రిలీజ్ అవుతుండడంతో వారు ఈ మాట చెబుతున్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/