Begin typing your search above and press return to search.

మంచి సినిమాకి అర్ధం తెలియని కుర్ర డైరెక్టర్లు

By:  Tupaki Desk   |   29 Jan 2017 9:35 AM GMT
మంచి సినిమాకి అర్ధం తెలియని కుర్ర డైరెక్టర్లు
X
హైదరాబాద్ లో జరుగుతున్న హైదరాబాద్ లిటరేచర్‌ ఫెస్టివల్ సందర్భంగా.. అనేక చర్చలు జరుగుతున్నాయి. వీటిలో 'అర్ధవమంతమైన సినిమా(మీనింగ్ ఫుల్ సినిమా) అనే టాపిక్ పై చర్చలో ప్రకాష్ రాజ్.. నందినీ రెడ్డిలు పాల్గొన్నారు. వీరు రావాల్సిన అసలు టైంకి.. ట్రాఫిక్ కారణంగా ఓ అరగంట ఆలస్యంగా వేదిక దగ్గరకు చేరుకున్నారు కానీ.. వచ్చిన తర్వాత ప్రతీ మాటా అక్కడున్న వారిని అలరించడం విశేషం. నందినీ రెడ్డి దృష్టిలో సాహిత్యం నుంచి అర్ధవంతమైన సినిమా వస్తుందని చెప్పారు దర్శకురాలు నందినీ రెడ్డి.

'ప్రస్తుత రోజుల్లో సాహిత్యం ఆధారంగా వస్తున్న సినిమాలు తెలుగులో కనిపించడం లేదు. ఈ తరం ఫిలిం మేకర్స్ లో చాలామంది తెగ సినిమాలు చూస్తుంటారు కానీ.. కనీస మాత్రంగా కూడా చదవడం లేదు. గతంలో అయితే సాహిత్యం నుంచి స్ఫూర్తిని పొంది సినిమాలు తీసేవాళ్లు. ఇప్పుడు ఎవరైనా ఫిలిం మేకర్ ని ఏమేం చదువుతారు అంటే.. నేను పుస్తకాలు చదవాల్సిన అసరం ఉందా అన్నట్లుగా చూస్తున్నారు' అని చెప్పారు నందినీ రెడ్డి. కమర్షియల్ సినిమాలు ప్రేక్షకుల చెంతకు వచ్చినంతగా.. ఇతర సినిమాలు రావెందుకు అనే ప్రశ్న ఆడియన్స్ నుంచి ప్రకాష్ రాజ్ కు ఎదురైంది.

'అర్ధవంతమైన సినిమాలు తీస్తే. అవి ఆడవని.. వారికి డబ్బులు రావనే అపోహలో ఉన్నారు కుర్ర ఫిలిం మేకర్స్. కానీ అది పూర్తి గా నిజం కాదు' అని ప్రకాష్ రాజ్ అంటే.. 'అర్ధవంతమైన సినిమా అంటే నా దృష్టిలో.. సినిమా చూసి థియేటర్ లోంచి బయటకు వచ్చాక కూడా.. ఆ సినిమాలోని పాట లేదా ఏదైనా సందేశం.. మన గుండెలో నాటుకునేలా ఉండడం' అని చెప్పారు నందినీ రెడ్డి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/