Begin typing your search above and press return to search.

దిల్ రాజు వెర్సస్ పృథ్వీ

By:  Tupaki Desk   |   15 Dec 2016 5:30 PM GMT
దిల్ రాజు వెర్సస్ పృథ్వీ
X
చాన్నాళ్ల తర్వాత ‘ధృవ’ రూపంలో ఓ భారీ సినిమా థియేటర్లలోకి దిగింది. ఈ సినిమా అంచనాలకు తగ్గట్లే మంచి విజయాన్నే అందుకుంది. ‘ధృవ’ థియేటర్లలో ఉండటంతో తర్వాతి వారం పెద్ద సినిమాలేవీ పోటీ లేవు. 16న రావాల్సిన ‘సింగం-3’ కూడా వాయిదా పడిపోయింది. సూర్య సినిమా ఖాళీ చేయగానే.. రెండు చిన్న బడ్జెట్ సినిమాలు రేసులోకి వచ్చేశాయి. అవే.. నాన్న నేను నా బాయ్ ఫ్రెండ్స్.. మీలో ఎవరు కోటీశ్వరుడు. ఈ వారం రాబోయే సినిమాలకు దర్శక నిర్మాతలు.. హీరోలు ఎవరైనా కానీ.. ఆ సినిమాలో ప్రధానంగా ఆకర్షిస్తున్న పేర్లు రెండు. ఒకటి దిల్ రాజుది.. ఇంకోటి పృథ్వీది.

‘నాన్న నేను నా బాయ్ ఫ్రెండ్స్’ సినిమాకు నిర్మాత బెక్కెం వేణుగోపాల్ అయినా.. ఆ చిత్రం దిల్ రాజు పేరు మీదే రిలీజవుతోంది. కంటెంట్ ఉన్న చిన్న సినిమాల్ని ప్రివ్యూ చూసి తన బేనర్ మీద రిలీజ్ చేయడం అలవాటున్న దిల్ రాజు.. ‘నాన్న నేను నా బాయ్ ఫ్రెండ్స్’ ప్రొడక్షన్ దశలో ఉండగానే ఆ చిత్రాన్ని తన బేనర్లో రిలీజ్ చేయడానికి ముందుకొచ్చాడు. దిల్ రాజు రిలీజ్ చేస్తున్నాడంటే.. ప్రేక్షకులకు కూడా ఆ సినిమాపై ఓ భరోసా ఉంటుంది. కొత్త డైరెక్టర్ భాస్కర్ బండి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో హెబ్బా పటేల్ లీడ్ రోల్ చేసింది. ఇక ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’ చిత్రానికి ప్రధాన ఆకర్షణ రైజింగ్ కమెడియన్ పృథ్వీనే. ఈ చిత్రంలో నవీన్ చంద్ర హీరో అయినా.. ఇది పృథ్వీ సినిమాలాగే ప్రచారం జరుగుతోంది. పోస్టర్లల్లో.. టీజర్.. ట్రైలర్లలో పృథ్వీనే హైలైట్ అయ్యాడు. అతడి కామెడీనే సినిమాకు ప్రధాన ఆకర్షణ అయ్యేలా ఉంది. ఇ.సత్తిబాబు దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని కె.కె.రాధామోహన్ నిర్మించాడు. మరి ఈ రెండు చిన్న సినిమాల పోరులో ఎవరు పైచేయి సాధిస్తారో చూడాలి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/