Begin typing your search above and press return to search.

మూవీ రివ్యూ : నాన్న నేను నా బాయ్ ఫ్రెండ్స్

By:  Tupaki Desk   |   16 Dec 2016 10:24 AM GMT
మూవీ రివ్యూ : నాన్న నేను నా బాయ్ ఫ్రెండ్స్
X
చిత్రం: ‘నాన్న నేను నా బాయ్ ఫ్రెండ్స్’

నటీనటులు: హెబ్బా పటేల్ - తేజస్వి - రావు రమేష్ - అశ్విన్ బాబు - పార్వతీశం - నోయెల్ - సన తదితరులు
సంగీతం: శేఖర్ చంద్ర
ఛాయాగ్రహణం: ఛోటా కె.నాయుడు
నిర్మాత: బెక్కెం వేణుగోపాల్
కథ- సాయికృష్ణ
స్క్రీన్ ప్లే - మాటలు: ప్రసన్న కుమార్
దర్శకత్వం: భాస్కర్ బండి

‘కుమారి 21 ఎఫ్’ తర్వాత హెబ్బా పటేల్ కీలక పాత్రలో తెరకెక్కిన మరో చిత్రం ‘నాన్న నేను నా బాయ్ ఫ్రెండ్స్’. కొత్త దర్శకుడు భాస్కర్ బండి రూపొందించిన ఈ చిత్రాన్ని దిల్ రాజు బేనర్ మీద రిలీజ్ చేస్తుండటంతో ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఏర్పడ్డాయి. ప్రోమోలతో ఆసక్తి రేపిన ఈ చిత్రం సినిమాగా ఏమేరకు అలరించేలా ఉందో చూద్దాం పదండి.

కథ:

రాఘవరావు (రావు రమేష్)కు పెళ్లయిన ఐదేళ్లకు పుట్టిన తన కూతురు పద్మావతి (హెబ్బా పటేల్) అంటే పంచప్రాణాలు. ఐతే వాళ్లిద్దరి జాతకాల ప్రకారం ఇద్దరికీ ఒక్క నిమిషం కూడా పడదని పంతులు చెప్పడంతో అప్పట్నుంచి కూతురి ఇష్టానికి తగ్గట్లు తను నడుచుకుంటూ ఆమెను పెంచి పెద్ద చేస్తాడు రాఘవరావు. చదువు పూర్తి చేసి సిటీలో ఉద్యోగం చేస్తున్న పద్దుకు పెళ్లి చేయాలని తల్లిదండ్రులు నిర్ణయిస్తారు. ఐతే ఆ పెళ్లి తప్పించుకోవడానికి తాను ఓ అబ్బాయిని ప్రేమిస్తున్నట్లు అబద్ధం చెబుతుంది పద్మావతి. ఆ అబద్ధాన్ని నిజం చేయడానికి ముగ్గురు అబ్బాయిల్ని చూసి వాళ్లలో తనకు సరిపోయే వాడిని ఎంచుకోవాలని భావిస్తుంది. మరి ఆ ముగ్గురితో పద్మావతి ప్రయాణం ఎలా సాగింది.. చివరికి ఆమె ఎవరిని పెళ్లి చేసుకుంది.. ఇందులో ఆమె తండ్రి పాత్ర ఏంటి అన్నది మిగతా కథ.

కథనం - విశ్లేషణ:

కొన్ని సినిమాలు బాగా ఆరంభమవుతాయి. కొన్ని సినిమాలు బాగా ముగుస్తాయి. ‘నాన్న నేను నా బాయ్ ఫ్రెండ్స్’ బాగా ఆరంభమై.. బాగానే ముగుస్తుంది. మధ్యలో నడిచేదంతా బోరింగ్ వ్యవహారమే. ఈ సినిమాలో ఆరంభం.. ముగింపు బాగుండటానికి కారణం రావు రమేష్. క్యారెక్టర్ మామూలుగా ఉన్నా సరే.. తన నటనతో దానికి ప్రత్యేకత తీసుకురావడానికి ప్రయత్నించే రావు రమేష్ ఇందులో కీలకమైన పాత్ర చేయడం సినిమాకు కలిసొచ్చింది. స్క్రీన్ మీద కనిపించినంత సేపూ తనకే సాధ్యమైన నటనతో రాఘవరావు పాత్రను పండించాడు రావు రమేష్.

చాలా మామూలు కథే అయినా.. కథనంలో లోపాలున్నా.. కామెడీ పేరుతో లాజిక్ లేకుండా ఇష్టానుసారం సన్నివేశాల్ని నడిపించేసినా.. చివరికి పర్వాలేదనిపించే ఫీలింగ్ తో ప్రేక్షకులు థియేటర్ నుంచి బయటకు వెళ్లేలా చేస్తుంది రావు రమేష్ క్యారెక్టర్. రావు రమేష్ పాత్రతో సినిమాను ఆరంభించిన తీరు చూస్తే.. ‘నాన్న నేను నా బాయ్ ఫ్రెండ్’ ప్రత్యేకమైన సినిమాలాగా అనిపిస్తుంది. కూతురికి.. తనకు జాతకాల రీత్యా పడదని తెలిశాక ఆమె కోసం తన అభిప్రాయాల్ని.. ఇష్టాయిష్టాల్ని మార్చుకునేలా తండ్రి పాత్రను తీర్చదిద్దిన తీరు ఆకట్టుకుంటుంది. తండ్రి పాత్ర కనిపించే 15-20 నిమిషాల కథనం కూడా ఆసక్తికరంగా సాగుతుంది.

ఐతే ఆ పాత్రను కట్ చేసి.. హీరోయిన్-ఆమె బాయ్ ఫ్రెండ్స్ మధ్య లవ్ స్టోరీలు మొదలుపెట్టాకే కథనం పూర్తి భిన్నంగా సాగుతుంది. యూత్ ఆడియన్స్ ను లక్ష్యంగా చేసుకుని కథనం నడుస్తుంది. ఇక్కడి నుంచి ‘చుక్కల్లో చంద్రుడు’ సినిమా చూపిస్తారు. అందులో హీరో.. తనకు జోడీగా ముగ్గురు అమ్మాయిల్ని ఎంచుకుని వాళ్లలో ఒకర్ని సెలక్ట్ చేసుకునే పనిలో పడ్డట్టే.. ఇందులో హీరోయిన్ ముగ్గురు అబ్బాయిల్ని ఎంచుకుని ఒకరిని ఫైనల్ చేయాలని చూస్తుంది. ఇక్కడి నుంచి సన్నీవేశాలన్నీ చాలా రొటీన్ గా సాగిపోతాయి. మాటి మాటికీ పవన్ కళ్యాణ్ రెఫరెన్సులు.. పేరడీ పాటలు.. జబర్దస్త్ కమెడియన్లతో లాజిక్ లేని కామెడీలతో ఏదో అలా అలా సాగిపోతుంది సినిమా. కామెడీ కొన్ని చోట్ల నవ్విస్తుంది.

ముగ్గురు హీరోలు ‘ఐ లవ్యూ’ చెప్పేచోట రొటీన్ గా ఇంటర్వెల్ బ్రేక్ ఇచ్చి... ఆ తర్వాత ద్వితీయార్ధంలో కన్ఫ్యూజింగ్ కామెడీతో లాక్కొచ్చేయాలని చూశారు. ఫోర్స్డ్ గా అనిపించే ఈ కామెడీ మాస్ ఆడియన్స్ ను కొంత వరకు ఆకట్టుకోవచ్చేమో కానీ.. సగటు ప్రేక్షకుడిని నిరాశ పరుస్తుంది. కామెడీ చాలా వరకు కథతో సంబంధం లేకుండా ఫోర్స్డ్ గా సాగుతుంది. ఇటు హీరోయిన్.. అటు హీరోల పాత్రలు వేటిలోనూ సీరియస్ నెస్ వుండదు. వీళ్ల మధ్య ప్రేమాయణాలు కూడా అలాగే ఉంటాయి.

ఐతే సిల్లీ సిల్లీ సన్నివేశాలతో సాగిపోతున్న సినిమా.. చివరికి వచ్చేసరికి ఉన్నట్లుండి సీరియస్ టర్న్ తీసుకుంటుంది. రావు రమేష్ పాత్ర మళ్లీ లీడ్ తీసుకుని సినిమాకు మంచి ముగింపునిస్తుంది. చివర్లో మెలో డ్రామా ఎక్కువైనట్లు అనిపించినా.. క్లైమాక్స్ ఆకట్టుకుంటుంది. హీరోయిన్ హీరోలతో ప్రవర్తించే తీరుకు రావు రమేష్ పాత్ర ద్వారా జస్టిఫికేషన్ ఇచ్చిన తీరు బాగుంది. తెరమీద కనిపించకపోయినా తెర వెనుక తండ్రి పాత్ర ఏమేం చేసింది వివరించే ప్రి క్లైమాక్స్ ఆకట్టుకుంటుంది. రాజ్ తరుణ్ పాత్ర ద్వారా సినిమాకు ఇచ్చిన ముగింపు కూడా బాగుంది. ఆరంభంలో పావు గంట.. చివర్లో పావు గంట సినిమా ఒక రకంగా సాగుతుంది. మధ్యలో ఇంకో రకంగా సాగుతుంది. ఇటు ఫ్యామిలీ.. అటు యూత్ ఆడియన్స్ ఇద్దరినీ ఆకట్టుకోవాలన్న ప్రయత్నంలో సినిమా కొంచెం కలగాపులగం అయింది. అందుకే సినిమా చూసిన ప్రేక్షకుడికి మిశ్రమానుభూతి కలుగుతుంది.

నటీనటులు:

నటన పరంగా ఈ సినిమాలో రావు రమేష్ పరంగా ఎవరికీ పెద్దగా పెర్ఫామ్ చేసే అవకాశం దక్కలేదు. హెబ్బా పటేల్ తనకు అలవాటైన రీతిలో ఒకే రకం హావభావాలతో లాగించేసింది. చివర్లో వచ్చే సెంటిమెంటు సీన్లలో ఆమె తేలిపోయింది. గ్లామర్ పరంగా ఆమె బాగానే మెప్పిస్తుంది. రావు రమేష్ స్క్రీన్ టైం తక్కువే కానీ.. వున్నంతసేపూ ఆయన తన ప్రత్యేకత చాటుకున్నాడు. ప్రారంభ సన్నివేశాల్లో.. ముగింపులో రావు రమేష్ తనదైన శైలిలో నటించి మెప్పించారు. ముగ్గురు హీరోల పాత్రలు కథలో నామమాత్రమే. పార్వతీశం తన కామెడీ టైమింగ్ తో ముగ్గురిలోకి కొంచెం భిన్నంగా కనిపిస్తాడు. అశ్విన్.. నోయెల్ ఓకే. తేజస్వి కూడా తనకు అలవాటైన హీరోయిన్ ఫ్రెండు పాత్రలో ఈజీగా నెట్టుకొచ్చేసింది.

సాంకేతిక వర్గం:

శేఖర్ చంద్ర సంగీతం పర్వాలేదు. మౌనమా మౌనమా.. వెయిటింగ్.. పాటలు ఆకట్టుకుంటాయి. నేపథ్య సంగీతం కొంచెం రొటీన్ గా అనిపిస్తుంది. ఛోటా కె.నాయుడు ఛాయాగ్రహణం ఓకే. చిన్న సినిమానే అయినా నిర్మాణ విలువలు పర్వాలేదు. సాయికృష్ణ కథ రొటీన్. ప్రసన్న కుమార్ మాటల్లో కొన్ని ఎన్నదగ్గవి వున్నాయి. ‘‘నా కూతురు అడిగితే ప్రాణం తప్ప ఏమైనా ఇచ్చేస్తా.. ప్రాణం ఎందుకివ్వనంటే తర్వాత తన కోరికల తీర్చడానికి నేనుండాలి కదా’’.. లాంటి కొన్ని డైలాగులు ఆకట్టుకుంటాయి. కొత్త దర్శకుడు భాస్కర్ బండి పర్వాలేదనిపించాడు. కామెడీని.. సెంటిమెంటును మిక్స్ చేసే క్రమంలో తడబడ్డాడు. అతను చాలా వరకు కమర్షియల్ సినిమాల స్టయిల్లో సినిమాను నడిపించాడు.

చివరగా: నాన్న మెప్పించాడు కానీ...

రేటింగ్: 2.5 /5

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/


Disclaimer : This Review is An Opinion of Review Writer. Please Do Not Judge The Movie Based On This Review And Watch Movie in Theatre