Begin typing your search above and press return to search.

ఇలాంటి ఆడియో ఫంక్షన్ నభూతో..

By:  Tupaki Desk   |   28 Dec 2015 6:02 AM GMT
ఇలాంటి ఆడియో ఫంక్షన్ నభూతో..
X
బహుశా ఈ మధ్య కాలంలో ఏ ఆడియో ఫంక్షన్ కూడా ఇంత అర్థవంతంగా.. ఇంత ఎమోషనల్ గా జరిగి ఉండదేమో. ఓ ఆడియో ఫంక్షన్ లో మ్యూజిక్ డైరెక్టర్ ఏడవడం.. ఫంక్షన్ కు వచ్చిన అందరూ కన్నీళ్లు పెట్టేసుకోవడం.. అందరూ తమ తండ్రుల్ని గుర్తు చేసుకుని ఎమోషనల్ అవడం.. ప్రేక్షకులు లేచి నిలబడి స్టాండింగ్ ఒవేషన్ ఇవ్వడం.. ఇలా ‘నాన్నకు ప్రేమతో’ ఆడియో ఫంక్షన్ మిగతా వేడుకలకు చాలా భిన్నంగా సాగింది.ఈ వేడుక అంతా దాదాపుగా దేవిశ్రీ చుట్టూనే తిరిగింది. తండ్రి చనిపోయిన మూడో రోజుకే దేవి ‘నాన్నకు ప్రేమతో’ పని మొదలుపెట్టడం గురించి డైరెక్టర్ సుకుమార్.. హీరో ఎన్టీఆర్ గొప్పగా మాట్లాడారు. సినిమాలు చూస్తున్నపుడు కన్నీళ్లు వచ్చేస్తుంటాయని దేవి చెబుతుంటాడు కానీ.. అతడి కళ్లల్లో ఎప్పుడూ కన్నీళ్లు చూడలేదని.. కానీ తన తండ్రి చనిపోయినపుడు మాత్రం పిల్లాడిలా మారిపోయి ఏడ్చాడని సుక్కు చెప్పాడు. ఎన్టీఆర్ మాట్లాడుతూ దేవి గొప్పదనాన్ని చెప్పినపుడైతే ఆడిటోరియం అంతా ఎమోషనల్ అయిపోయింది. లేచి నిలబడి స్టాండింగ్ ఒవేషన్ ఇచ్చింది. దేవి ఏడ్చేశాడు.

ఒక తండ్రి గొప్పదనం చెబుతూ సుక్కు చేసిన ప్రసంగం.. తన తండ్రి చనిపోయాక ఆయన ఎమోషన్లోంచి ఈ కథ పుట్టిందని చెప్పడం.. సుక్కు ఎలాంటి స్థితిలో ఈ కథ రాశాడో ఎన్టీఆర్ చెప్పడం.. జనాల్ని కదిలించాయి. ఇక కళ్యాణ్ రామ్ కూడా తన తండ్రి హరికృష్ణ గొప్పదనం గురించి గొప్పగా మాట్లాడగా.. హరికృష్ణ తన తండ్రి ఎన్టీఆర్ తన చిన్న కొడుక్కి పేరు పెట్టిన వైనం గుర్తు చేసుకున్నారు. ఎన్టీఆర్ కు తండ్రి మీద ఉన్న ప్రేమ గురించి వినాయక్ ప్రస్తావించాడు.

ఈ సినిమాకు ఛాయాగ్రాహకుడిగా పనిచేసిన విజయ్ కె.చక్రవర్తి కూడా షూటింగ్ సందర్భంగా ఎంత ఎమోషనల్ అయింది ఎన్టీఆర్ గుర్తు చేసుకున్నాడు. ఓ సీన్లో తాను పెర్ఫామ్ చేస్తుంటే చేతిలో కెమెరా పట్టుకుని షూట్ చేస్తూ చాలా ఎమోషనల్ అయిపోయి విజయ్ ఏడ్చేశాడని.. అతడికి తన తండ్రి మీద అంత ప్రేమ అని ఎన్టీఆర్ చెప్పాడు. మరోవైపు జగపతి కూడా తన తండ్రి రాజేంద్ర ప్రసాద్ ను గుర్తు చేసుకుని.. ఆయన చివరి కోరిక ప్రకారం ‘జగపతి పిక్చర్స్’ బేనర్ మీద మళ్లీ సినిమాలు తీస్తానని చెప్పాడు. మొత్తంగా ‘నాన్నకు ప్రేమతో’ ఆడియో వేడుక చాలా ఎమోషనల్ సాగి అందరినీ కదిలించింది.