Begin typing your search above and press return to search.

నాన్నకు ప్రేమతో.. అక్కడ మాత్రం నష్టాలే

By:  Tupaki Desk   |   25 Jan 2016 3:30 PM GMT
నాన్నకు ప్రేమతో.. అక్కడ మాత్రం నష్టాలే
X
‘నాన్నకు ప్రేమతో’ ఎన్టీఆర్ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ అవుతుందనడంలో సందేహమే లేదు. ఎన్టీఆర్ కు తీరని కలలా ఉన్న 50 కోట్ల మార్కును కూడా ఈ సినిమా అందుకోవడం ఖాయమే అనుకోవచ్చు. ఎందుకంటే తొలి వారంలోనే ఈ సినిమా రూ.43 కోట్ల షేర్ కలెక్ట్ చేసింది. రెండో వారం కొత్తగా సినిమాలేమీ లేకపోవడంతో మంచి కలెక్షన్లే వస్తున్నాయి. రెండో వీకెండ్ తర్వాత ఈ సినిమా 50 కోట్ల మార్కుకు చేరువగా ఉండే అవకాశముంది. మరోవైపు యుఎస్ లో మంచు ప్రభావం తగ్గితే 2 మిలియన్ మార్కు కూడా పెద్ద కష్టమేమీ కాదు. అక్కడ బయ్యర్ ఇప్పటికే లాభాల్లో ఉన్నాడు. తెలుగు రాష్ట్రాల్లో కూడా బయ్యర్లు కొన్ని చోట్ల బ్రేక్ ఈవెన్ కు వచ్చేశారు. కర్ణాటకలో డిస్ట్రిబ్యూటర్ ఆల్రెడీ లాభాల్లో ఉన్నాడు.

ఐతే మిగతా ఏరియాల సంగతేమో కానీ.. నైజాంలో మాత్రం ‘నాన్నకు ప్రేమతో’ చివరికి లాస్ వెంచర్ అయ్యేలా కనిపిస్తోంది. అక్కడి డిస్ట్రిబ్యూటర్ అభిషేక్ మరీ ఎక్కువ పెట్టుబడి పెట్టేయడమే దీనికి కారణం. దిల్ రాజు పోటీలో ఉండటంతో ఆయన అందుకోలేని రేటు ఇవ్వాలనే ఉద్దేశంతో ఏకంగా రూ.14.5 కోట్లు పెట్టి ‘నాన్నకు ప్రేమతో’ చిత్రాన్ని చాలా ముందే కొనేశాడు అభిషేక్. ఈ ఏరియాలో కలెక్షన్లు బాగానే వస్తున్నాయి. ఇప్పటికే నైజాంలో ఎన్టీఆర్ కెరీర్ లోనే అత్యధిక వసూళ్ల రికార్డును కూడా దాటేసింది ‘నాన్నకు ప్రేమతో’. అయినప్పటికీ ఇంకా పది కోట్ల మార్కు కూడా అందుకోలేదు. రెండో వీకెండ్ ముగిసేసరికి నైజాం ఏరియా షేర్ రూ.9.73 కోట్లుగా తేలింది. అంటే ఇంకా దాదాపు ఐదు కోట్లు వస్తే తప్ప బయ్యర్ సేఫ్ కాడు. రెండో వీకెండ్ కూడా అయిపోయింది కాబట్టి.. ఇక ఆ మార్కును అందుకోవడం అసాధ్యమనే చెప్పాలి. ఎంత బాగా పెర్ఫామ్ చేసినా.. బయ్యర్ కి రెండు మూడు కోట్ల నష్టం తప్పేలా లేదు.