Begin typing your search above and press return to search.

మనసులు దోచారు మరి వసూళ్లు ?

By:  Tupaki Desk   |   24 Sep 2018 8:40 AM GMT
మనసులు దోచారు మరి వసూళ్లు ?
X
ఇప్పుడున్న పరిస్థితుల్లో సినిమాలో కంటెంట్ ఎంత బాగున్నా అది జనానికి సరైన రీతిలో చేరి కనెక్ట్ అయినప్పుడే అది కలెక్షన్ రూపంలో మారి నిర్మాతకు నాలుగు డబ్బులు మిగులుతాయి. అంతే తప్ప సోషల్ మీడియాలోనో లేక ప్రీమియర్ షో అయిపోగానే బయటికి వచ్చే జనం ముందుండే మైకుల్లోనో బాగుంది అనే మాట దానికి సరిపోదు. సుధీర్ బాబు లేటెస్ట్ హిట్ నన్ను దోచుకుందువటే ఇప్పుడు ఈ పరిస్థితినే ఎదుర్కుంటోంది. విడుదలైన మొదటి రోజే పబ్లిక్ టాక్ తో సహా మీడియా వర్గాల నుంచి అధిక శాతం ఈ సినిమాకు చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. దర్శకుడు ఆరెస్ నాయుడు కొత్తవాడైనా సబ్జెక్టు ను టేకప్ చేసిన తీరు నభా నటేష్ యాక్టింగ్ సుధీర్ బాబు ప్రొడక్షన్ వెరసి అన్నింటి మీద పాజిటివ్ ఫీడ్ బ్యాక్ వచ్చింది. కానీ విచిత్రంగా అది బాక్స్ ఆఫీస్ వసూళ్ల రూపంలో మాత్రం కనిపించడం లేదు. వీక్ ఎండ్ పూర్తయ్యాక బిసి సెంటర్స్ లో చాలా డ్రాప్ కనిపిస్తుండగా సరైన ప్రమోషన్ చేయని కారణంగా ఇలాంటి వాటికి మంచి ఆదరణ ఉండే యుఎస్ లో కలెక్షన్స్ సైతం ఏమంత ఘనంగా లేవు.

సినిమా బాగున్నప్పుడు జనం థియేటర్ దాకా రావాలి కదా అనే ప్రశ్న ఉత్పన్నం కావడం సహజం. నిజానికి నన్ను దోచుకుందువటే లవ్ అండ్ ఎంటర్ టైన్ మెంట్ విషయంలో మెప్పించినప్పటికీ ఇందులో మరీ వైవిధ్యం అనిపించే పాయింట్ లేకపోవడం కొంతమేర బిసి సెంటర్స్ ప్రేక్షకులు దూరం కావడానికి దోహదం చేసింది. పైగా విడుదల ముందు రోజు ఓ చిన్న కాంటెస్ట్ పెట్టి పది ఫ్రీ టికెట్లు ఇస్తామని చెప్పడం తప్ప ఓవర్సీస్ ప్రమోషన్ విషయంలో సుధీర్ బాబు టీమ్ ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నట్టు కనిపించలేదు. అందుకే ఇంచుమించు ఇదే టాక్ తో వచ్చిన సమ్మోహనం కంటే నన్ను దోచుకుందువటే తక్కువ పెర్ఫార్మ్ చేయడానికి కారణంగా చెప్పొచ్చు. మరి పికప్ అవుతుందా అంటే కష్టమే అంటోంది ట్రేడ్. మూడు రోజుల వ్యవధిలో నాగ్ నానిల దేవదాస్ వస్తోంది. అదే రోజు మణిరత్నం నవాబ్ ఉంది. ఇవి చాలదు అన్నట్టు మరుసటి రోజు ఏ సెంటర్స్ లో కాస్త పోటీ ఇచ్చేలా అనుష్క శర్మ సూయ్ ధాగా వస్తోంది. సో నన్ను దోచుకుందువటే వసూళ్లలో అనూహ్య మార్పు రావాలి అంటే ఏదైనా అద్భుతం జరగాలి. బడ్జెట్ లో తీశారు కాబట్టి జరిగిన బిజినెస్ ప్రకారం హక్కుల రూపంలో వచ్చే ఆదాయం లెక్కల్లో చూసుకుంటే నష్టం రాకపోవచ్చు కానీ సుధీర్ బాబు కోరుకున్న రేంజ్ లో ఇది నిలవడం అనుమానమే.