Begin typing your search above and press return to search.

నారా రోహిత్ ఈజ్ బ్యాక్

By:  Tupaki Desk   |   29 Jun 2016 10:48 AM IST
నారా రోహిత్ ఈజ్ బ్యాక్
X
వైవిధ్యమైన సినిమాలు చేస్తూ మంచి సక్సెస్ రేట్ తో సాగిపోతూ వచ్చిన నారా రోహిత్.. ఈ మధ్య ఎదురు దెబ్బలు తిన్నాడు. నెలన్నర వ్యవధిలో మూడు సినిమాలు రిలీజ్ చేశాడు కానీ.. అందులో ‘తుంటరి’ కమర్షియల్ గా సక్సెస్ అయినా.. ‘సావిత్రి’.. ‘రాజా చెయ్యి వేస్తే’ ఆశించిన ఫలితాల్నివ్వలేదు. దీంతో రోహిత్ కొంచెం స్పీడు తగ్గించాడు. కొన్ని రోజుల పాటు వార్తల్లో లేకుండా పోయిన రోహిత్.. తన కొత్త సినిమా ‘కథలో రాజకుమారి’లో మళ్లీ లైమ్ లైట్లోకి వచ్చాడు. ఈ సినిమాతో మహేష్ సూరపనేని అనే కొత్త దర్శకుడు తెలుగు తెరకు పరిచయమవుతున్నాడు. ఈ సినిమాకు సంబంధించి రోహిత్ లుక్స్ బయటికి వచ్చాయి. ఎప్పట్లాగే కొంచెం బొద్దుగా.. సీరియస్ గా దర్శనమిస్తున్నాడు రోహిత్.

ఈ సినిమాకు సంబంధించి పెద్ద విశేషం ఏంటంటే.. మేస్ట్రో ఇళయరాజా సంగీతాన్నందిస్తున్నాడు. రోహిత్ సినిమాకు ఆయన సంగీతాన్నందించడం ఇదే తొలిసారి. కథాకథనాలు చాలా ప్రత్యేకంగా ఉంటే తప్ప ఇళయరాజా సినిమా ఒప్పుకోరు. మరి ‘కథలో రాజకుమారి’లో ఏం ప్రత్యేకత ఉందో చూడాలి. మలయాళ భామ నమిత ప్రమోద్‌.. రోహిత్ సరసన కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రాన్ని.. మాగ్నస్‌ సినీప్రైమ్‌ ప్రై. లిమిటెడ్‌ పతాకంపై 'కార్తికేయ' శ్రీనివాస్‌ నిర్మిస్తున్నారు. సినిమా విశేషాల గురించి నిర్మాత చెబుతూ.. ‘‘పరిణతి చెందిన ఓ జంట మధ్య జరిగే భావోద్వేగాలతో కూడుకున్న ప్రేమకథ ఇది. ప్రస్తుతం హైద్రాబాద్‌ పరిసర ప్రాంతాలలో షూటింగ్‌ జరుగుతుంది. జూన్‌ 27 నుండి జూలై 15 వరకు జరిగే షెడ్యూల్‌ తో టాకీ పార్ట్.. మూడు పాటలు పూర్తవుతాయి. ఆగస్టులో సినిమా పూర్తవుతుంది. జులై రెండో వారంలో ఫస్ట్‌ లుక్‌ రిలీజ్ చేస్తాం’’ అని తెలిపాడు.