Begin typing your search above and press return to search.

నారా రోహిత్ 15 నిమిషాల తర్వాతే అనమాట

By:  Tupaki Desk   |   31 March 2016 6:33 AM GMT
నారా రోహిత్ 15 నిమిషాల తర్వాతే అనమాట
X
కోర్టు వ్యవహారాలకు సంబంధించి.. సహజ న్యాయ సూత్రాలు అన్న మాట ఒకటి వినిపిస్తుంటుంది. అలాగే తెలుగు సినిమాల విషయంలో కూడా ‘సహజ సినిమా సూత్రాలు’ అని కొన్ని ఉంటాయి. ఆ సూత్రాల ప్రకారం మన సినిమాల్లో కథంతా హీరో చుట్టూనే తిరగాలి. టైటిల్స్ పడగానే హీరో కనిపించాలి. అతడి మీద ఫైటో పాటో ఉండాలి.. ఆ తర్వాత మిగతా పాత్రల్ని పరిచయం చేయాలి. కానీ ఈ మధ్య మన రచయితలు.. దర్శకుల ఆలోచనలు మారుతున్నాయి. హీరోల్లో కూడా చాలా మార్పు కనిపిస్తోంది. మారుతున్న ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్లు కథల్లో కొత్తదనాన్ని చూపించడానికి ప్రయత్నిస్తున్నారు. హీరో ఇమేజ్ గురించి పట్టించుకోకుండా కథానుసారం నడవడానికి ఆసక్తి చూపిస్తున్నారు. నారా రోహిత్ కెరీర్ ఆరంభం నుంచి కూడా ఇలాంటి వైవిధ్యమైన దారిలోనే నడుస్తున్నాడు.

రోహిత్ సినిమాల్లో కథ ప్రకారం హీరో ఉంటాడు తప్ప.. హీరో కోసం కథ ఉండదు. అతడి సినిమాలన్నింటినీ పరిశీలిస్తే ఈ విషయం అర్థమవుతుంది. రోహిత్ కెరీర్ లో పెద్ద ఫ్లాప్ గా నిలిచిన ‘ఒక్కడినే’లో సైతం మంచి కథ ఉందన్న సంగతి ప్రేక్షకులే అంగీకరిస్తారు. రోహిత్ మిగతా సినిమాల గురించి చెప్పాల్సిన పని లేదు. తన కొత్త సినిమా ‘సావిత్రి’ విషయంలో కూడా రోహిత్ కథకు ఎంత పెద్ద పీట వేశాడో దర్శకుడు పవన్ సాధినేని చెబుతూ.. ‘‘నిజానికి నేను రోహిత్ తో చేయాలనుకున్న సినిమా ఇది కాదు. వేరే కథ చెప్పాను. ఐతే అంతకుముందే ఆయనకు ‘సావిత్రి’ కథ గురించి తెలిసి.. అది ఏమైందని అడిగాడు. ఐతే అందులో సినిమా ఆరంభమైన 15 నిమిషాలకు కానీ హీరో పాత్ర కనిపించదని.. అందుకే దాన్ని పక్కనబెట్టానని చెప్పాను. ఐతే రోహిత్ మాత్రం.. ‘సినిమా అంతా హీరోనే కనిపించాలని లేదు కదా. పర్వాలేదు. ఆ కథే చేద్దాం’ అన్నాడు. అలా సావిత్రి తెరమీదికి వచ్చింది’’ అని చెప్పాడు పవన్.