Begin typing your search above and press return to search.

బాలయ్యకు చెప్పాకే.. బాలకృష్ణుడు

By:  Tupaki Desk   |   22 Nov 2017 7:01 AM GMT
బాలయ్యకు చెప్పాకే.. బాలకృష్ణుడు
X
చిరంజీవి హీరోగా ‘చిరంజీవి’ అనే సినిమా వచ్చింది. నాగార్జున హీరోగా ‘కెప్టెన్ నాగార్జున’ అనే సినిమా తీశారు. ఇక యువ కథానాయకుల్లో అల్లు అర్జున్ ముద్దు పేరుతో ‘బన్నీ’.. మహేష్ ముద్దు పేరుతో ‘నాని’ కూడా వచ్చాయి. అఖిల్ తన సినిమాకు ‘అఖిల్’ అనే పేరు పెట్టుకున్నాడు. ఐతే సీనియర్ హీరో బాలకృష్ణ మాత్రం తన పేరుతో సినిమా చేయలేదు. ఐతే ఆయన పేరును మరొకరు వాడేసుకున్నారు. అతనే.. నారా రోహిత్. అతను కథానాయకుడిగా తెరకెక్కిన ‘బాలకృష్ణుడు’ ఈ శుక్రవారమే ప్రేక్షకుల ముందుకొస్తోంది. నారా బాబుకు బాలయ్య బంధువు.. సన్నిహితుడే అయినప్పటికీ ఈ టైటిల్ విషయంలో బాలయ్యకు అభ్యంతరాలేమీ ఉండి ఉండవా అన్న సందేహాలు జనాల్లో ఉన్నాయి.

ఐతే బాలయ్యకు చెప్పాకే ‘బాలకృష్ణుడు’ అనే టైటిల్ వాడుకున్నట్లు నారా రోహిత్ చెప్పాడు. ఈ సినిమా మొదలయ్యేటప్పటికి టైటిల్ ఏమీ అనుకోలేదని.. ఐతే ఏం టైటిల్ పెడదామా అని ఆలోచించినపుడు దర్శకుడు పవన్ మల్లెల ‘బాలకృష్ణుడు’ పేరు సూచించాడని.. ఐతే ముందు బాలయ్య అనుమతి తీసుకుందామని అనుకున్నామని రోహిత్ చెప్పాడు. ఈ టైటిల్ కోసం బాలయ్యను అడిగితే.. ఆయన ఎలాంటి అభ్యంతరాలు చెప్పలేదని.. నవ్వుతూ ఓకే చెప్పారని రోహిత్ వెల్లడించాడు. ‘బాలకృష్ణుడు’ పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్ అని.. మాస్ ప్రేక్షకుల్ని బాగా అలరించి మంచి విజయం సాధిస్తుందని నారా రోహిత్ ధీమా వ్యక్తం చేశాడు.