Begin typing your search above and press return to search.

ఆ సినిమా పదేళ్ల ముందు చేయాల్సిందట

By:  Tupaki Desk   |   23 Aug 2018 1:30 AM GMT
ఆ సినిమా పదేళ్ల ముందు చేయాల్సిందట
X
టాలీవుడ్లో చాలామంది హీరోలు రొటీన్ సినిమాలు చేస్తూ వచ్చి.. కొంచెం లేటుగా విభిన్నమైన సినిమాల వైపు అడుగులు వేశారు. కానీ నారా రోహిత్ మాత్రం దీనికి పూర్తి భిన్నం. చిన్నా పెద్దా అని తేడా లేకుండా చాలామంది హీరోలు కమర్షియల్ సినిమాలే చేస్తున్న సమయంలో అతను కొత్త తరహా సినిమాలు చేశాడు. కెరీర్ ఆరంభం నుంచి భిన్నమైన దారిలో నడిచాడు. కానీ అందరూ మార్పు వైపు అడుగులేస్తున్న సమయంలో ‘బాలకృష్ణుడు’ లాంటి రొటీన్ కమర్షియల్ సినిమా చేశాడు. ఆ సినిమా డిజాస్టర్ అయింది. ఈ టైంలో ఆ చిత్రం చేయడం తప్పే అంటున్నాడు రోహిత్. పదేళ్ల ముందు ఈ కథ చేసి ఉంటే మంచి ఫలితం ఉండేదేమో అని అతనన్నాడు. తాను ఎప్పుడూ కొత్తదనం కోసమే ప్రయత్నిస్తూ వచ్చానని.. దీంతో ఒక వర్గం ప్రేక్షకులకే పరిమితం అయిపోయానని.. అందరికీ చేరువవ్వాలనే ఉద్దేశంతో కమర్షియల్ సినిమా ట్రై చేశానని రోహిత్ తెలిపాడు.

ఐతే ఇప్పుడు తాను రెండు రకాలుగా బ్యాలెన్స్ చేసుకుంటూ ఎక్కువమంది ప్రేక్షకులకు చేరువయ్యేలా సినిమాలు ఎంచుకుంటున్నానని అతనన్నాడు. తన కొత్త సినిమా ‘ఆటగాళ్ళు’ ఆ కోవలోని సినిమానే అన్నాడు. ఇందులో కొత్తదనం ఉంటుందని.. అలాగే దర్శకుడు పరుచూరి మురళి మార్కు కమర్షియల్ అంశాలు కూడా ఉంటాయని రోహిత్ చెప్పాడు. ఇంతకుముందు కథ నచ్చితే ఇంకేమీ చూడకుండా చకచకా సినిమాలు చేసేసేవాడినని.. కానీ ఇప్పుడు కొంచెం ఆగి అన్ని విషయాలూ చూసుకుని సినిమాలు ఎంచుకుంటుండటంతో తన స్పీడు తగ్గిందని రోహిత్ తెలిపాడు. ఇక తన కొత్త ప్రాజెక్టుల గురించి వివరిస్తూ.. ‘వీరభోగ వసంత రాయలు’ త్వరలోనే విడుదలవుతుందని.. ఆ తర్వాత మూగవాడిగా కనిపించే ‘శబ్దం’ అనే సినిమా చేస్తున్నానని.. దాంతో పాటుగా ‘బాణం’ ఫేమ్ చైతన్య దంతులూరితో ‘అనగనగా దక్షిణాదిలో’ అనే తెలుగు.. తమిళ ద్విభాషా చిత్రం చేస్తానని రోహిత్ తెలిపాడు.