Begin typing your search above and press return to search.

మూడు నెలల్లో నారా సినిమాలు మూడు

By:  Tupaki Desk   |   25 July 2017 6:16 AM GMT
మూడు నెలల్లో నారా సినిమాలు మూడు
X
పోయినేడాది ఏకంగా అరడజను సినిమాలతో పలకరించాడు నారా రోహిత్. అందులో కొన్ని సినిమాలు చేదు అనుభవాలు మిగిల్చినప్పటికీ.. ‘జ్యో అచ్యుతానంద’.. ‘అప్పట్లో ఒకడుండేవాడు’ మంచి విజయం సాధించి రోహిత్ కెరీర్ కు మంచి ఊపు తెచ్చాయి. ‘అప్పట్లో ఒకడుండేవాడు’ తర్వాత ఆరు నెలలకు పైగా రోహిత్ సినిమా ఏదీ రాలేదు. ఐతే ఈ నెలలో మళ్లీ నారా బాబు జోరు మొదలైంది. జులై మధ్యలో మల్టీస్టారర్ మూవీ ‘శమంతకమణి’తో పలకరించాడు రోహిత్. అది పర్వాలేదనిపించింది. ఇక తర్వాతి రెండు నెలల్లో రెండు ఇంట్రెస్టింగ్ మూవీస్ తో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు నారా వారబ్బాయి.

ఇప్పటికే విడుదలకు సిద్ధమై.. మంచి రిలీజ్ డేట్ కోసం చూస్తున్న ‘కథలో రాజకుమారి’ ఎట్టకేలకు విడుదల తేదీని ఖరారు చేసుకుంది. ఆగస్టు 25న ఈ చిత్రాన్ని విడుదల చేస్తారట. ఈ రోజే ప్రకటన వచ్చింది. ఈ సినిమాపై ముందు నుంచి పాజిటివ్ బజ్ ఉంది. మరోవైపు నిన్ననే రోహిత్ కొత్త సినిమా ‘బాలకృష్ణుడు’ ఫస్ట్ లుక్ లాంచ్ అయిన సంగతి తెలిసిందే. ఆ సినిమా పోస్టర్ మీదే ఇది సెప్టెంబరులో రిలీజవుతుందని ప్రకటించారు. సెప్టెంబర్లో పెద్ద సినిమాల తాకిడి కొంచెం గట్టిగానే ఉన్నప్పటికీ ఎక్కడ ఖాళీ దొరికితే అక్కడ ఈ సినిమాను థియేటర్లలోకి దించేయాలని చూస్తున్నారు. ఈ చిత్ర ఫస్ట్ లుక్ ఇప్పటికే చర్చనీయాంశమైంది. అన్నట్టు.. ఈ రోజు రోహిత్ పుట్టిన రోజు. పెద్ద బ్యాగ్రౌండ్ ఉన్నప్పటికీ మాస్ ఇమేజ్ కోసం.. స్టీరియోటైపు హీరోయిజం ఉన్న పాత్రల కోసం.. మాస్ మసాలా సినిమాల కోసం వెంపర్లాడకుండా వైవిధ్యమైన కథలు.. పాత్రలు ఎంచుకుంటూ తన ప్రత్యేకతను చాటుకుంటున్న రోహిత్.. ఇకముందూ ఇలాంటి సినిమాలతోనే సాగిపోవాలని ఆకాంక్షిస్తూ.. అతడికి జన్మదిన శుభాకాంక్షలు చెబుతోంది ‘తుపాకి.కామ్’.