Begin typing your search above and press return to search.

‘మా’ ఎపిసోడ్ లో ‘చర్య’ల కత్తి బయటకు తీసిన నరేశ్..

By:  Tupaki Desk   |   9 Aug 2021 5:30 AM GMT
‘మా’ ఎపిసోడ్ లో ‘చర్య’ల కత్తి బయటకు తీసిన నరేశ్..
X
టీవీ సీరియల్ కు ఏ మాత్రం తీసిపోని రీతిలో మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ఎన్నికల వ్యవహారం సాగుతోంది. షెడ్యూల్ ప్రకారం నిర్వహించాల్సిన ఎన్నికల్ని నిర్వహించేస్తే ఏ గొడవా ఉండేది కాదేమో. అనుకోని రీతిలో కరోనా సెకండ్ వేవ్ విరుచుకుపడటం.. అనంతరం ప్రకాశ్ రాజ్ ఎంట్రీ ఇవ్వటం.. అనూహ్యంగా ‘మా’ బైలాస్ లో ఎన్నికల్ని కచ్ఛితంగా రెండేళ్లకే నిర్వహించాల్సిన అవసరం లేదని.. కావాలంటే ఆరేళ్ల పాటు ఎన్నికల్ని నిర్వహించకున్నా ఏమీ కాదన్న కొత్త విషయం మీడియాలో ప్రముఖంగా రావటంతో పాటు.. కొందరు న్యాయవాదుల సలహాతో ‘మా’ ఎన్నికల వ్యవహారం సా..గుతోందని చెబుతున్నారు.

ఎన్నికల నేపథ్యంలో ‘మా’ అధ్యక్ష పదవికి నలుగురైదుగురు పోటీ చేస్తామని ప్రకటనలు ఇచ్చినప్పటికి.. పోటీ మాత్రం ఇరువురు మధ్యనే ఉంటుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. అంతర్గతంగా ఎత్తులు.. పైఎత్తులు వేస్తూ.. తాము అనుకున్న వారిని ‘మా’ పీఠం మీదకు ఎక్కించాలన్నపట్టుదల వ్యక్తమవుతోంది. ఇందులో భాగంగానే ఇటీవల వెలువడుతున్న ప్రకటనలుగా చెప్పాలి.

ఓపక్క ఎన్నికల్నితక్షణమే నిర్వహించాలని కోరుతూ క్రమశిక్షణ సంఘానికి లేఖ రాస్తుంటే.. మరోవైపు సీనియర్ నటి హేమ అనూహ్యంగా తెర మీదకు రావటం.. వాయిస్ క్లిప్ తో కలకలాన్ని రేపారు. ‘మా’ నిధుల్ని దుర్వినియోగం అవుతున్నట్లుగా ఆమె చేసిన ఆరోపణలపై తాజాగా నరేశ్ స్పందించారు. ప్రస్తుత కార్యవర్గానికి అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్న నరేశ్ మాట్లాడుతూ.. హేమ వ్యాఖ్యల్ని తప్పు పట్టారు. తాజాగా ఆయనో ప్రకటనను విడుదల చేశారు. అసోసియేషన్ గౌరవాన్ని దెబ్బ తీసేలా హేమ మాట్లాడారని.. ఆమెపై క్రమశిక్షణ సంఘానికి కంప్లైంట్ చేస్తామన్నారు. కమిటీ నిర్ణయం ప్రకారం తగిన చర్యలు తీసుకుంటామని చెప్పారు.

ఎన్నికల ఆలస్యానికి కారణం చెప్పిన నరేశ్.. అందుకు కరోనానే కారణమన్నారు. ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో ఎన్నికలు ఎప్పుడు నిర్వహించాలన్న అంశంపై సర్వసభ్య సమావేశాన్ని నిర్వహిస్తామని..అందులో నిర్ణయం తీసుకుంటామని చెబుతున్నారు. పరిస్థితులకు అనుగుణంగానే ఎన్నికలు జరుగుతాయని వివరించారు. ఇదిలా ఉంటే.. ఈ మధ్యనే హేమ వాయిస్ క్లిప్ ను విడుదల చేసి.. తక్షణమే ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. తన మాటకు మద్దతుగా ఎన్నికల్ని నిర్వహించాలని కోరుతూ క్రమశిక్షణ సంఘానికి లేఖ రాయాలని అభ్యర్థించటం తెలిసిందే. మొత్తానికి ఒకటి తర్వాత ఒకటిగా చోటు చేసుకుంటున్న పరిణామాలు ‘మా’ అధ్యక్ష ఎన్నికల్ని ఎక్కడి వరకు తీసుకెళతాయో చూడాలి.