Begin typing your search above and press return to search.

ఆయన ఎక్సయిట్ అవుతున్నాడు

By:  Tupaki Desk   |   9 Nov 2017 4:38 AM GMT
ఆయన ఎక్సయిట్ అవుతున్నాడు
X
కార్తి హీరోగా.. రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటించిన మూవీ ఖాకీ. తమిళ్ లో తీరన్ అధికారం ఒండ్రు అనే టైటిల్ పై రూపొందిన ఈ మూవీని.. తెలుగులో ఖాకీ అని డబ్బింగ్ చేశారు. ఇప్పటికే అన్ని పనులు పూర్తి చేసుకున్న ఈ చిత్రం.. ఇప్పుడు రెండు భాషల్లో ఏకకాలంలో రిలీజ్ కి రెడీ అయిపోయింది. అటు తెలుగులోను.. ఇటు తమిళ్ లోను కూడా ప్రచార కార్యక్రమాలను సమానంగా డీల్ చేస్తున్నారు యూనిట్.

ఈ చిత్రంలో టాలీవుడ్ నటుడు నర్రా శ్రీనివాస్ ఓ కీలక పాత్ర పోషించాడు. తెలుగులో చాలానే సినిమాల్లో నటించి తన ట్యాలెంట్ చాటిన ఈయనకు.. తమిళ్ లో మాత్రం ఇదే తొలి చిత్రం. అందుకే ప్రారంభంలో కొంత నెర్వస్ గా ఫీలయినట్లు చెబుతున్నాడు శ్రీనివాస్. తమిళ్ లో నటించడం తనకు కొత్తగా అనిపించదని.. అయితే తెలుగు-తమిళ్ వెర్షన్స్ రెండింటికీ తన పాత్రకు తానే డబ్బింగ్ చెప్పుకున్నానని అంటున్నాడీయన. తమిళ్ డబ్బింగ్ చెప్పడంపై దర్శకుడికి మొదట కొన్ని సందేహాలు ఉన్నా.. తన కమిట్మెంట్ చూసి అంగీకరించాడని.. డబ్బింగ్ పూర్తయిన తర్వాత.. సూపర్బ్ గా ఉందని చెప్పినట్లు తెలిపాడు నర్రా శ్రీనివాస్.

ఇప్పుడు తనకు కొత్త ప్రపంచం నుంచి ఆహ్వానం అందినట్లుగాను.. ఇతర సినిమాల్లోకి గేట్లు తెరచినట్లుగాను అనిపిస్తోందని నర్రా శ్రీనివాస్ అంటున్నాడు. ఖాకీలో తన రోల్ కు చాలా మంచి పేరు వస్తుందని నమ్మకంగా ఉన్నానని.. మూవీ కూడా ఆకట్టుకునే కథాంశంతో అద్భుతంగా ఉంటుందని తెలిపాడు. నవంబర్ 17న తెలుగు.. తమిళ్ భాషల్లో ఈ చిత్రం రిలీజ్ కానుంది.