Begin typing your search above and press return to search.

మూవీ రివ్యూ : @నర్తనశాల

By:  Tupaki Desk   |   30 Aug 2018 1:00 PM GMT
మూవీ రివ్యూ : @నర్తనశాల
X
‘@నర్తనశాల’ రివ్యూ
నటీనటులు: నాగశౌర్య-కశ్మీరా పరదేశి-యామిని భాస్కర్-అజయ్-శివాజీ రాజా-జయప్రకాష్ రెడ్డి-సత్యం రాజేష్ తదితరులు
సంగీతం: మహత్ స్వర సాగర్
ఛాయాగ్రహణం: విజయ్.సి.కుమార్
నిర్మాత: ఉష మూల్పూరి
రచన-దర్శకత్వం: శ్రీనివాస్ చక్రవర్తి

హీరోగా పడుతూ లేస్తూ సాగిన నాగశౌర్య ఈ ఏడాది ఆరంభంలో ‘ఛలో’తో భారీ విజయాన్నందుకున్నాడు. తమ సొంత బేనర్లో చేసిన ఈ చిత్రంతో నాగశౌర్యకు మంచి ఫలితం దక్కింది. ఇప్పుడు అదే బేనర్లో శ్రీనివాస్ చక్రవర్తి అనే మరో కొత్త దర్శకుడి పరిచయం చేస్తూ ‘@నర్తనశాల’ సినిమా చేశాడు శౌర్య. ఈ రోజే ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ చిత్రం ‘ఛలో’ తరహాలోనే శౌర్యకు మరో విజయాన్నందించిందేమో చూద్దాం పదండి.

కథ: కళ్యాణ్ (శివాజీరాజా) తనకు ఆడబిడ్డ పుట్టాలని బలంగా కోరుకుంటాడు. కానీ అతడి భార్య మగబిడ్డను ప్రసవిస్తుంది. కొన్ని కారణాల వల్ల తన కొడుకు శౌర్య (నాగశౌర్య)ను అమ్మాయిలా పెంచుతాడు కళ్యాణ్. దీంతో అతను పెద్దయ్యాక కొంచెం తేడాగా తయారవుతాడు. అమ్మాయిలకు సాయం చేస్తాడే తప్ప.. వారి పట్ల ఆకర్షితుడు కాదు. ఇలాంటి సమయంలో ఇద్దరు అమ్మాయిలు శౌర్యతో ప్రేమలో పడతారు. అందులో ఓ అమ్మాయి నుంచి తప్పించుకునే క్రమంలో తాను స్వలింగ సంపర్కుడినని చెబుతాడు శౌర్య. దీంతో అతడికి కష్టాలు మొదలవుతాయి. ఆ కష్టాలేంటి.. వాటి నుంచి శౌర్య ఎలా బయటపడ్డాడు. నిజంగా అతను స్వలింగ సంపర్కుడా కాదా అన్నది తెర మీదే చూసి తెలుసుకోవాలి.

కథనం-విశ్లేషణ: తనకు ఇష్టం లేని అమ్మాయితో పెళ్లిని తప్పించుకోవడానికి తాను గే అని అబద్ధమాడతాడు హీరో. ఆ మాట చెప్పి బయటికొస్తుంటే గే అయిన అమ్మాయి అన్నయ్య హీరోను తగులుకుంటాడు. ‘@నర్తనశాల’లో ఫన్నీగా అనిపించే ఒక సన్నివేశం ఇది. దీనికి ముందు వ్యవహారం ఎంత సాదాసీదాగా ఉన్నప్పటికీ.. ఈ పాయింట్ దగ్గర ప్రేక్షకుల్లో ఉత్సాహం వస్తుంది. అక్కడి నుంచి వినోదంలో ముంచెత్తేస్తారని ఆశిస్తారు. కానీ ‘@నర్తనశాల’ ఆ ఆశలపై నీళ్లు చల్లేయడానికి ఎంతో సమయం పట్టదు. హీరోయిన్ బడా ఫ్యామిలీలో ఇరుక్కున్న హీరో.. అక్కడున్న వాళ్లందరి మనసులు మార్చేసే ఔట్ డేటెడ్ ఫార్మాట్లోకి ‘@నర్తనశాల’ వెళ్లిపోతుంది. దశాబ్దాల తరబడి మారకుండా ఉన్న మనుషుల్లో హీరో సునాయాసంగా మార్పు తెచ్చేస్తాడు. వాళ్లలో సెంటిమెంట్లు రగిలించేస్తాడు. అందరినీ మంచోళ్లను చేసేసి తన లక్ష్యాన్ని పూర్తి చేసుకుంటాడు. పోనీ కామెడీ అయినా వర్కవుటైతే.. సర్దుకుపోవచ్చు. కానీ ఆ కామెడీ కూడా ఔట్ డేటెడే. చక్కిలిగింతలు పెట్టుకుంటే తప్ప నవ్వు రాని ఏళ్ల నాటి కామెడీతో ‘@నర్తనశాల’ విసిగిస్తుంది. ‘ఛలో’తో గిలిగింతలు పెట్టేసిన శౌర్య టీం.. ఈసారి మాత్రం నవ్వులు పండించడంలో పూర్తిగా విఫలమైంది.

గతంలో కొన్ని తెలుగు సినిమాల్లో సపోర్టింగ్ క్యారెక్టర్లతో గే కామెడీ ట్రై చేశారు. ‘గుండె జారి గల్లంతయ్యిందే’ లాంటి సినిమాలకు అది ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది కూడా. ఐతే ఈసారి హీరోనే గే గా మార్చి పెద్ద సాససమే చేశాడు కొత్త దర్శకుడు శ్రీనివాస్ చక్రవర్తి. ఇది ప్రేక్షకులకు కొత్తగా అనిపించే విషయమే. ఆ పాత్రను సరిగ్గా తీర్చిదిద్ది.. వినోదం పండించగలిగి ఉంటే.. ‘@నర్తనశాల’ ప్రత్యేకమైన సినిమాగా ఉండేది. కానీ కేవలం ఆ పాయింట్ వరకు ఎగ్జైట్ అయిపోయి దాని చుట్టూ ఎలా పడితే అలా కథాకథనాల్ని నడిపించేశారు. అక్కడక్కడా కొన్ని కామెడీ చమక్కులున్నప్పటికీ.. ప్రేక్షకులు ఆశించే డోస్ ఎక్కడా లేకపోయింది. మొదట్లో హీరో నిజంగానే గే ఏమో అనుకునేట్లుగా చూపించి.. ఆ తర్వాత అతడితో గేగా నాటకం వేయించి.. చివరికి దాన్ని ఇంకెలాగో ముగించాడు దర్శకుడు. ఈ పాత్రలో ఒక నిలకడ.. ప్రత్యేకత అంటూ ఏమీ లేకపోవడంతో సినిమా ఎక్కడా ఒక తీరుగా సాగదు.

మొదలు మొదలే లౌడ్ కామెడీతో సాధారణంగా మొదలయ్యే ‘@నర్తనశాల’ ఒక దశ దాటాక మరీ పేలవంగా తయారవుతుంది. ఇద్దరు హీరోయిన్ల పాత్రలు చాలా సాధారణంగా ఉండటంతో వాళ్లతో ముడిపడ్డ సన్నివేశాలు బోర్ కొట్టించేస్తాయి. గంట నిడివిలో ఉన్న ప్రథమార్ధంలో ఇంటర్వెల్ బ్లాక్ మాత్రమే ఆసక్తి రేకెత్తిస్తుంది. ద్వితీయార్ధం మీద ఆశలు పెంచుకునేలా చేస్తుంది. ఐతే అజయ్-శౌర్య కాంబినేషన్లో వచ్చే కొన్ని సన్నివేశాలు మినహాయిస్తే ద్వితీయార్ధంలో ఆసక్తి రేకెత్తించే అంశాలే లేకపోయాయి. సెంటిమెంటు పండించడం కోసం చేసిన ప్రయత్నం పూర్తిగా బెడిసికొట్టింది. కృత్రిమమైన సన్నివేశాల వల్ల ఏమాత్రం ఎమోషన్లు పండలేదు. దీనికి తోడు సన్నివేశాలు మరీ నెమ్మదిగా సాగడంతో ఒక దశ దాటాక ‘@నర్తనశాల’లో కొనసాగడం చాలా కష్టమైపోతుంది. అసలే వ్యవహారం అంతంతమాత్రంగా ఉంటే శివాజీ రాజా వచ్చి సినిమాను కంగాళీగా మార్చేస్తాడు. ఈ కామెడీ గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది . అక్కడి నుంచి మొక్కుబడిగా ముగింపు కోసం ఎదురు చూడటమే మిగులుతుంది. సినిమా మీద అంతకుముందు ఏమాత్రం ఇంప్రెషన్ ఉన్నా.. చివరికి వచ్చేసరికి అదంతా కూడా పోతుంది. హీరో గే అనే కొత్త పాయింటుకి ఎగ్జైట్ అయిపోయి సరైన కసరత్తు లేకుండా ఎలా పడితే అలా సినిమా తీస్తే అది ‘@నర్తనశాల’గా తయారైందనిపిస్తుంది.

నటీనటులు: నాగశౌర్య జస్ట్ ఓకే అనిపించాడు. అతడి పాత్ర కొన్ని చోట్ల ఆసక్తి రేకెత్తిస్తుంది. దాన్ని బట్టి శౌర్య నుంచి చాలా ఆశిస్తాం. కానీ పాత్ర తేలిపోవడంతో అతను చేయడానికేమీ లేకపోయింది. లుక్స్ పరంగా శౌర్య ఎప్పట్లాగే ఆకట్టుకుంటాడు. హీరోయిన్లలో ఏ ప్రత్యేకతా లేకపోయింది. కశ్మీరీ పరదేశీ గ్లామర్ పరంగా కానీ.. నటన విషయంలో కానీ ఎలాంటి ముద్రా వేయదు. ఉన్నంతలో యామిని భాస్కర్ పర్వాలేదనిపిస్తుంది. ఆమెలోని గ్లామర్ కోణాన్ని ఈ చిత్రంలో చూడొచ్చు. సీనియర్ నటులు శివాజీ రాజా.. జయప్రకాష్ రెడ్డి.. అజయ్ లకు చెప్పుకోదగ్గ పాత్రలే దక్కాయి. వాళ్లు అక్కడక్కడా కొంచెం నవ్వించారు. అంతే తప్ప బలమైన ముద్ర వేయలేకపోయారు. హీరో ఫ్రెండుగా చేసిన అతను ఓకే.

సాంకేతికవర్గం: ‘ఛలో’తో మ్యాజిక్ చేసిన మణిశర్మ తనయుడు మహత్ స్వర సాగర్.. ఈసారి అలాంటి ఔట్ పుట్ ఇవ్వలేదు. పాటల్లో ఏవీ ప్రత్యేకంగా లేవు. ‘చూసీ చూడంగానే..’ తరహా పాట లేని లోటు స్పష్టం కనిపిస్తుంది. అతడి నేపథ్య సంగీతం కూడా మామూలే. విజయ్.సి.కుమార్ కెమెరా పనితనం ఓకే. పాటలు బాగా తీశాడు. నిర్మాణ విలువలు బాగానే ఉన్నాయి. బాగానే ఖర్చు పెట్టారు. పాటల వరకు ఒక స్టార్ సినిమా స్థాయి కనిపిస్తుంది. ఇక రైటర్ కమ్ డైరెక్టర్ శ్రీనివాస్ చక్రవర్తి భిన్నమైన పాయింటే ఎంచుకున్నాడు కానీ.. దాన్ని ఆసక్తికరమైన సినిమాగా మలచడంలో విఫలమయ్యాడు. కామెడీ విషయంలో ఈ ట్రెండుకు తగ్గ శైలిని అనుసరించకపోవడంతో సినిమాలో కొత్తదనం కొరవడింది. ఔట్ డేట్ అయిపోయిన లౌడ్ కామెడీతో విసిగించాడు. దర్శకుడిగా అతను ఏ ప్రత్యేకతా చూపించలేకపోయాడు.

చివరగా: @నర్తనశాల.. అంతా గోల గోల

రేటింగ్-2/5