Begin typing your search above and press return to search.

బురిడీ బాబాకు ‘అఆ’ సినిమాతో కనెక్షన్

By:  Tupaki Desk   |   21 Jun 2016 1:30 PM GMT
బురిడీ బాబాకు ‘అఆ’ సినిమాతో కనెక్షన్
X
హైదరాబాద్ తో పరిచయం ఉన్నవాళ్లందరికీ ‘లైఫ్ స్టైల్’ బిల్డింగ్ గురించి బాగానే తెలిసి ఉంటుంది. సిటీలోని బెస్ట్ షాపింగ్ డెస్టినేషన్స్ లో అదొకటి. అంత పెద్ద షాపింగ్ మాల్ కు యజమాని అయిన మధుసూదన్ రెడ్డి ఓ బురిడీ బాబా మాయలో పడి కోటి రూపాయలకు పైగా మోసపోవడం సంచలనం రేపింది. చివరికి ఆ బాబా దొరికిపోయినా.. డబ్బులు వెనక్కి వచ్చినా.. సొసైటీలో ఎంతో పేరు ప్రతిష్టలున్న వ్యక్తి ఇంత సింపుల్ గా మోసపోవడం.. ఇంట్లో ఉన్న డబ్బులన్నీ తెచ్చి ఆ బురిడీ బాబా ముందు పెట్టేయడం.. అతను పెట్టిన పరమాన్నం తిని మైకానికి గురికావడం.. మొత్తం డబ్బంతా అతను కొట్టుకుపోతుంటే ఏమీ చేయలేని నిస్సహాయ స్థితికి చేరడం ఆశ్చర్యం కలిగించే విషయమే.

ఐతే ఈ కేసుకు సంబందించిన వివరాలు చెబుతున్నపుడు పోలీసులు ‘రైస్ పుల్లింగ్’ అనే మాట అనడం వినే ఉంటారు. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే.. ఈ కాన్సెప్ట్ నేపథ్యంలో ఓ తమిళ సినిమాలో సన్నివేశాలుంటాయి. ఆ సినిమా పేరు.. ‘శతురంగ వేట్టై’. అందులో హీరో ఇలా మోసాలు చేసి బతికే రకం. ఓ పెద్దింటి యజమానిని బుట్టలో వేసి.. అతడికి ఈ రైస్ పుల్లింగ్ కాన్సెప్ట్ చెప్పి మాయ చేస్తాడు. మీ ఇంట్లోని నగలు.. డబ్బు అన్నీ కూడా రెట్టింపవుతాయని మాటలతో మాయ చేసి.. ఈ రైస్ పుల్లింగ్ కాన్సెప్ట్ ప్రకారం యాగం చేయడానికి సన్నాహాలు చేస్తాడు. చివరికి మొత్తం దోచుకుని ఆ పెద్దింటి వాణ్ని బురిడీ కొట్టించి వెళ్లిపోతాడు. ఇంతకీ ఆ బురిడీ బాబా పాత్ర పోషించింది ఎవరో తెలుసా..? ‘అఆ’ సినిమాకు సినిమాటోగ్రాఫర్ గా పని చేసిన నటరాజన్ సుబ్రమణ్యన్. ‘శతురంగ వేట్టై’ తమిళంలో సూపర్ హిట్టయింది. నటరాజన్ నటనకు కూడా గొప్ప ప్రశంసలు లభించాయి. సినిమాల్లో చూసినపుడు ఇలాంటివి నిజ జీవితంలో ఎక్కడ జరుగుతాయి అనుకుంటాం కానీ.. నిజ జీవితంలో జరిగినవే చూసి సినిమాల్లోనూ పెడతారన్న సంగతి మధుసూదన్ రెడ్డి వ్యవహారంతో అర్థమైంది.