Begin typing your search above and press return to search.

చ‌నిపోయిన డైరెక్ట‌ర్ కు జాతీయ పుర‌స్కారం!

By:  Tupaki Desk   |   23 July 2022 7:43 AM GMT
చ‌నిపోయిన డైరెక్ట‌ర్ కు జాతీయ పుర‌స్కారం!
X
శుక్ర‌వారం కేంద్ర ప్ర‌భుత్వం 68 వ జాతీయ పుర‌స్కారాల్ని ప్ర‌క‌టించించిన విష‌యం తెలిసిందే. ఇందులో హీరో సూర్య న‌టించిన 'సూరారైపోట్రు' ఏకంగా ఐదు అవార్డుల్ని సొంతం చేసుకుని త‌న ప్ర‌త్యేక‌త‌ని చాటుకుంది. ఉత్త‌మ చిత్రం, ఉత్త‌మ‌ న‌టుడు, ఉత్త‌మ న‌టి, ఉత్త‌మ నేప‌థ్య సంగీతం, ఉత్త‌మ స్క్రీన్ ప్లే వంటి విభాగాల్లో 'సూరారైపోట్రు' ప‌లు అవార్డుల్ని సొంతం చేసుకుని ప్ర‌ధ‌మ స్థానంలో నిలిచింది. అయితే ఇదే అవార్డుల్లో మ‌ల‌యాళ దివంగ‌త ద‌ర్శ‌కుడు స‌చీ (కె.ఆర్‌. స‌చిదానంద‌న్‌) ఉత్త‌మ ద‌ర్శ‌కుడిగా అవార్డుని ద‌క్కించుకున్నారు.

ఆయ‌న తెర‌కెక్కించిన చిత్రం 'అయ్య‌ప్ప‌నుమ్ కోషియుమ్‌'. పృథ్వీరాజ్ సుకుమార‌న్‌, బీజు మీన‌న్ ల కాంబినేష‌న్ లో రూపొందిన యాక్ష‌న్ డ్రామా ఇది. మ‌ల‌యాళంలో సంచ‌ల‌న విజ‌యాన్ని సాధించిన ఈ మూవీని తెలుగులో ప‌వ‌ర్ స్టార్ ప‌వన్ క‌ల్యాణ్‌, రానాల కాంబినేష‌న్ లో 'భీమ్లా నాయ‌క్‌' గా తెర‌కెక్కించారు. త్రివిక్ర‌మ్ స్క్రీన్ ప్లే, డైలాగ్స్ అందించ‌గా, 'అప్ప‌ట్లో ఒక‌డుండేవాడు' ఫేమ్ సాగ‌ర్ కె. చంద్ర రూపొందించారు.

తెలుగులోనూ ఈ మూవీ మంచి విజ‌యాన్ని సాధించింది. బాక్సాఫీస్ వ‌ద్ద భారీ వ‌సూళ్ల‌ని రాబ‌ట్టింది. అయితే ఈ సినిమాకు మాతృక అయిన 'అయ్య‌ప్ప‌నుమ్ కోషియుమ్‌' చిత్రానికి గానూ జాతీయ అవార్డుల్లో రెండు పుర‌స్కారాలు ద‌క్కాయి. ఉత్త‌మ ద‌ర్శ‌కుడిగా స‌చీకి, ఉత్త‌మ స‌హాయ న‌టుడిగా బీజు మీన‌న్‌కు అవార్డు ల‌భించ‌డం విశేషం. 2020లో ఈ మూవీ విడుద‌లైంది. సినిమా రిలీజ్ త‌రువాత జూన్ 18న గుండెపోటుతో ద‌ర్శ‌కుడు స‌చి హ‌ఠాత్తుగా క‌న్ను మూశారు.

లాయ‌ర్ అయిన ఆయ‌న సినిమాల‌పై వున్న ఇష్టంతో చాకోలెట్‌, రాబిన్ హుడ్‌, మేక‌ప్ మెన్‌, సీనియ‌ర్స్‌, డ‌బుల్స్ వంటి చిత్రాల‌కు వ‌ర్క్ చేశారు. ఆ త‌రువాత రైట‌ర్ గా ర‌న్ బేబీ ర‌న్‌, చెట్టాయిస్‌, రామ్ లీలా, షెర్లాక్ టోమ్స్‌, డ్రైవింగ్ లైసెన్స్ వంటి చిత్రాల‌కు ప‌ని చేశారు.

పృథ్వీరాజ్ సుకుమార‌న్ హీరోగా న‌టించిన 'అనార్క‌లి' సినిమాతో ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అయ్యారు. ఆ త‌రువాత స‌చీ చేసిన రెండ‌వ చిత్ర‌మే 'అయ్య‌ప్ప‌నుమ్ కోషియుమ్‌'. రెండ‌వ సినిమాకే జాతీయ అవార్డు ద‌క్క‌డం విశేషం.

జాతీయ అవార్డు ప్ర‌క‌టించిన నేప‌థ్యంలో హీరోలు పృథ్విరాజ్ సుకుమార‌న్‌, బీజు మీన‌న్ ద‌ర్శ‌కుడు సచీని గుర్తు చేసుకున్నారు. గ‌ర్వంగా వుంద‌ని పృథ్విరాజ్ సుకుమార‌న్ ట్వీట్ చేస్తే.. బీజు మీన‌న్ ఈ అవార్డ్ నాకు చాలా స్పెష‌ల్ అని, మిస్ యూ స‌చి అని ట్వీట్ చేశారు.