Begin typing your search above and press return to search.

ఒక సినిమా.. ఐదుగురు నేషనల్ అవార్డీలు

By:  Tupaki Desk   |   19 Sep 2016 5:30 PM GMT
ఒక సినిమా.. ఐదుగురు నేషనల్ అవార్డీలు
X
ఇండియన్ సినిమాలో జాతీయ అవార్డు అంటే చిన్న విషయం కాదు. ఒక అవార్డు తెచ్చుకుంటే చాలు.. ఆ గుర్తింపుతో చాలా అవకాశాలు సంపాదించవచ్చు. అది అందుకున్న వారిని చాలా ప్రత్యేకంగా చూస్తారు. ప్రకాష్ రాజ్ స్వీయ నిర్మాణంలో తెరకెక్కించిన ‘మనవూరి రామాయణం’ సినిమాకు ఐదుగురు జాతీయ అవార్డీలు పని చేయడం విశేషం. ‘కాంజీవరం’ సినిమాకు ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డు గెలుచుకోవడంతో పాటు.. ‘ఇద్దరు’ సినిమాకు ఉత్తమ సహాయ నటుడిగా.. 2002లో జ్యూరీ పురస్కారం కూడా అందుకున్నాడు ప్రకాష్ రాజ్.

ఇక సంగీత దర్శకుడు ఇళయరాజా ఏకంగా ఐదుసార్లు జాతీయ అవార్డుకు ఎంపికయ్యారు. తెలుగువారు గర్వించదగ్గ ఎడిటర్ శ్రీకర్ ప్రసాద్ సైతం ఒకసారి కాదు.. ఐదుసార్లు జాతీయ అవార్డు అందుకున్నారు. ఇక ఇందులో కీలక పాత్ర పోషించిన ప్రియమణి ‘పరుత్తి వీరన్’కు జాతీయ అవార్డు అందుకున్న సంగతి తెలిసిందే. ఈ నలుగురూ కాకుండా శశిధర్ అడపా సైతం ప్రొడక్షన్ డిజైనర్ గా 2004లో నేషనల్ అవార్డు గెలచుకున్నాడు. ఇంతమంది ప్రతిభావంతులు కలిసి చేస్తున్న సినిమా కావడంతో ‘మనవూరి రామాయణం’ మీద అంచనాలు బాగానే ఉన్నాయి. ఈ సినిమాకు సంబంధించి ఇప్పటిదాకా రిలీజ్ చేసిన ప్రతి ప్రోమో కూడా ఆసక్తి రేపింది. కన్నడలోనూ తెరకెక్కిన ఈ చిత్రం దసరా కానుకగా అక్టోబరు 7న విడుదలవుతుంది. తెలుగులో అభిషేక్ పిక్చర్స్ ఈ చిత్రాన్ని రిలీజ్ చేయనుంది.