Begin typing your search above and press return to search.

డ్ర‌గ్స్ సంబంధాల‌పై న‌వ‌దీప్ మాట ఇదే!

By:  Tupaki Desk   |   14 July 2017 10:15 AM GMT
డ్ర‌గ్స్ సంబంధాల‌పై న‌వ‌దీప్ మాట ఇదే!
X
టాలీవుడ్‌ను అత‌లాకుత‌లం చేస్తున్న డ్ర‌గ్స్ దందాపైనే ఇప్పుడు ఎద్ద ఎత్తున చ‌ర్చ జ‌రుగుతోంది. హైద‌రాబాదులో ఓ ముగ్గురు డ్ర‌గ్స్ వ్యాపారుల‌ను అరెస్ట్ చేసిన ఎక్సైజ్ ఎన్‌ ఫోర్స్ మెంట్ పోలీసులు... వారి వ‌ద్దనున్న సెల్ ఫోన్ల‌ను స్వాధీనం చేసుకుని, వాటిలోని కాల్ డేటా - మెసేజ్‌ ల‌ను ప‌రిశీలించి పెద్ద ఎత్తున దందా సాగుతున్న‌ట్లు నిగ్గు తేల్చారు. ఈ క్ర‌మంలో స‌ద‌రు ఫోన్ల‌లో ల‌భించిన స‌మాచారం మేర‌కు... టాలీవుడ్‌ లోని ప్ర‌ముఖ న‌టులు - ద‌ర్శ‌కులు - నిర్మాత‌లు - కేరెక్ట‌ర్ ఆర్టిస్టులు - ఇత‌ర సాంకేతిక నిపుణులు పెద్ద ఎత్తున డ్ర‌గ్స్ వాడుతున్నార‌న్న క‌థ‌నాలు వెల్లువెత్తుతున్నాయి. ఓ వైపు ఈ కేసును పూర్తి స్ధాయిలో ద‌ర్యాప్తు చేసేందుకు రంగంలోకి దిగిన పోలీసులు ఓ వైపు డ్ర‌గ్స్ వ్యాపారం తీరుతెన్నుల‌ను వెలికి తీస్తూనే.. డ్ర‌గ్స్ వాడుతున్నారని అనుమానం ఉన్న సినీ రంగానికి చెందిన ప్ర‌ముఖుల‌కు నోటీసులు జారీ చేస్తున్నారు. టాలీవుడ్ ప్ర‌ముఖుల‌కు నోటీసుల జారీ ఇప్పుడు పెద్ద క‌ల‌క‌ల‌మే రేగింది.

తాజాగా నేటి ఉద‌యం స‌ద‌రు నోటీసులు అందుకున్న సినీ ప్ర‌ముఖుల పేర్లు కూడా బ‌య‌ట‌కు రావ‌డంతో ఇప్పుడు ఇదే హాట్ టాపిక్‌ లా మారిపోయింది. పోలీసుల నుంచి నోటీసులు అందుకున్న వారిలో ప‌లువురు త‌మ ప్ర‌మేయానికి సంబంధించి వివ‌ర‌ణ ఇచ్చేందుకు మీడియా ముందుకు వ‌స్తున్నారు. మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేష‌న్ (మా) మాజీ అధ్య‌క్షుడు రాజేంద్ర‌ప్ర‌సాద్ స‌హా ప‌లువురు న‌టులు కూడా త‌మ అభిప్రాయాల‌ను వెల్ల‌డించారు. ఈ క్ర‌మంలో డ్ర‌గ్స్ వాడుతున్నాడంటూ ఇప్ప‌టికే ప‌లు సంద‌ర్భాల్లో ఆరోప‌ణ‌లు ఎదుర్కొన్న యువ హీరో న‌వదీప్ కూడా ఇప్పుడు మీడియా ముందుకు వ‌చ్చేశారు. ఓ ప్ర‌ముఖ ఛానెల్ తో ఫోన్‌ లో సంభాషించిన అత‌డు... డ్ర‌గ్స్ తో త‌న‌కు ఏమాత్రం సంబంధం లేద‌ని తేల్చిచెప్పారు. అస‌లు ప్ర‌స్తుతం పోలీసుల‌కు ప‌ట్టుబ‌డ్డ కీల‌క నిందితుడు కెల్విన్‌ తో త‌న‌కు ఎలాంటి సంబంధం లేద‌ని కూడా అత‌డు పేర్కొన్నారు.

అయినా... ఈ త‌ర‌హా వివాదాలు ఎప్పుడు వినిపించినా... త‌న పేరునే మీడియా ప్ర‌శ్నిస్తోంద‌ని కూడా న‌వ‌దీప్ ఒకింత ఆవేద‌న వ్య‌క్తం చేశారు. గ‌తంలో త‌మ బంధువుల‌తో క‌లిసి ఓ రిసార్ట్ లో విందు చేసుకుని వ‌చ్చిన స‌మ‌యంలోనూ తానేదో రేవ్ పార్టీ నిర్వ‌హించిన‌ట్లుగా వార్త‌లు వ‌చ్చాయ‌ని, అవ‌న్నీ అబ‌ద్ధ‌మేన‌ని ఆయ‌న పేర్కొన్నారు. త‌న‌కో ఫ్రెండ్స్ క్ల‌బ్ ఉంద‌ని, ఆ క్ల‌బ్ స‌భ్యుల‌మంతా క‌లిసి ఇటీవ‌లే ఓ పార్టీ చేసుకున్నామ‌ని, స‌ద‌రు ఈవెంట్ నిర్వ‌హ‌ణ బాధ్య‌త‌ను ఓ ఈవెంట్ మేనేజ్‌ మెంట్‌ కు అప్ప‌గించామ‌న్నారు. అయితే ఆ సంస్థ‌కు డ్ర‌గ్స్ దందాతో సంబంధ‌ముందా? లేదా? అన్న విష‌యం త‌న‌కు తెలియ‌ద‌న్నారు. అయినా ఈ విష‌యంలో త‌నకు ప్ర‌మేయ‌ముంద‌ని పోలీసులేమీ చెప్ప‌లేద‌న్నారు. కేవ‌లం అనుమానం ఉన్న కార‌ణంగానే త‌న‌కు పోలీసులు నోటీసులు జారీ చేశార‌ని, ఓ బాధ్య‌తాయుత‌మైన పౌరుడిగా విచార‌ణ‌కు తాను హాజ‌ర‌వుతాన‌ని న‌వ‌దీప్ చెప్పారు.

విచార‌ణ సంద‌ర్భంగా త‌న సెల్ ఫోన్‌ లోని స‌మ‌గ్ర స‌మాచారాన్ని పోలీసుల ముందు పెడ‌తాన‌ని తెలిపారు. అయినా పోలీసులు చాలా మందికి నోటీసులు జారీ చేశార‌ని, పోలీసుల నుంచి నోటీసులు అందుకున్న వారంద‌రికీ డ్ర‌గ్స్‌ తో సంబంధాలున్నాయ‌ని అనుకోవ‌డం స‌రికాద‌న్నారు. డ్ర‌గ్స్ దందారాయుళ్లు ఎవ‌రితోనైతే ఫోన్లో మాట్లాడారో, వారి ఫోన్ల‌లోని స‌మాచారం ఆధారంగా ఇంకోంత మందికి నోటీసులు జారీ చేశార‌న్నారు. అయితే డ్ర‌గ్స్ తో సంబంధాలున్నాయ‌ని పోలీసులు నిగ్గుతేల్చే దాకా ఎవ‌రిపైనా నింద‌లు వేయ‌డం స‌రికాద‌ని కూడా న‌వ‌దీప్ అన్నారు.