Begin typing your search above and press return to search.

మూవీ రివ్యూ : 'నవాబ్'

By:  Tupaki Desk   |   27 Sep 2018 1:12 PM GMT
మూవీ రివ్యూ : నవాబ్
X
చిత్రం: 'నవాబ్'

నటీనటులు: అరవింద్ స్వామి - శింబు - విజయ్ సేతుపతి - అరుణ్ విజయ్ - ప్రకాష్ రాజ్ - జయసుధ - జ్యోతిక - అదితి రావు హైదరి - డయానా ఎర్రప్ప - త్యాగరాజన్ - మన్సూర్ అలీ ఖాన్ తదితరులు
సంగీతం: ఏఆర్ రెహమాన్
ఛాయాగ్రహణం: సంతోష్ శివన్
మాటలు: కిరణ్
నిర్మాతలు: మణిరత్నం - సుభాస్కరన్
రచన - దర్శకత్వం: మణిరత్నం

దక్షిణాది సినిమాను ఎంతో ఎత్తుకు తీసుకెళ్లిన మణిరత్నం కొన్నేళ్లుగా తన స్థాయికి తగ్గ సినిమా తీయలేకపోతున్నారు. మధ్యలో ఆయన నుంచి వచ్చిన ‘ఓకే బంగారం’ పర్వాలేదనిపించినా.. తర్వాత ‘చెలియా’ నిరాశ పరిచింది. ఇప్పుడాయన భారీ తారాగణంతో ‘నవాబ్’ను తీర్చిదిద్దాడు. తమిళంతో పాటు తెలుగులోనూ ఈ రోజే ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ చిత్ర విశేషాలేంటో చూద్దాం పదండి.

కథ:

భూపతి రెడ్డి (ప్రకాష్ రాజ్) రౌడీయిజాన్ని నమ్ముకుని ఒక పెద్ద వ్యాపార సామ్రాజ్యాన్ని నిర్మించిన పెద్ద మనిషి. అతడికి ముగ్గురు కొడుకులు. వీళ్ల కుటుంబ ఆధిపత్యంతో అంతా సాఫీగా సాగిపోతున్న సమయంలో భూపతి.. ఆయన భార్యపై బాంబు దాడి జరుగుతుంది. ఆ దాడి ఎవరు చేశారో తెలుసుకునే ప్రయత్నంలో పడతారు ఆయన కొడుకులు. ఇంతలోనే భూపతి గుండెపోటుతో చనిపోతాడు. ఆ తర్వాత ఆయన స్థానాన్ని అందుకోవడం కోసం ముగ్గురు కొడుకుల మధ్య ఆధిపత్య పోరు మొదలవుతుంది. ఒకరిని ఒకరు లక్ష్యంగా చేసుకుంటారు. మరి భూపతిపై దాడి చేసింది ఎవరు.. అన్నదమ్ముల పోరులో ఎవరు పైచేయి సాధించారు.. భూపతి స్థానాన్ని ఎవరు తీసుకున్నారు అన్నది మిగతా కథ.

కథనం - విశ్లేషణ:

తండ్రి వారసత్వాన్ని అందుకునేందుకు ముగ్గురు కొడుకుల మధ్య జరిగే ఆధిపత్య పోరు నేపథ్యంలో సాగే కథ ‘నవాబ్’. ఆ కొడుకులు ఒకరినొకరు చంపుకునే వరకు వెళ్తారు. కుటుంబంలోని మిగతా వ్యక్తుల్ని కూడా ఉపేక్షించరు. ఐతే చిన్నగా సమస్య మొదలై.. ఆ తర్వాత అది పెద్దదై.. అనుకోని పరిణామాలతో ఒకరినొకరు చంపుకోవడం వరకు వెళ్తే ఓకే అనుకోవచ్చు. ముందు అధికారం అందుకోవడానికి ఒక ప్రయత్నం జరిగి... ఆ విషయంలో పరస్పరం గొడవలు జరిగి.. ఆ తర్వాత హత్యల వరకు వెళ్తే సహేతుకంగా అనిపిస్తుంది. కానీ ‘నవాబ్’లో మాత్రం చిత్రంగా నేరుగా చంపుకోవడంతోనే కథ మొదలవుతుంది. అన్నదమ్ములు జన్మజన్మల పగ ఉన్నట్లు ఒకరినొకరు చంపేసుకోవడానికి చూస్తుంటారు. వారి మధ్య ఎక్కడా కుటుంబ బంధాలన్నవే కనిపించవు. కుటుంబంలోని మహిళలని చూడరు.. పిల్లల గురించి ఆలోచించరు.. తల్లిదండ్రుల గురించి కూడా ఆలోచన ఉండదు. ఒకరి మీద ఒకరు దాడులు చేసుకుంటూ పోతుంటారు.

ఇంతకుముందు ‘రేస్’ సినిమాలోనూ ఇలాంటి అన్నదమ్ముల ఆధిపత్య పోరాటం చూశాం. కానీ దాని నడతే వేరుగా ఉంటుంది. అది మొదట్నుంచి మోసం.. నమ్మకద్రోహం అనే థీమ్స్ మీద నడుస్తుంది. మొదట్లోనే దానికి అలవాటు పడిపోతాం. కానీ ఇక్కడ అలా కాదు.. చక్కగా కళకళలాడే ఒక కుటుంబాన్ని చూపిస్తారు. వాళ్ల మధ్య మంచి బంధం ఉన్నట్లుంటుంది. కానీ అధికారం విషయానికి వచ్చేసరికి వాళ్లలో వాళ్లకు కనీసం ఒక చర్చ జరగదు. నేరుగా ఒకరినొకరు చంపేసుకోవడానికి తయారైపోతారు. ఈ వ్యవహారమంతా చూస్తే.. అసలు వీళ్లెందుకు కూర్చుని ఒకసారి మాట్లాడుకోరు.. తమ ఇంట్లోని మహిళలు.. పిల్లల గురించి ఎందుకు ఆలోచించరు.. అనే ప్రాథమిక ప్రశ్న తలెత్తుతుంది. ఇది సినిమా ఆద్యంతం వెంటాడుతూ ఉండటంతో తెరపై జరుగుతున్న తంతంతా కొంచెం అసహజంగా.. ఇబ్బందిగానే అనిపిస్తుంటుంది.

‘నవాబ్’ ఆరంభం నుంచి చివరి వరకు ఒక అలజడితో సాగిపోయే సినిమా. తొలి సన్నివేశంతోనే కథ మొదలైపోతుంది. కథనంలో ఎక్కడా బ్రేక్ ఏమీ ఉండదు. సినిమా వేగంగానే సాగిపోతుంటుంది. అక్కడక్కడా ఆసక్తికర సన్నివేశాలు వచ్చిపోతుంటాయి. కథ మలుపులు తిరుగుతుంటుంది. కానీ ఈ కథను కన్విన్సింగ్ గా చెప్పడంలో మాత్రం మణిరత్నం విఫలమయ్యాడు. తెరనిండా బోలెడంతమంది పేరున్న నటులు.. అందరి స్క్రీన్ ప్రెజెన్స్ బాగుంటుంది. ఎవరి స్థాయిలో వాళ్లు ప్రత్యేకత చాటుకునే ప్రయత్నం చేశారు. ఇక సంతోష్ శివన్ విజువల్స్.. రెహమాన్ నేపథ్య సంగీతం గురించి చెప్పేదేముంది? కానీ ఇవన్నీ బాగానే సమకూరినా.. ఏమంత కొత్తగా.. కన్విన్సింగ్ గా అనిపించని కథ ప్రేక్షకుల ఆసక్తిని నిలిపి ఉంచదు. అబ్బా ఏముందిరా ఈ సీన్ అనిపించే మణిరత్నం మ్యాజికల్ మూమెంట్స్ ఇందులో మిస్సయ్యాయి.

మణిరత్నం సినిమా అంటే ఫ్రేమ్ ఫ్రేమ్ లోనూ ఆయన ముద్ర కనిపిస్తుంది. సినిమా హిట్టయినా ఫ్లాప్ అయినా ఆయన ముద్ర మాత్రం స్పష్టంగా ఉంటుంది. కానీ ఆశ్చర్యకరంగా ‘నవాబ్’లో ఆయన ముద్ర మిస్సయింది. మణిరత్నం ఆస్థాన సంగీత దర్శకుడు రెహమాన్.. అయనతో ఆనేక సినిమాలు చేసిన సంతోష్ శివన్ ఉండటం వల్ల కొంచెం ‘మణిరత్నం’ ఫీల్ ఉంటుంది కానీ.. కథా కథనాల్లో పాత్రల చిత్రణలో.. సన్నివేశాల్లో మణిరత్నం మార్కు మిస్సయింది. మణిరత్నం ఇలా రౌడీయిజం.. మాఫియా నేపథ్యంలో సినిమాలు తీయడం కొత్తేమీ కాదు. ‘నాయకుడు’.. ‘యువ’ లాంటి సినిమాల్లో ఆయన ఇలాంటి ప్రయత్నం చేశాడు. ఐతే అక్కడ అడుగడుగునా ఆయన ముద్ర కనిపిస్తుంది. కానీ ఇక్కడ అది లేదు. మణిరత్నం గత సినిమాలతో పోలిస్తే ఇది భిన్నంగా.. కొంచెం మెరుగ్గా ఉందే తప్ప ఒక ప్రత్యేకమైన అనుభూతిని మాత్రం మిగల్చేలా లేదు. ఇక ప్రధాన పాత్రధారులందరూ అచ్చ తమిళ నటులే కావడం.. తెలుగు ప్రేక్షకులతో వాళ్లకు పెద్దగా కనెక్షన్ లేకపోవడం కూడా ‘నవాబ్’తో మనవాళ్లు రిలేట్ చేసుకోవడం కష్టమవుతుంది.

నటీనటులు:

మణిరత్నం సినిమా అంటే నటీనటులెవ్వరికీ వంక పెట్టడానికి వీలుండదు. పాత్రలకు సరిగ్గా సరిపోయే నటీనటుల్ని ఎంచుకుని వారి నుంచి అత్యుత్తమ ప్రదర్శన రాబట్టుకుంటాడు. ‘నవాబ్’ కూడా అందుకు మినహాయింపు కాదు. సినిమాలో ప్రతి నటుడూ మెరిశాడు. అందరిలోకి వరద పాత్రలో నటించిన అరవింద్ స్వామి అదరగొట్టాడు. శింబు.. విజయ్ సేతుపతి.. అరుణ్ విజయ్.. ఇలా ప్రధాన పాత్రధారులు ఎవరికి వాళ్లు తమ ప్రత్యేకతను చాటుకున్నారు. హీరోయిన్లలో జ్యోతిక తన ప్రత్యేకతను చూపించింది. అదితి రావు.. డయానా ఎర్రప్పలకు స్క్రీన్ స్పేస్ తక్కువ. ఉన్నంతలో ఓకే అనిపించారు. ప్రకాష్ రాజ్.. జయసుధ తక్కువ సన్నివేశాల్లోనే తమ ఉనికిని చాటుకున్నారు. త్యాగరాజన్ కూడా బాగా చేశాడు. మిగతా నటీనటులందరూ ఓకే.

సాంకేతిక వర్గం:

రెహమాన్ నేపథ్య సంగీతం ‘నవాబ్’కు పెద్ద బలం. ఆద్యంతం అతను తన పనితనం చూపించాడు. కానీ పాటలు మాత్రం తీవ్ర నిరాశకు గురి చేస్తాయి. గుర్తుండే పాట ఒక్కటీ లేదిందులో. సంతోష్ శివన్ ఛాయాగ్రహణం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. టాప్ క్లాస్ విజువల్స్ తో సినిమాకు రిచ్ నెస్ తీసుకొచ్చాడు. నిర్మాణ విలువలు బాగున్నాయి. ఇక మణిరత్నం ఎంచుకున్న కథలోనే ఏమంత విశేషం లేదు. ప్రేక్షకుడి అంచనాలకు తగ్గట్లే కథనాన్ని కూడా నడిపించాడు. పాత్రల్ని ప్రేక్షకులతో కనెక్ట్ చేయడంలో.. ఎమోషన్లను పండించడంలో ఆయన తన ముద్రను చూపించలేకపోయారు. ఒకప్పుడు మణిరత్నం సినిమా అంటే హిట్టయినా ఫ్లాపైనా థియేటర్ నుంచి బయటికి వచ్చాక చాన్నాళ్లు వెంటాడేది. కానీ ‘నవాబ్’లో అలాంటి లక్షణాలేమీ కనిపించవు. ఇందులో ఆయన మ్యాజిక్ మిస్సయింది.

చివరగా: నవాబ్.. మణిరత్నం మ్యాజిక్ మళ్లీ మిస్

రేటింగ్-2.5/5

Disclaimer : This Review is An Opinion of One Person. Please Do Not Judge The Movie Based On This Review And Watch Movie in Theatre