Begin typing your search above and press return to search.

నయన్ సరోగసీ చట్టబద్ధమే..!

By:  Tupaki Desk   |   27 Oct 2022 2:59 PM GMT
నయన్ సరోగసీ చట్టబద్ధమే..!
X
న‌య‌న‌తార‌ - విఘ్నేశ్‌ శివన్ దంప‌తులు సరోగసీ విధానంలో తల్లిదండ్రులు అవ్వడంపై వివాదం చెలరేగిన సంగతి తెలిసిందే. పెళ్లైన నాలుగు నెలలకే ఇద్దరు కవలలకు జన్మనివ్వడంపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. అయితే సరోగసీ వ్యవహారంలో నయన్ దంప‌తులకు ఊర‌ట ల‌భించింది.

నయన్ - విఘ్నేశ్ ల సరోగసీ చట్టబద్ధమే అని తమిళనాడు ఆరోగ్య శాఖ ఏర్పాటు చేసిన విచారణ కమిటీ క్లీన్ చీట్ ఇచ్చింది. సరోగసీ-2021 యాక్ట్ ప్రకార‌మే కవల పిల్లల్ని జన్మించారని నివేదికలో తెలిపారు. ఈ మేరకు త్రిసభ్య కమిటీ రాష్ట్ర ప్రభుత్వానికి బుధవారం ఓ నివేదికను సమర్పించింది.

స్టార్ కపుల్ 2016 మార్చిలో రిజిస్టర్ విధానంలో వివాహం చేసుకున్న‌ట్లు ధృవీకరణ పత్రాన్ని క‌మిటీకి స‌మ‌ర్పించారని తెలుస్తోంది. అలాగే చెన్నైలోని ఓ ప్రైవేట్ ఆసుప‌త్రిలో ప్రభుత్వ నిబంధ‌న‌ల ప్ర‌కారమే స‌రోగ‌సీ ద్వారా బిడ్డలకు జ‌న్మించిన‌ట్లు ఆధారాలు సబ్మిట్ చేయడంతో.. అధికారుల‌ క‌మిటీ ఈ వివాదంలో క్లీన్ చీట్ ఇచ్చారు.

2021 ఆగస్టులోనే నయనతార దంపతులు సరోగసీ ప్రక్రియ ప్రారంభించారని.. అదే ఏడాది నవంబరులో ఒప్పందం కుదిరిందని కమిటీ నివేదికలో పేర్కొన్నారు. చట్టబద్ధంగా అన్ని నిబంధనలు అనుసరించే వీరు కవలలకు జన్మనిచ్చారని ప్రభుత్వ కమిటీ తేల్చడంతో.. ఈ వ్యవహారానికి ఫుల్‌ స్టాప్‌ పడినట్లయింది.

దాదాపు ఏడేళ్ల నుంచి ప్రేమాయణం సాగిస్తున్న స్టార్ హీరోయిన్ నయనతార - డైరెక్టర్ విఘ్నేశ్ శివన్ అప్పుడెప్పుడో పెళ్లి చేసుకున్నారని గతంలో అనేకసార్లు వార్తలు వచ్చాయి. అయితే చివరకు ఈ ఏడాది జూన్ లో మహాబలిపురంలోని ఓ రిసార్ట్ లో వైభవంగా వివాహం చేసుకున్నారు.

ఈ క్రమంలో అక్టోబర్ 9న తమకు ఇద్దరు అబ్బాయిలు పుట్టారని సోషల్ మీడియా వేదికగా తెలియజేస్తూ తెలియజేస్తూ విఘ్నేష్ శివన్ ఆనందం వ్యక్తం చేశారు. కవలలకు ఉయిర్ మరియు ఉలఘం అనే పేర్లు కూడా పెట్టేసారు. సరోగసీ ద్వారా అయినా పెళ్ళైన నాలుగు నెలల్లోనే అదెలా సాధ్యమని నెట్టింట చర్చ సాగింది.

వైద్యపరంగా అనివార్య కారణాల వల్ల తప్ప భారతదేశంలో సరోగసీ నిషేధించబడిందని.. అలాంటప్పుడు వీరిద్దరూ ఎలా పిల్లల్ని కన్నారంటూ ప్రశ్నలు తలెత్తాయి. ఈ నేపథ్యంలో తమిళనాడు ప్రభుత్వం దీనిపై విచారణ చేయడానికి కమిటీని ఏర్పాటు చేసింది. ఈ సరోగసీ ప్రక్రియ చట్టబద్ధమైనదని కమిటీ తేల్చింది. అయితే నయనతార - విఘ్నేష్ శివన్ దంపతులు ఎందుకు సరోగసీ పద్ధతిని ఎంపిక చేసుకున్నారనే విషయంపై స్పష్టత లేదు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.