Begin typing your search above and press return to search.

మూడు కోట్లు కావాలి.. ప్రమోషన్ కు రాను

By:  Tupaki Desk   |   29 Jun 2017 10:19 AM GMT
మూడు కోట్లు కావాలి.. ప్రమోషన్ కు రాను
X
సౌత్ ఇండియన్ స్టార్ హీరోయిన్లందరూ ఒకవైపు.. నయనతార ఒకవైపు. సినిమా సినిమాకూ ఆమె పారితోషకం పెరిగిపోతుంటుంది. వాటితో పాటు షరతులూ కొనసాగుతుంటాయి. భారీ పారితోషకం పుచ్చుకుంటూ కూడా ప్రమోషన్లకు రానంటూ ఖరాఖండిగా చెప్పేస్తుంది నయనతార. ఏమైనా అంటే అగ్రిమెంట్లో అది లేదు కదా అంటుంది. ఐతే ఆమెకున్న డిమాండ్ దృష్ట్యా నిర్మాతలు సర్దుకుపోతుంటారు. అడిగినంత ఇస్తారు. ఆమె షరతులకు ఒప్పుకుంటారు. తాజాగా సీనియర్ నిర్మాత సి.కళ్యాణ్ కూడా అలాగే రాజీ పడినట్లు సమాచారం. సౌత్ ఇండియాలో ఏ హీరోయిన్‌ కూ లేని స్థాయిలో నయనతారకు ఆయన రూ.3 కోట్ల పారితోషకం ఇవ్వడానికి రెడీ అయ్యాడట. అది కూడా ప్రమోషన్లకు రానన్న షరతు మీద కావడం విశేషం.

నందమూరి బాలకృష్ణతో తమిళ సీనియర్ డైరెక్టర్ కె.ఎస్.రవికుమార్ తీయబోయే సినిమాకు కళ్యాణే నిర్మాత అన్న సంగతి తెలిసిందే. బాలయ్యతో ఇంతకుముందు నయన్ సింహా.. శ్రీరామరాజ్యం లాంటి హిట్ సినిమాల్లో నటించింది. వీళ్లిద్దరిదీ హిట్ పెయిర్ అన్న పేరుండటం.. నయన్‌ తో ఇప్పటికే పని చేసిన అనుభవం ఉండటంతో ఆమెనే కథానాయికగా ఎంచుకోవాలని రవికుమార్ నిర్ణయించుకున్నాడు. ఐతే ఈ సినిమా కోసం అడిగితే.. నయన్ ఏకంగా రూ.3 కోట్లు పారితోషకంగా డిమాండ్ చేసిందట. కొంచెం తగ్గించుకోమన్నా కుదరదని తేల్చి చెప్పిందట. అలాగే తన షరతుల లిస్టు కూడా విప్పిందట. ఐతే బాలయ్య-నయన్ కాంబోకున్న క్రేజ్.. రవికుమార్ సిఫారసు చూసుకుని ఆమె అడిగినంత ఇవ్వడానికి.. షరతులకు ఒప్పుకున్నాడట కళ్యాణ్. ఈ చిత్రం జులై 10న సెట్స్ మీదికి వెళ్లబోతోంది. ‘జయసింహా’ అనే వర్కింగ్ టైటిల్‌తో షూటింగ్ ఆరంభించుకోనున్న ఈ చిత్రాన్ని 2018 సంక్రాంతికి రిలీజ్ చేయాలనుకుంటున్నారు.


Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/