Begin typing your search above and press return to search.

నయనతార దిమ్మదిరిగే షాకిచ్చిందిగా..

By:  Tupaki Desk   |   24 Aug 2017 6:04 AM GMT
నయనతార దిమ్మదిరిగే షాకిచ్చిందిగా..
X
30ల్లోకి పడ్డారంటే హీరోయిన్ల పనైపోయినట్లే అన్న అభిప్రాయాలకు తెరదించి.. ఆ వయసులోకి వచ్చాకే మరింత ఊపు చూపిస్తూ దూసుకెళ్తోంది నయనతార. ఇప్పటికీ సౌత్ ఇండియన్ టాప్ హీరోయిన్లలో ఆమె ఒకరు. తమిళంలో కొన్నేళ్లుగా ఆమె హవా మామూలుగా లేదు. ఐతే తెలుగులో మాత్రం నయన్ డిమాండ్ పడిపోయినట్లుగా కనిపించింది. నాగార్జునతో చేసిన ‘గ్రీకువీరుడు’.. వెంకటేష్‌ తో చేసిన ‘బాబు బంగారం’ ఫ్లాప్ కావడంతో నయనకు ఇక్కడ ఇక కష్టమే అన్నారు. ఇక్కడ సక్సెస్‌ లు లేకపోవడం.. ప్రమోషన్ కు రాదన్న బ్యాడ్ నేమ్ కూడా తోడై తెలుగులో నయనకు మళ్లీ ఇంకో అవకాశం దక్కడమే కష్టమనుకున్నారు.

కానీ ఇలాంటి సమయంలో రెండు క్రేజీ ఆఫర్లు పట్టేసి.. వాటికి భారీగా పారితోషకం కూడా సాధించుకుని తన సత్తా ఏంటో చూపించింది నయనతార. ముందుగా నందమూరి బాలకృష్ణ కొత్త సినిమాకు నయన్ హీరోయిన్ గా ఎంపికైంది. ఆ చిత్రానికి నయనతారకు రూ.3 కోట్లకు పైగా పారితోషకం ఇచ్చి మరీ ఓకే చేయించుకున్నారు. ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి మాగ్నమ్ ఓపస్ ‘సైరా’లోనూ నయన్ అవకాశం దక్కించుకుంది. ఈ చిత్రానికి వర్కింగ్ డేస్ మరింత ఎక్కువ కావడంతో పారితోషకం కూడా అందుకు తగ్గట్లుగానే తీసుకుంటోందట. చిరు సరసన కథానాయికగా చాలామంది పేర్లను పరిశీలించి.. చివరికి నయనతారను మించిన ఛాయిస్ లేదని ఆమెకే ఓటేసింది చిత్ర బృందం. ఈ చిత్రానికి ఆమె రూ.3.5 కోట్లకు పైగా పారితోషకం తీసుకోబోతున్నట్లు సమాచారం. మొత్తంగా చిరు.. బాలయ్యలతో ఒకేసారి జట్టు కడుతూ.. ఈ రెండు సినిమాల ద్వారా రూ.7 కోట్ల దాకా జేబులో వేసుకోబోతోందట నయన్. తెలుగులో నయన్ పనైపోయిందన్న వాళ్లు ఇప్పుడేమంటారు?