Begin typing your search above and press return to search.

ప్రియుడితో కలిసి పండగ చేస్కున్న నయన్

By:  Tupaki Desk   |   14 Sep 2016 11:30 AM GMT
ప్రియుడితో కలిసి పండగ చేస్కున్న నయన్
X
ఇవాళ కేరళీయులకు ప్రత్యేకమైన రోజు. వారికి అతి పెద్ద పండగైన ఓనం ఈ రోజే. దీంతో కేరళ వ్యాప్తంగా సంబరాలే సంబరాలు. ఇళ్లను అందంగా దీపాలతో అలంకరించుకుని.. అందమైన బట్టలు కట్టుకుని మెరిసిపోతుంటారు కేరళీయులు. ముఖ్యంగా అమ్మాయిల్ని ఓనం రోజు చూడటం కనువిందే. తెల్లటి చీరల్లో జ్యువెలరీతో కళకళలాడిపోతుంటారు. సెలబ్రెటీలు కూడా ఇందుకు మినహాయింపు కాదు. సౌత్ ఇండియా టాప్ హీరోయిన్లలో ఒకరైన నయనతార కూడా కేరళ అమ్మాయే అన్న సంగతి తెలిసిందే. ఆమె కూడా పండుగ రోజు సంప్రదాయ పద్ధతిలో ముస్తాబైంది. బంగారు జరీ అంచున్న తెల్లటి చీరలో ముస్తాబై ఫొటోలు దిగింది.

విశేషం ఏంటంటే పండుగ నాడు ఆమె వెంట కొత్త ప్రియుడు విఘ్నేష్ శివన్ కూడా ఉన్నాడు. విఘ్నేష్ ను తన ఇంటికి తీసుకెళ్లి పండగ సంబరాలు చేసుకుంది నయన్. ఇన్నాళ్లూ గుట్టుగా సాగిన వ్యవహారం ఇప్పుడు బాగా ఓపెన్ అయిపోయింది. ఇద్దరూ కలిసి చెట్టాపట్టాలేసుకుని తిరిగేస్తున్నారు. మీడియా వాళ్లున్నా ఏం కంగారు పడట్లేదు. ‘నానుమ్ రౌడీ దా’ సినిమా షూటింగ్ సందర్భంగా ప్రేమలో పడ్డ వీళ్లిద్దరూ ఏడాదిగా సీరియస్ రిలేషన్ షిప్ లో ఉన్నట్లు చెబుతున్నారు. త్వరలోనే వీరి పెళ్లి కూడా జరగొచ్చని వార్తలొస్తున్నాయి. కాకపోతే నయనతార ప్రస్తుతం ఫుల్ డిమాండ్లో ఉంది. ఇంకో రెండేళ్ల వరకు సినిమాల నుంచి బయటికొచ్చే పరిస్థితి లేదు. అంత వరకు కూడా విఘ్నేష్ తో రిలేషన్ షిప్ కొనసాగితే అతణ్నే పెళ్లాడవచ్చేమో.