Begin typing your search above and press return to search.

ఆ రోజున నయన్‌ కు డబుల్‌ టెన్షన్‌

By:  Tupaki Desk   |   28 Aug 2018 4:55 AM GMT
ఆ రోజున నయన్‌ కు డబుల్‌ టెన్షన్‌
X
తెలుగులో హీరోయిన్‌ ఓరియంటెడ్‌ చిత్రాలు అంటే అనుష్క పేరు ఎంత బలంగా వినిపిస్తుందో - ఇప్పుడు అంతే బలంగా నయనతార పేరు తమిళనాట వినిపిస్తుంది. తమిళంలో వరుసగా హీరోయిన్‌ ఓరియంటెడ్‌ చిత్రాలతో నయన్‌ ప్రేక్షకులను అలరిస్తూ వస్తుంది. వరుసగా బ్లాక్‌ బస్టర్‌ సక్సెస్‌ లను దక్కించుకుంటూ సౌత్‌ లో అతి ఎక్కువ పారితోషికం తీసుకుంటున్న హీరోయిన్‌ గా నయన్‌ రికార్డును సాధించింది అంటే ఈమె స్థాయి ఏంటో చెప్పుకోవచ్చు. తాజాగా ఈమె నటించిన తమిళ చిత్రం ‘కొలమావు కోకిల’ చిత్రం అక్కడ సంచలన విజయాన్ని సొంతం చేసుకుంది. మొదటి వారంలో 9 కోట్ల షేర్‌ ను దక్కించుకుని 20 కోట్ల గ్రాస్‌ ను వసూళ్లు చేసి స్టార్‌ హీరోలకు ఏమాత్రం తగ్గను అంటూ చెప్పకనే చెప్పింది.

‘కొలమాను కోకిల’ చిత్రం తెలుగులో ‘కో కో కోకిల’ టైటిల్‌ తో తెలుగులో విడుదలకు సిద్దం అయ్యింది. తెలుగులో కూడా నయన్‌ కు మంచి క్రేజ్‌ ఉంది. గతంలో నయన్‌ నటించిన పలు చిత్రాలు తెలుగు బాక్సాపీస్‌ వద్ద భారీ వసూళ్లను రాబట్టాయి. అందుకే ‘కో కో కోకిల’ చిత్రం తప్పకుండా ఆకట్టుకుంటుందనే నమ్మకంతో సినీ వర్గాల వారు ఉన్నారు. ఈ చిత్రం ఈనెల 31న ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్దం అయ్యింది. ఇక అదే రోజున అంటే ఈనెల 31న తమిళంలో ఈమె నటించిన ‘ఇమైక నోడిగల్‌’ అనే చిత్రం విడుదల కాబోతుంది.

‘ఇమైక నోడిగల్‌’ చిత్రాన్ని నయన్‌ చాలా ఇష్టపడి చేసింది. కథ నచ్చడంతో ఈ చిత్రంకు కాస్త తక్కువ పారితోషికం తీసుకుందని కూడా తమిళ మీడియా సంస్థల్లో వార్తలు వచ్చాయి. అయితే కొన్ని కారణాల వల్ల సినిమా వాయిదాల మీద వాయిదాలు పడుతూ ఎట్టకేలకు విడుదలకు సిద్దం అయ్యింది. అనుకోకుండా తెలుగులో ‘కో కో కోకిల’ మరియు తమిళంలో ‘ఇమైక నోడిగల్‌’లు ఒకే రోజున రాబోతున్న కారణంగా నయన్‌ టెన్షన్‌ పడుతోంది. రెండు సినిమాలు కూడా ఆమెకు చాలా కీలకం. రెండు సినిమాలు ఒకే రోజున రావడం అనేది చాలా చాలా అరుదుగా జరుగుతుంది. నయన్‌ కు అది ఇప్పుడు ఎదురైంది. ఈ రెండు పరీక్షల్లో నయన్‌ ఎలాంటి ఫలితాలను సాధిస్తుందో చూడాలి అంటే ఈ నెల 31న వరకు ఆగాల్సిందే.