Begin typing your search above and press return to search.

ధోనీ సినిమాకి ధోనీకి ఏమీ ఇవ్వలేదట!

By:  Tupaki Desk   |   11 Sep 2016 4:15 AM GMT
ధోనీ సినిమాకి ధోనీకి ఏమీ ఇవ్వలేదట!
X
భార‌త క్రికెట్ జ‌ట్టు కెప్టెన్ మ‌హేంద్ర సింగ్ ధోనీ జీవితం ఆధారంగా ఓ చిత్రం తెర‌కెక్కుతున్న సంగ‌తి తెలిసిందే. ‘ఎమ్‌.ఎస్‌.ధోనీ - ఎన్ అన్ టోల్డ్ స్టోరీ’ పేరుతో ద‌ర్శ‌కుడు నీర‌జ్ పాండే ఈ చిత్రాన్ని తెర‌కెక్కించాడు. మ‌హేంద్ర సింగ్ ధోనీ పాత్ర‌లో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ న‌టిస్తున్నాడు. త్వ‌ర‌లోనే ప్రేక్ష‌కుల ముందుకు రాబోతున్న ఈ చిత్రంపై మొద‌ట్నుంచీ భారీ అంచ‌నాలే ఏర్ప‌డ్డాయి. ఈ చిత్రం ట్రైల‌ర్ ప్ర‌స్తుతం హ‌ల్ చ‌ల్ చేస్తోంది. అంచ‌నాల‌కు త‌గ్గ‌ట్టుగానే సినిమా విడుద‌ల‌కు ముందే మాంచి బిజినెస్ చేసింద‌ని బాలీవుడ్ వ‌ర్గాలు చెబుతున్నాయి. అయితే, ఈ సినిమాకు త‌న జీవిత చ‌రిత్ర‌ను క‌థ‌గా ఇచ్చినందుకు ధోనీ రూ. 40 కోట్లు ఛార్జ్ చేశాడంటూ ఈ మ‌ధ్య వార్త‌లు వ‌చ్చాయి. న‌ల‌భై కాదు - రూ. 60 కోట్లు డిమాండ్ చేశాడ‌ని కూడా కొన్ని ప‌త్రిక‌లు రాసేశాయి. అయితే, ఈ వార్త‌ల్లో వాస్త‌వం లేద‌ని చెప్పారు చిత్ర ద‌ర్శ‌కుడు నీర‌జ్ పాండే!

ఈ సినిమా క‌థ కోసం ధోనీకి రూ. 40 కోట్లు చెల్లించిన‌ట్టు వ‌స్తున్న వార్త‌ల్లో ఏమాత్రం వాస్త‌వం లేద‌ని కొట్టిపారేశారు నీర‌జ్ పాండే. ఇలాంటి పుకార్ల‌ను న‌మ్మొద్దంటూ ఆయ‌న చెప్పారు. అయితే, నిర్మాత‌లు ధోనీకి ఏమీ ఆఫ‌ర్ చేయ‌లేదా..? లేదా, ధోనీ నిర్మాత‌ల నుంచి ఏమీ ఆశించ‌లేదా అనే క్లారిటీ ద‌ర్శ‌కుడు ఇవ్వ‌లేదు. ఇక‌, వ్యాపార‌ప‌రంగా నిర్మాత‌ల‌కు చాలా లాభాల‌నే తెచ్చిపెడుతోందీ చిత్రం. ఈ చిత్రం తెర‌కెక్కించ‌డానికి రూ. 80 కోట్లు ఖ‌ర్చు చేసిన‌ట్టు నిర్మాత చెబుతున్నారు. విడుద‌ల‌కు ముందే నిర్మాత‌ల క‌లెక్ష‌న్స్ రూ. 60 కోట్లు దాటేశాయ‌ని బాలీవుడ్ ట్రేడ్ వ‌ర్గాలు చెబుతున్నాయి. ఈ చిత్రం శాటిలైట్ హ‌క్కులకు కూడా మాంచి ఫ్యాన్సీ రేటు వ‌చ్చింద‌ని అంటున్నారు. శాలిలైట్ రైట్స్ రూ. 60 కోట్ల‌కు అమ్ముడుపోయాయ‌ని క‌థ‌నాలు వ‌స్తున్నాయి. మొత్తానికి విడుద‌ల‌కు ముందే సంచ‌ల‌నాలు సృష్టిస్తున్నాడు ధోనీ. విడుద‌ల అయ్యాక బాక్సాఫీస్ వ‌ద్ద ఎన్ని సెంచ‌రీలు కొడ‌తాడో వేచి చూడాలి! ప్ర‌శ్న ఏంటంటే... ఈ చిత్రం ఇంత భారీ ఎత్తున బిజినెస్ చేస్తుంటే నిజంగానే ధోనీ అస్స‌లు ఏమీ ఆశించ‌లేదా..?