Begin typing your search above and press return to search.

ట్రెండీ స్టోరి: పొరుగు డైరెక్ట‌ర్ల బంధిఖానాలో చిక్కారు!

By:  Tupaki Desk   |   4 May 2021 3:30 AM GMT
ట్రెండీ స్టోరి: పొరుగు డైరెక్ట‌ర్ల బంధిఖానాలో చిక్కారు!
X
ఇటీవ‌ల కొంత‌కాలంగా టాలీవుడ్ ప‌ర‌భాషా ద‌ర్శ‌కుల‌తో ప‌ని లేకుండా ముందుకు సాగుతోంది. కానీ చూస్తుండ‌గానే అంతా మారింది. అనూహ్యంగా పొరుగు ద‌ర్శ‌కుల హ‌వా మ‌ళ్లీ మ‌న ప‌రిశ్ర‌మ‌లో పెరిగిన‌ట్టే క‌నిపిస్తోంది. ఇప్ప‌టికిప్పుడు కేజీఎఫ్ ప్ర‌శాంత్ నీల్ .. లింగుస్వామి.. మోహ‌న్ రాజా.. జీతూ జోసెఫ్‌.. ఓంరౌత్.. శంక‌ర్ .. ఇలా ప్ర‌ముఖ ద‌ర్శ‌కులంతా టాలీవుడ్ పై దండ యాత్ర చేస్తున్నారు. మ‌నోళ్ల‌ను లాక్ చేసి కాల్షీట్ల‌ను బ్లాక్ చేశారు వీళ్లంతా.

మెగాస్టార్ చిరంజీవి లూసీఫ‌ర్ రీమేక్ కోసం త‌మిళ ద‌ర్శ‌కుడు మోహ‌న్ రాజాను బ‌రిలో దించారు. ప్రీప్రొడ‌క్ష‌న్ పూర్తి చేసుకుంటున్న ఈ సినిమా త్వ‌ర‌లో ప్రారంభం కానుంది. చిరు ఆచార్య చిత్రాన్ని పూర్తి చేయ‌గానే వెంట‌నే సెట్స్ కి వెళ‌తారు. విక్ట‌రీ వెంక‌టేష్ దృశ్యం 2 లో న‌టిస్తున్నారు. మ‌ల‌యాళీ ద‌ర్శ‌కుడు జీతూ జోసెఫ్ తెలుగు రీమేక్ కి కూడా ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు.

ఇక క‌న్న‌డ డైరెక్ట‌ర్ కేజీఎఫ్ ప్ర‌శాంత్ నీల్ హ‌వా టాలీవుడ్ లో మామూలుగా లేదు. చూస్తుండ‌గానే స్టార్ హీరోలంద‌రినీ చుట్టేస్తున్నాడు. దొరికిన వాళ్లంద‌రినీ బ్లాక్ చేస్తున్నాడు. ప్ర‌భాస్ తో స‌లార్ అనే పాన్ ఇండియా చిత్రాన్ని తీస్తున్నాడు. త‌ర్వాత ఎన్టీఆర్ .. బ‌న్నితో కూడా సినిమాల్ని ఖాయం చేసుకున్నాడు. మ‌హేష్ కూడా అత‌డు వినిపించిన‌ లైన్ విన్నాడు. ఇవ‌న్నీ `బ్యాక్ టు బ్యాక్` సెట్స్ కెళితే ప్ర‌శాంత్ నీల్ టాలీవుడ్ లో ఒక అధ్యాయం లిఖించినవాడు అవుతాడు. ఈ నాలుగైదేళ్ల‌ను అత‌డి ఖాతాలో వేసుకున్న‌ట్టే.

డార్లింగ్ ప్ర‌భాస్ ఒకేసారి ఇద్ద‌రు ప‌ర‌భాషా ద‌ర్శ‌కుల‌తో ప‌ని చేస్తున్నాడు. బాలీవుడ్ ద‌ర్శ‌కుడు ఓంరౌత్ తో ఆదిపురుష్ 3డి చేస్తూనే.. కేజీఎఫ్‌ ప్ర‌శాంత్ నీల్ తో స‌లార్ సినిమాలో న‌టిస్తున్నాడు. వీటికి క‌రోనా వ‌ల్ల బ్రేక్ ప‌డింది. వార్ ద‌ర్శ‌కుడు సిద్ధార్థ్ ఆనంద్ తోనూ ప్ర‌భాస్ ఓ సినిమా చేయ‌నున్నార‌ని క‌థ‌నాలొచ్చాయి.

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కూడా కేజీఎఫ్ ప్ర‌శాంత్ నీల్ తో ఓ సినిమాని..త‌మిళ ద‌ర్శ‌కుడు ఏ.ఆర్.మురుగదాస్ తో మ‌రో సినిమాని ప్లాన్ చేస్తున్నాడు. సుక్కూ.. కొర‌టాలతో సినిమాల‌ త‌ర్వాత వీళ్ల‌తో సెట్స్ కెళ్లే వీలుంది. మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ ఏకంగా రోబో శంక‌ర్ నే లాక్ చేసి 500కోట్ల బ‌డ్జెట్ తో పాన్ ఇండియా సినిమాని ప్లాన్ చేయ‌డంతో రేస్ లో ఒక్క‌సారిగా స్కైని ట‌చ్ చేస్తున్నాడు. అలాగే ఇస్మార్ట్ హీరో రామ్ ఏకంగా పందెంకోడి లింగుస్వామిని బ‌రిలో దించాడు. ఈ సీనియ‌ర్ త‌మిళ హీరోతో ద్విభాషా చిత్రం చేస్తున్నాడు. ఇలా ఇంకా చాలా ప్రాజెక్టుల‌కు ప‌ర‌భాషా ద‌ర్శ‌కులు ప‌ని చేస్తుండ‌డం హాట్ టాపిక్ గా మారింది.