Begin typing your search above and press return to search.

మూవీ రివ్యూ: 'నేనోరకం'

By:  Tupaki Desk   |   17 March 2017 5:01 PM GMT
మూవీ రివ్యూ: నేనోరకం
X
చిత్రం: ‘నేనోరకం’

నటీనటులు: సాయిరాం శంకర్ - రేష్మి మీనన్ - శరత్ కుమార్ - ఆదిత్య మీనన్ - కాశీ విశ్వనాథ్ - పృథ్వీ - ఎమ్మెస్ నారాయణ - వైవా హర్ష తదితరులు
సంగీతం: మహిత్ నారాయణ
ఛాయాగ్రహణం: సిద్ధార్థ్
నిర్మాత: శ్రీకాంత్ రెడ్డి
రచన-దర్శకత్వం: సుదర్శన్ సలేంద్ర

పూరి జగన్నాథ్ తమ్ముడు సాయిరాం శంకర్ హీరోగా అరంగేట్రం చేసి దశాబ్దం దాటినా.. ఇప్పటికి ‘పూరి జగన్నాథ్ తమ్ముడు’గానే ఉన్నాడు. తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవాలని.. హీరోగా మంచి విజయాన్నందుకోవాలని అతను చేస్తున్న ప్రయత్నాలు ఫలించట్లేదు. గత ఏడాది ‘అరకు రోడ్లో’ అనే సినిమాతో పలకరించాడు కానీ.. అది కూడా నిరాశ పరిచింది. ఇప్పుడు సుదర్శన్ సలేంద్ర అనే కొత్త దర్శకుడితో చేసిన ‘నేనోరకం’తో ప్రేక్షకుల ముందుకొచ్చాడు సాయిరాం. ట్రైలర్ తో ఆసక్తి రేకెత్తించిన ఈ సినిమా విశేషాలేంటో చూద్దాం పదండి.

కథ:

గౌతమ్ (సాయిరాం శంకర్) ఒక ఫైనాన్స్ కంపెనీలో లోన్ రికవరీ ఏజెంటుగా పని చేస్తుంటాడు. అతను మొక్కల్ని ప్రాణంగా ప్రేమించే స్వేచ్ఛ (రేష్మి మీనన్) అనే అమ్మాయిని ప్రేమిస్తాడు. ఆ అమ్మాయికి ఏవేవో అబద్ధాలు చెప్పి ప్రేమలో పడేస్తాడు. స్వేచ్ఛ.. గౌతమ్ కు తన ప్రేమను చెప్పడానికి వస్తున్న సమయంలో అతడి కళ్ల ముందే కిడ్నాపవుతుంది. ఆమెను కిడ్నాప్ చేసిన వ్యక్తి గౌతమ్ ను బెదిరించడం మొదలుపెడతాడు. ఇంతకీ అతనా కిడ్నాప్ ఎందుకు చేశాడు? అతడి డిమాండ్లేంటి? గౌతమ్ తన ప్రేయసిని కాపాడుకోవడానికి ఏం చేశాడు అన్నది మిగతా కథ.

కథనం - విశ్లేషణ:

‘నేనోరకం’ ఒక కిడ్నాప్ డ్రామా నేప‌థ్యంలో సాగే సినిమా.. ఈ సినిమాకు ఆకర్షణగా నిలిచేది కూడా కిడ్నాప్.. దాని చుట్టూ తిరిగే వ్యవహారమే. కాకపోతే సమస్య ఏంటంటే ఈ కిడ్నాప్ డ్రామా ఇంటర్వెల్ దగ్గర మొదలవుతుంది. అక్కడి నుంచే కొంచెం ఆసక్తికరంగా సాగుతుంది. ఐతే ఈ కిడ్నాప్ డ్రామా మొదలవడానికి ముందు జరిగే వ్యవహారమే ప్రేక్షకుల సహనాన్ని పరీక్షిస్తుంది. దర్శకుడు అసలు కథలోకి వెళ్లేముందు పాత్రల పరిచయం.. రొమాంటిక్ ట్రాక్.. కామెడీ.. వీటి కోసం ప్రథమార్ధాన్ని వాడుకున్నాడు. ఐతే ఇవన్నీ టైంపాస్ వ్యవహారాల్లాగా కనిపిస్తాయి తప్ప.. కథనానికి పెద్దగా ఉపయోగపడలేదు. ప్రథమార్ధాన్ని ఏదోలా నింపేద్దామని చూడకుండా ప్రేమకథను కూడా కొంత ఆసక్తికరంగా చెప్పి ఉంటే ‘నేనోరకం’ మేలుర‌కంగా ఉండేది.

ఓ సందేశాన్ని కిడ్నాప్ డ్రామాతో ముడిపెట్టి చెప్పే సినిమా ‘నేనోరకం’. ఆ సందేశం ఏంటన్నది తెరమీదే చూడాలి. ప్రథమార్ధంలో ప్రేమకథను నడిపించి.. ఆ తర్వాత అసలు మూల కథలోకి వెళ్లాడు దర్శకుడు. హీరో హీరోయిన్ని తొలి చూపులోనే ప్రేమించేయడం.. ఆమెకేవో అబద్ధాలు చెప్పి ప్రేమలోకి దింపడం.. హీరోయిన్ సరైన కారణమేమీ లేకుండా హీరోను ప్రేమించేయడం.. మధ్య మధ్యలో పాటలు.. కామెడీ సీన్లు.. ఇలా సగం వరకు చాలా మామూలుగా సాగిపోతుంది ‘నేనోరకం’. ఐతే ఇంటర్వెల్ దగ్గర మలుపు ఆసక్తి రేకెత్తిస్తుంది. ద్వితీయార్ధమంతా హీరో పరుగెడుతూనే ఉంటాడు. అప్ప‌టిదాకా న‌త్త‌న‌డ‌క‌న సాగుతున్న క‌థ‌నం కూడా కొంచెం ప‌రుగందుకునేది ఇక్క‌డే. కిడ్నాపర్ ఉద్దేశమేంటి అన్నది వెంటనే అర్థం కానివ్వకుండా.. ప్రేక్షకుడి అంచనాలకు అందకుండా సన్నివేశాలు నడుస్తాయి ద్వితీయార్ధంలో. ఐతే ఓ దశ దాటాక విలన్ ఉద్దేశమేంటో నెమ్మదిగా అర్థమవుతుంది. అక్కడి నుంచి కథ ప్రేక్షకుడి అంచనాలకు తగ్గట్లే సాగుతుంది.

ప్ర‌థ‌మార్ధంతో పోలిస్తే ద్వితీయార్ధం బెట‌ర్ గా అనిపిస్తుంది కానీ.. అది కూడా పూర్తిగా అయితే మెప్పించ‌దు. ఇక్క‌డా లోపాలు లేక‌పోలేదు. శ‌ర‌త్ కుమార్ పాత్ర అమ్మాయిని కిడ్నాప్ చేయ‌డానికి ఎంచుకున్న కార‌ణం.. ఆ అమ్మాయి బాయ్ ఫ్రెండుకి ర‌క‌ర‌కాల ప‌రీక్ష‌లు పెట్ట‌డం అంత లాజిక‌ల్ గా అనిపించ‌దు. దీనికి సంబంధించిన స‌న్నివేశాలు కొంచెం ఫోర్స్డ్ గా అనిపిస్తాయి. ఐతే లాజిక్కుల గురించి ఎక్కువ ఆలోచించ‌నివ్వ‌కుండా చ‌క‌చ‌కా సాగిపోవ‌డం ‘నేనోర‌కం’ రెండో అర్ధంలో ఉన్న ప్ల‌స్ పాయింట్. ప్రి క్లైమాక్స్ వ‌ర‌కు బాగానే న‌డిపించిన ద‌ర్శ‌కుడు అందుకు క్లైమాక్స్ రాసుకోలేక‌పోయాడు. సినిమాను చాలా మామూలుగా ముగించేశాడు. ఓవ‌రాల్ గా ‘నేనోర‌కం’ కొంత‌వ‌ర‌కు ఇబ్బంది పెట్టి.. కొంత‌మేర‌కు ఆక‌ట్టుకుంటుంది. సాయిరాం శంక‌ర్ గ‌త సినిమాల‌తో పోలిస్తే ఇది బెట‌రే.

నటీనటులు:

సాయిరాం శంకర్ ఒకప్పటి ‘అతి’ వదిలి మామూలుగా నటించాడు. డైలాగ్ డెలివరీ ఇప్పటికీ కొంచెం ఇబ్బందిగానే ఉన్నప్పటికీ నటనతో మెప్పించాడు. ప్రేయసిని కాపాడుకోవడానికి తపిస్తూ సంఘర్షణ అనుభవించే సన్నివేశాల్లో అతడి నటన ఆకట్టుకుంటుంది. రేష్మి మీనన్ అందంగా ఉంది. నటన కూడా ఓకే. సినిమాలో హీరో హీరోయిన్ల కంటే కూడా శరత్ పాత్రే సినిమాలో కీలకం. దానికి తగ్గట్లే శరత్ నటించాడు కానీ.. ఆయన్ని ఇంకా బాగా వాడుకుని ఉండాల్సింద‌నిపిస్తుంది. శరత్ సొంతంగా డబ్బింగ్ కూడా చెప్పుకున్నాడు. అది ఇబ్బందిక‌రంగా అయితే లేదు. ఆదిత్య మీనన్ కూడా బాగానే చేశాడు. ఎమ్మెస్ చనిపోవడానికి ముందు చేసిన పాత్రకు డబ్బింగ్ తో బాగానే మేనేజ్ చేశారు. వైవా హర్ష కామెడీ పర్వాలేదు. పృథ్వీ పాత్రేమీ అంత ప్రత్యేకంగా లేదు. మిగతా వాళ్లంతా మామూలే.

సాంకేతికవర్గం:

చక్రి తమ్ముడు మహిత్ నారాయణ అందించిన సంగీతం ఆకట్టుకుంటుంది. పాటలు పర్వాలేదు. ఒక మెలోడీలో చక్రిని గుర్తుకు తెచ్చాడు మహిత్. ఐతే సినిమాకు పాటలు పెద్ద స్పీడ్ బ్రేకర్లలా తయారయ్యాయి. ద్వితీయార్ధంలో నేపథ్య సంగీతం కీలక పాత్ర పోషించింది. సన్నివేశాలు ఉత్కంఠ రేకెత్తించడానికి బ్యాగ్రౌండ్ స్కోర్ ఉపయోగపడింది. సిద్ధార్థ్ ఛాయాగ్రహణం కూడా ఓకే. నిర్మాణ విలువలు పర్వాలేదు. కొత్త దర్శకుడు సుదర్శన్.. ఒక సందేశాన్ని కిడ్నాప్ డ్రామాతో ముడిపెట్టి చెప్పే ప్రయత్నం చేశాడు. అతను అక్కడక్కడా మెప్పించాడు. అతనెంచుకున్న కథాంశం ఆసక్తి రేకెత్తించేదే. ఐతే కిడ్నాప్ డ్రామాను బాగానే నడిపించిన దర్శకుడు.. రొమాంటిక్ ట్రాక్.. కామెడీ విషయంలో పెద్దగా మెప్పించలేకపోయాడు. శరత్ కుమార్ లాంటి సీనియర్ నటుడిని ఎంచుకుని.. అతడి పాత్రను ప్రేక్షకులకు కనెక్ట్ చేయడంలో దర్శకుడు ప్రతిభ చూపించాడు. అత‌ను క‌థాక‌థ‌నాల్ని ఇంకాస్త క్రిస్ప్ గా తీర్చిదిద్దుకుని ఉండాల్సింది.

చివరగా: నేనోర‌కం.. అదోర‌కం

రేటింగ్-2.5/5

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/

Disclaimer : This Review is An Opinion of One Person. Please Do Not Judge The Movie Based On This Review And Watch Movie in Theatre