Begin typing your search above and press return to search.

కొత్త రైటర్ కుమ్మేశాడు..

By:  Tupaki Desk   |   15 Jan 2017 11:23 AM GMT
కొత్త రైటర్ కుమ్మేశాడు..
X
ప్రసన్న కుమార్.. నిన్న రాత్రి ‘నేను లోకల్’ ఆడియో వేడుక ఆద్యంతం ఈ పేరు మార్మోగింది. హీరో నాని దగ్గర్నుంచి.. నిర్మాత దిల్ రాజు వరకు ప్రతి ఒక్కరూ ప్రసన్న పేరు ప్రస్తావించారు. అతడి టాలెంట్ గురించి.. అతడిచ్చిన ‘నేను లోకల్’ స్క్రిప్టు గురించి మాట్లాడారు. ‘నేను లోకల్’ ట్రైలర్ చాలా ప్రామిసింగ్ గా.. స్యూర్ షాట్ హిట్టయ్యేలా కనిపించింది. హీరో క్యారెక్టరైజేషన్.. డైలాగులు సినిమాకు హైలైట్ గా నిలిచేలా ఉన్నాయి. ఈ క్రెడిట్ అంతా ప్రసన్నదే అని తేల్చేశారు అందరూ. దర్శకుడు త్రినాథరావు నక్కిన సైతం ప్రసన్నపై ప్రశంసలు కురిపించాడు. అతను తీసిన ‘సినిమా చూపిస్త మావ’కు కూడా ప్రసన్నే రచయిత.

ప్రసన్న స్క్రిప్టులో దమ్మెంతో సినిమా చూశాక తెలుస్తుంది కానీ.. అంతకంటే ముందు తన ప్రసంగంతో అదరగొట్టేశాడీ కుర్ర రైటర్. తాను కాకినాడలో ఇంజినీరింగ్ కాలేజీలో చేరడానికి వచ్చినపుడు తన తండ్రి తనను ఓ రూంలో పెట్టి వెళ్లిపోయాడని.. తర్వాత తాను ఆపకుండా ఏడుస్తూ ఉండిపోయానని.. సాయంత్రానికి బయటికి వస్తే ‘ఆర్య’ పోస్టర్ చూసి ఆ సినిమాకు వెళ్లానని.. సినిమా మొదలవగానే తన ఏడుపు ఆగిపోయిందని.. సినిమా చూశాక తన ఫ్యామిలీనే మరిచిపోయానని అన్నాడు ప్రసన్న. ఆ తర్వాత ‘భద్ర’ సినిమా ఆడుతున్న థియేటర్ పక్కనే రూంలో ఉన్న తనకు.. ఆ సినిమాలో ప్రతి డైలాగ్ కంఠతా వచ్చేసి.. దిల్ రాజు బేనర్లో తాను ఓ సినిమా చేయాలన్న సంకల్పం మొదలైందని.. ఎనిమిదేళ్ల పోరాటం తర్వాత తన కల నెరవేరి ఆయన్ని తాను చేరుకున్నానని చెప్పాడు. తన ఫస్ట్ నైట్ కంటే కూడా నానికి కథ చెప్పిన రోజు రాత్రిని ఎప్పటికీ గుర్తుంచుకుంటానని అతనన్న మాటకు ఆడియో వేడుక ప్రాంగణమంతా హోరెత్తిపోయింది. కథ ఓకే చేయించుకున్నాక దిల్ రాజుకు మెసేజ్ పెడదాం లేదా కాల్ చేద్దామంటే ఎంతకీ నాని తనను వదలకపోయేసరికి టెన్షన్ వచ్చేసిందని ప్రసన్న చెప్పాడు. మొత్తంగా ఆరేడు నిమిషాల పాటు మాట్లాడిన ప్రసన్న ఆద్యంతం ఆసక్తి రేకెత్తించాడు. ప్రసన్న మాటలు చూస్తే అతడిలో విషయం ఉందని అందరికీ అర్థమైంది. మరి ‘నేను లోకల్’తో ఈ యంగ్ రైటర్ తన టాలెంట్ ఏ రేంజిలో చూపిస్తాడో చూద్దాం.