Begin typing your search above and press return to search.

నాని సినిమా తర్వాత మళ్లీ ఇదే..

By:  Tupaki Desk   |   4 Jan 2016 10:59 AM GMT
నాని సినిమా తర్వాత మళ్లీ ఇదే..
X
ఒకప్పుడు తెలుగు సినిమా యుఎస్‌ లో విడుదలవడమే కష్టంగా ఉండేది. కానీ ఇప్పుడు మన సినిమాకు బాగా మార్కెట్ పెరిగి.. తెలుగు రాష్ట్రాల్లోని నైజాం, ఆంధ్రా, సీడెడ్ తర్వాత అది కూడా ఓ ముఖ్యమైన ఏరియాగా మారింది. పెద్ద హీరోల సినిమాలకు అక్కడ భారీగా బిజినెస్ కూడా జరుగుతోంది. ‘బాహుబలి’ సినిమా అక్కడ 8 మిలియన్ డాలర్లు వసూలు చేసి తెలుగు సినిమా మార్కెట్ పరిధిని బాగా విస్తరించింది. దీని తర్వాత పెద్ద సినిమాల్ని అక్కడ కూడా భారీ స్థాయిలో రిలీజ్ చేస్తున్నారు. ఐతే యుఎస్‌ లో మార్కెట్ పెరిగిన మాట వాస్తవమే కానీ.. ఆ వేడిలో ఇష్టానుసారం పెట్టుబడులు పెడితే అసలుకే మోసం వస్తుందని కొన్ని సినిమాలు రుజువు చేశాయి. ముఖ్యంగా ‘భలే భలే మగాడివోయ్’ మిలియన్ డాలర్ క్లబ్బులో అడుగుపెట్టాక వేలం వెర్రిగా తెలుగు సినిమాలపై పెట్టుబడులు పెట్టారు అక్కడి బయ్యర్లు.

కానీ బ్రూస్ లీ - అఖిల్ లాంటి సినిమాలు దారుణమైన ఫలితాన్నిచ్చాయి. నామ మాత్రపు వసూళ్లతో భారీగా నష్టపోయారు బయ్యర్లు. ‘కంచె’ మినహాయిస్తే గత మూడు నెలల్లో పెట్టుబడులు తిరిగి తెచ్చిన సినిమానే లేదు. ఐతే ఎట్టకేలకు ‘నేను శైలజ’ మళ్లీ యుఎస్ లో తెలుగు సినిమాల మార్కెట్ ను మళ్లీ కళకళలాడిస్తోంది. ఈ సినిమా విడుదలకు ముందు రోజు ప్రిమియర్స్ కలుపుకుని తొలి రెండు రోజుల్లోనే 3.3 లక్షల డాలర్లు వసూలు చేసి ట్రేడ్ పండితుల్ని ఆశ్చర్యపరిచింది. ప్రముఖ బాలీవుడ్ ట్రేడ్ అనలిస్ట్ తరణ్ ఆదర్శ్ కూడా ఈ కలెక్షన్లు చూసి ఆశ్చర్యపోయాడు. ఇక ఆదివారం కూడా కలిపితే ఈ సినిమా హాఫ్ మిలియన్ క్లబ్బులో అడుగుపెట్టేసి ఉంటుందని అంచనాలున్నాయి. సంక్రాంతి సినిమాలు వచ్చే వరకు ఇదే జోరు కొనసాగితే.. ‘నేను శైలజ’ మిలియన్ క్లబ్బుకి చేరువగా వెళ్లే అవకాశముంది.