Begin typing your search above and press return to search.

'ఉప్పెన‌' థియేట‌ర్లో నెట్ ఫ్లిక్స్‌ దుమారం.. ఇదేం యవ్వారం?

By:  Tupaki Desk   |   13 Feb 2021 3:30 AM GMT
ఉప్పెన‌ థియేట‌ర్లో నెట్ ఫ్లిక్స్‌ దుమారం.. ఇదేం యవ్వారం?
X
ఆలస్యమైతే అమృతం కాస్తా విషం అవుతుందంటారు పెద్ద‌లు. కానీ.. ఖ‌చ్చితంగా పాయిజ‌నే కావాల్సిన ప‌న్లేదు.. అమృతానికి మించిన ప‌దార్థం కూడా అవ్వొచ్చు అని సామెత‌ను తిర‌గేసుకోవ‌చ్చు! దీనికి ఉదాహ‌ర‌ణ కావాలంటే.. ఉప్పెన సినిమాను చూపిస్తే స‌రిపోతుంది. అప్పుడెప్పుడో పూర్త‌యిన ఈ సినిమా.. రిలీజ్ కోసం లాక్ డౌన్ మొత్తం వెయిట్ చేసింది.

నిర్మాత‌ల‌కు వ‌డ్డీ భారం త‌డిసి మోపెడ‌వుతూ వ‌చ్చింది. ఈ క్ర‌మంలోనే ఓటీటీలు బేరానికి వ‌చ్చాయి. పోనీ.. ఇచ్చేద్దామా? అంటే మెగా పిల్లోడి మొద‌టి సినిమా అయిపోయింది! ఈ లాక్ డౌన్ గోల ఇంకెప్పుడు ముగుస్తాయో.. థియేట‌ర్లు ఎప్పుడు తెరుచుకుంటాయో అని మేక‌ర్స్ ఖ‌చ్చితంగా మ‌ద‌న‌ప‌డి ఉంటారు.

కానీ.. ఈ లాక్ డౌన్ కాల‌మే ఉప్పెన‌కు క‌లిసి వ‌చ్చింద‌ని చెప్పొచ్చు. లాక్ డౌన్ కు ముందే అయితే.. ఏదో కొద్దిపాటి ప్ర‌మోష‌న్ తో బొమ్మ ప‌డిపోయేది. కానీ.. ఇప్పుడు భారీ ప్ర‌మోష‌న్స్ న‌డుమ‌.. కావాల్సినంత హైప్ తో.. అది కూడా థియేట‌ర్ల‌లోనే రిలీజ‌య్యిందీ సినిమా.

ఈ మూవీకి వ‌స్తున్న టాక్ చూస్తే.. డెబ్యూ సినిమా విభాగంలో మంచి క‌లెక్ష‌న్స్ సాధించేట్టు క‌నిపిస్తోంది. అయితే.. మేక‌ర్స్ తీసుకున్న ఓ నిర్ణ‌యం ఇప్పుడు ఎగ్జిబిట‌ర్ల‌ను ఆవేద‌న‌కు, ఆగ్ర‌హానికి గురిచేసేట్టు క‌నిపిస్తోంది. సినిమా రిలీజ్ అయిన తొలిరోజే.. స్క్రీన్ పై పేర్లు ప‌డుతుండ‌గానే.. ‘త్వ‌ర‌లో నెట్ ఫ్లిక్స్ లో రిలీజ్ కాబోతోంది’ అని ప్రకటించడం గమనార్హం!

ఈ ఇన్ఫ‌ర్మేష‌న్ ఎలా ఉందంటే.. మీరు థియేట‌ర్ వ‌ర‌కూ ఎందుకు వ‌స్తారు..? త‌్వ‌ర‌లోనే ఓటీటీలో వ‌స్తోంది.. ఇంటిద‌గ్గ‌రే చూసుకోండి అన్న‌ట్టుగా ఉందని అభిప్రాయ ప‌డుతున్నారు ప్రేక్ష‌కులు. ఈ లెక్క‌న నెట్ ఫ్లిక్స్ తో మేక‌ర్స్ మంచి ఒప్పందం కుదుర్చుకున్న‌ట్టుగానే తెలుస్తోంది. ఇది ఖ‌చ్చితంగా ఎగ్జిబిట‌ర్ల‌కు ఆందోళ‌న క‌లిగించే విష‌య‌మే. మ‌రి, దీనిపై వారు ఎలా స్పందిస్తారు? ఒక‌వేళ అడిగితే.. మేక‌ర్స్ ఏం స‌మాధానం చెప్తారు? అన్న‌ది చూడాలి.