Begin typing your search above and press return to search.

బన్నీ డాన్సుల కోసం వెళ్లేవారి పరిస్థితి ఏంటబ్బా?!

By:  Tupaki Desk   |   13 Dec 2021 11:32 AM GMT
బన్నీ డాన్సుల కోసం వెళ్లేవారి పరిస్థితి ఏంటబ్బా?!
X
బన్నీ .. అనగానే గుర్తొచ్చేవి ఆయన డాన్సులు. ఎందుకంటే డాన్సుల ద్వారానే ఆయనని అంతా స్టైలీష్ స్టార్ అని పిలుచుకున్నది. బన్నీ కెరియర్ ను పరిశీలిస్తే ఎక్కడి 'గంగోత్రి' .. ఎక్కడి 'అల వైకుంఠపురములో' అనిపించడం ఖాయం. ఆ బన్నీకి .. ఈ బన్నీకి అసలు పొంతనే ఉండదు. ఇటీవల ఒక వేదికపై నాగశౌర్య కూడా ఇదేమాట అన్నాడు. నిజంగానే బన్నీ ఈ స్థాయికి రావడానికి చాలా కష్టపడ్డాడు. తనని తాను ఒక శిల్పంలా మలచుకున్నాడు. బాలీవుడ్ హీరోలు సైతం తమకి బన్నీ డాన్స్ అంటే ఇష్టమని ఆయా ఇంటర్వ్యూల్లో చెబుతుంటారు.

ఇక చాలామంది కథానాయికలు బన్నీ జోడీగా ఛాన్స్ తగిలినందుకు ఎంత సంతోషపడతారో, డాన్సుల్లో ఆయనతో పాటు ప్రేక్షకులను ఎలా అలరించాలనే విషయంలో అంతగా టెన్షన్ పడిపోతారు. ఆయనతో డాన్స్ చేయడం తమ వలన కాలేదని ఒప్పేసుకుంటారు. ఇక ఆయన సినిమాలో ఛాన్స్ రాగానే డాన్సు క్లాసులకు వెళ్లడం మొదలుపెట్టామని చెప్పేవారు కూడా కనిపిస్తుంటారు. బన్నీ డాన్సులు చూడటానికే మళ్లీ మళ్లీ ఆ సినిమాలకి వెళ్లే అభిమానులు కూడా ఉన్నారు. అలాంటిది 'పుష్ప' సినిమాలో బన్నీ స్థాయి డాన్సులు ఉండవనే టాక్ బలంగానే వినిపిస్తోంది.

ఈ సినిమాలో బన్నీకి ఒక భుజం వైపు భాగం సరిగ్గా పనిచేయదు అన్నట్టుగానే సుకుమార్ చూపిస్తూ వచ్చాడు. అంటే కాస్త వైకల్యం ఉన్న పాత్ర ఇది. ఇంతకుముందు సుకుమార్ చేసిన 'రంగస్థలం' సినిమాలో చరణ్ ను వినికిడి లోపం కలిగిన వ్యక్తిగా చూపించాడు. అయితే అలాంటి సమస్య వలన డాన్సులు చేయడానికి ఎలాంటి ఇబ్బంది ఉండదు. కానీ 'పుష్ప' సినిమాలో బన్నీ పాత్రను సుకుమార్ తీర్చిదిద్దిన తీరు వేరు. ఆ విషయం ఆల్రెడీ విడుదలైన కొన్ని పాటలు చూస్తుంటేనే మనకు అర్థమైపోతుంది. కాస్త భుజం పైకెత్తి స్టెప్పులు వేయడానికి ఆయన కష్టపడుతుండటం కూడా చూపించారు.

దేవిశ్రీ ప్రసాద్ ఇచ్చిన పాటలన్నీ కూడా జనంలోకి బాగా పోయాయి. చంద్రబోస్ కూడా మంచి సాహిత్యాన్ని అందించాడు. ఇది పక్కా మాస్ కంటెంట్ .. ఎలాంటి స్టెప్స్ నైనా దుమ్మురేగ్గొట్టే హీరో .. అందునా 'అల వైకుంఠపురములో' సినిమాలో స్టెప్స్ ను చింపేసిన హీరో .. అలాంటి బన్నీ ఆ తరువాత సినిమాలో డాన్సులు చేయడానికి ఇబ్బందిపడిపోయే పాత్రను చేస్తే .. అది అభిమానులను నిరాశ పరుస్తుందనే టాక్ మాత్రం వినిపిస్తోంది. 'పుష్ప' రాజ్ పాత్రకి మరి సుకుమార్ ఇలాంటి లిమిటేషన్స్ ఎందుకు పెట్టాడనేది సినిమా చూస్తేగాని తెలియదు .. అప్పుడుగానీ ఈ అసంతృప్తి పోదు.