Begin typing your search above and press return to search.

'పవన్.. నీ వల్ల ఎన్నో కుటుంబాలు నాశనం అవుతున్నాయి'

By:  Tupaki Desk   |   28 Sep 2021 11:30 AM GMT
పవన్.. నీ వల్ల ఎన్నో కుటుంబాలు నాశనం అవుతున్నాయి
X
ఏపీ ప్రభుత్వంపై పవన్ కళ్యాణ్ ఇటీవల సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. దీనిపై మంత్రులు ఏపీ ప్రభుత్వ మద్దతుదారులు తీవ్రంగా ఖండించారు. ప్రభుత్వ నిర్ణయాలు పవన్ దోపిడీకి అడ్డంకిగా మారుతున్నాయి కాబట్టే అంతలా రియాక్ట్ అవుతున్నారంటూ ఫైర్ అయ్యారు. ఈ నేపథ్యంలో ఓ సామాన్యుడు పవన్ విధానాలను తూర్పారబడుతూ పోస్ట్ చేసిన ఓ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

''పవన్ కళ్యాణ్ హిట్లర్ గురించి కథ చెప్పారు. రాష్ట్రంలో హిట్లర్ గురించి ఆయనకు తెలిసినంతగా ఎవరికి తెలుసు. ఆయనకు తెలుసు ఐన్ స్టీన్ బల్బ్ కనిపెట్టారని.. ఆయనకు భగత్ సింగ్ కాల్చుకొని చనిపోయారనీ తెలుసు. ఇన్ని తెలిసిన పవన్ కళ్యాణ్ కు సినిమా ఇండస్ట్రీలో ఎంత దోపిడీ జరిగుతుంది?, ఎవరు ఆ దోపిడీ సొమ్ము తింటున్నారో తెలియదా?'' అని అతను ప్రశ్నించారు. ఇంకా మాట్లాడుతూ.. ''మీరు నటించిన 'వకీల్ సాబ్' సినిమానే తీసుకుంటే దానికి 85 కోట్ల పెట్టుబడి పెట్టారు. ఎన్నో రాష్ట్రాల్లో విడుదలైన ఇండియన్ సూపర్ స్టార్ అమితాబ్ తీసిన 'పింక్' చిత్రానికే 30 కోట్లు అవలేదు. మీరు చేసిన రీజనల్ సినిమాకి 85 కోట్లు అయింది. అందులో మీ రెమ్యూనరేషన్ 50 కోట్లు''

''నెల్లూరులో ఈ చిత్రాన్ని మూడున్నర కోట్లకు రైట్స్ అమ్మారు. అవి కాకుండా ప్రతీవారం క్యూబ్ వాళ్ళకి కట్టుకోవాల్సినవి ఉన్నాయి.. థియేటర్ రెంటు కట్టాల్సి ఉంటుంది. ఇవన్నీ కలిపితే 3 కోట్ల 85 లక్షలకు నెల్లూరులో ఈ సినిమా కొనుక్కున్నారు. అంటే నెల్లూరులో ఉన్న ఎగ్జిబిటర్స్ 10 లక్షలు పెట్టి సినిమా తీసుకోవాల్సి ఉంటుంది. అంత పెట్టి తీసుకున్నప్పుడు డబ్బులు రాకపోతే ఆ ఎగ్జిబిటర్ ఎగిరిపోతారని మీకు తెలియదా?. సినిమా ఇండస్ట్రీలో 20 శాతం మాత్రమే సక్సెస్ రేట్.. మిగతా 80 శాతం రోడ్డున పడుతుంటారు అని మీరే చెప్తారు.. అలాంటప్పుడు మీరు ఎంత జాగ్రత్తగా సినిమాని అమ్మాలి? 'సర్ధార్ గబ్బర్ సింగ్' వల్ల ఓ డిస్ట్రిబ్యూటర్ మీ ఇంటి వద్దకు వచ్చి నాకు నష్టం వచ్చింది నన్ను ఆదుకోండి అని కన్నీళ్లు పెట్టుకుంది మీరు అప్పుడే మర్చిపోయారా?''

''అవుట్ డోర్ లోకేషన్స్ లో షూటింగ్స్ లేకుండా ఇక్కడే కోర్టులో మెట్రోలో తీసిన 'వకీల్ సాబ్' చిత్రానికి 85 కోట్ల అయింది. అందులో మీ రెమ్యూనరేషనే 50 కోట్లు. మీరే 50 కోట్లు తింటే మిగిలిన వాళ్ళు ఎంత తిన్నారు? మీ కొంపల చుట్టూ తిరిగి కృష్ణానగర్ రోడ్డు పక్కన పడుకునే జూనియర్ ఆర్టిస్టులకు వెయ్యి లేదా 500 ఇస్తున్నారు. ప్రొడ్యూసర్ ఒక్క సినిమా ప్లాప్ అయితే ఎగిరి పోతున్నాడు.. డైరెక్టర్ కు మరో ఛాన్స్ కూడా దొరకడం లేదు. అలాంటప్పుడు మీరు ఎంత జాగ్రత్తగా ఉండాలి. 50 - 60 కోట్లు రెమ్యూనరేషన్ తీసుకోవాలా?''

''మహేష్ బాబు '1 నేనొక్కడినే' సినిమా వల్ల ఎంతమంది ఎగిరి పోయారు. 'సైరా నరసింహా రెడ్డి' వల్ల ఎంతమంది ఎగ్జిబిటర్స్ పోయారు. ప్రొడ్యూసర్స్ డిస్ట్రిబ్యూటర్స్ ఎగ్జిబిటర్స్ నాశనం అవుతున్నారనేది ఎవరూ పట్టించుకోవడం లేదు. స్టార్టింగ్ లో నాలుగైదు హిట్స్ ఉన్న హీరో మాత్రం ఆ ఫ్యాన్ ఫాలోయింగ్ తో తరతరాలకు సరిపడా వెనకేసుకుంటున్నారు. మీరు నటించే 10 సినిమాల్లో రెండు హిట్స్ ఉంటే 8 పోతున్నాయి. మిమ్మల్ని ఆ సినిమాలను కొనుక్కున్న వాళ్ళు ఎంతమంది నాశసం అవుతున్నారో ఒక్కసారి బయటకు వచ్చి చూడండి''

''సినిమాకు అత్యధిక భాగం 50 కోట్లు మీరే తీసుకుంటున్నారు. మీ షేర్ తగ్గించుకోమన్నందుకు మా హక్కు మా హక్కు అంటున్నారు. ప్రజల మీద అంత ప్రేమ ఉన్నోళ్లు నిజాయితీగా మీ షేర్ తగ్గించుకో వచ్చు కదా? మీరు అమితాబ్ కంటే పెద్ద స్టారా? అయినా మీరు ఎక్కడెక్కడో సినిమాలు చేసి మా ఆంధ్రప్రదేశ్ ప్రజల డబ్బులు వసూలు చేసుకువడం ఏంటి? మీరు ఆంధ్రాలో ఏమన్నా షూటింగ్ చేసారా? ఇక్కడ ప్రీ రిలీజ్ ఈవెంట్స్ - సినిమాకు సంబంధించిన ప్రమోషనల్ కార్యక్రమాలు చేస్తున్నారా? మీరు ఒక్క ఈవెంట్ ఇక్కడ పెట్టుకుంటే ఎంత మంది ఆటో వాళ్ళు బ్రతుకుతారు.. ఎంత రెవెన్యూ జెనరేట్ అవుతుంది.. అలాంటి ఎప్పుడైనా ఆలోచించారా?''

'మీ బాగోగుల కోసం జూనియర్ ఆర్టిస్టులను ఎదగనీయకుండా.. కొత్త ఆర్టిస్టులు రాకుండా చేస్తున్నారు. మీ కుటుంబంలోని పది మంది మొహాలనే చూసేలా చేయడం. అంతా మీ పెత్తనమేనా?. మా ఇష్టం మేము అమ్ముతాం.. టికెట్ రేట్లు మా ఇష్టం.. మీరెంటి చెప్పేది.. అంటూ గవర్నమెంట్ నియంత్రణ లేకుండా మీరు పెత్తనం చేయాలని చూస్తున్నారా? దేన్నైనా ప్రభుత్వం ఇంత ధరకు అమ్మండి అని చెప్తుంది.. దాన్ని కూడా తప్పు బడితే ఎలా. ఆన్ లైన్ టికెట్స్ పెట్టమని 2002 లో కేంద్రం గెజిట్ విడుదల చేసింది. 2006 లో వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రభుత్వం దీనిపై జీవో ఇచ్చింది. 2009లో ఓ సంస్థ దీని కోసం ముందుకు వచ్చింది.. ఆ తర్వాత అది ఎందుకో ఆగిపోయింది.. కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం పట్టించుకోలేదు. చంద్రబాబు ప్రభుత్వం ఆన్ లైన్ లో టికెట్స్ అమ్మాలని ప్రపోజ్ చేశారు. ఇప్పుడు జగన్ ప్రభుత్వం అమలు చేస్తోంది''

''ప్రజల మీద భారం పడకుండా చేస్తున్న దాంట్లో తప్పేముంది? ప్రజలందరూ మీకు డబ్బులు కట్టడానికి పెద్ద హీరోలందరికీ ఏమి బాకీ ఉన్నారు? మీ వల్ల ఎంతమంది నష్టపోతున్నారు? ఎంతమంది డిస్ట్రిబ్యూటర్స్ ఎగ్జిబిటర్స్ రోడ్డున పడ్డారు? ఎంతమంది నిర్మాతలు దివాళా తీశారు? ప్రతి కుటుంబాన్ని నాశనం చేస్తూ మీరొక్కరే 50 కోట్లు తీసుకుంటున్నారు. మీ ఇష్టం వచ్చినట్లు రెమ్యూనరేషన్ తీసుకుంటూ రాజ్యాంగం మీకు రాసిచ్చినట్లు మా హక్కు అంటున్నారు''



For Video >>