Begin typing your search above and press return to search.

సినిమా టికెట్ త‌రువాత‌..ముందు వీటి సంగ‌తి చూడండి!

By:  Tupaki Desk   |   11 Aug 2022 6:33 AM GMT
సినిమా టికెట్ త‌రువాత‌..ముందు వీటి సంగ‌తి చూడండి!
X
గ‌తంలో సినిమా థియేట‌ర్ కు వెళ్లాలంటే పెళ్లికో,.. పేరంటానికో.. లేక బంధువుల ఫంక్ష‌న్ కో వెళ్లిన‌ట్టుగా ప్ర‌తీ ఫ్యామిలీస్ అంతా ముస్తాబై హుషారుగా వెళ్లేవారు. కానీ ఇప్ప‌డు అలాంటి ప‌రిస్థితులు క‌నిపించ‌డం లేదు. కార‌ణం థియేట‌ర్ల‌లో రోజు రోజుకు పెరిగి పోతున్న టికెట్ ధ‌ర‌లు.. స్నాక్స్‌, సాఫ్ట్ డ్రింక్స్‌.. అండ్ ఫుడ్‌.. ధ‌ర‌ల‌కు రెక్క‌లు రావ‌డ‌మే. గ‌తంలో సినిమా థియేట‌ర్లలో ల‌భించే తినుబండారాలు, పాప్ కార్న్ లంటే ప్రేక్ష‌కుల్లో ఆస‌క్తి వుండేది.

కానీ ఇప్పుడు మ‌ల్టీప్లెక్స్ థియేట‌ర్ల సంస్కృతి పెరిగిపోవ‌డం, థియేట‌ర్ల‌లో ల‌భించే ఫుడ్ , బేవ‌రేజ‌ర్స్ ధ‌ర‌లు చుక్క‌లల్లోకి చేర‌డంతో స‌గ‌టు ఫ్యామిలీ మ‌ల్టీప్లెక్స్ థియేట‌ర్ల‌కు రావాలంటే భ‌యంతో వ‌ణికిపోతోంది.

ఫ్యామిలీతో వ‌స్తే ఒక్కో సినిమాకు టికెట్ ల‌తో క‌లిపి రెండు వేల‌కు పైగా ఖ‌ర్చు చేయాల్సిన ప‌రిస్థితి. ఒక్క సినిమాకే ఇంత డ‌బ్బు ఖ‌ర్చు చేసి థియేట‌ర్ల‌కు రావ‌డానికి ప్రేక్ష‌కులు ఇష్ట‌ప‌డ‌టం లేదు. అదే ఇప్ప‌డు థియేట‌ర్ల‌కు ప్రేక్ష‌కులు రాక‌పోవ‌డానికి ప్ర‌ధాన కార‌ణంగా నిలుస్తోంది.

గ‌త కొన్ని రోజులుగా టాలీవుడ్ ప్రొడ్యూస‌ర్లు నిర్మాణ వ్య‌యం పెరిగింద‌ని, టికెట్ రేట్లు పెరిగాయ‌ని, ఆర్టిస్ట్ ల పారితోషికాలు చుక్క‌ల నంటాయ‌ని షూటింగ్ ల బంద్ కు పిలుపునిచ్చారు. ఈ స‌మ‌స్య‌లు కొలిక్కి వ‌చ్చాకే తిరిగి షూటింగ్ లు ప్రారంభిస్తామ‌ని చెబుతున్నారు. కానీ థియేట‌ర్ల‌లో ప్ర‌ధాన స‌మ‌స్య‌గా మారిన‌ స్నాక్స్‌, కూల్ డ్రింగ్స్ లపై భారీగా రేట్లపై, బ‌య‌టికి మించి పాప్ కార్న్ ఒక్కోటి రూ. 200 ఛార్జ్ చేస్తుండ‌టంపై మాత్రం దృష్టి పెట్ట‌డం లేదు.

స‌గ‌టు ప్రేక్ష‌కుడిని థియేట‌ర్ల‌కు దూరం చేస్తున్న ఈ దోపిడిపై ముందు నిర్మాత‌లు దృష్టి సారిస్తే మంచిద‌ని కామెంట్ లు వినిపిస్తున్నాయి. స‌గ‌టు ఫ్యామిలీ థియేట‌ర్ల‌కు రావ‌డానికి భారంగా మారిన ఈ అద‌న‌పు ఖ‌ర్చుల‌పై కొర‌డా ఝుళిపిస్తేగానీ సాధార‌ణ ఫ్యామిలీ మునుప‌టిలా థియేట‌ర్ల‌కు వ‌చ్చే పరిస్థితి లేదు. అందుకే ముందు నిర్మాత‌లు ఈ స‌మ‌స్య‌పై ప్ర‌ధానంగా దృష్టి పెడితే మంచిద‌ని స‌గ‌టు ప్రేక్ష‌కులు అంటున్నారు.

మ‌రి టాలీవుడ్ ప్రొడ్యూస‌ర్స్ దీనిపై చర్య‌ల‌కు దిగుతారా? ఈ స‌మ‌స్య‌ను ప్ర‌భుత్వ దృష్టికి తీసుకెళ‌తారా? ..తమ ఆధీనంలో లీజులో వున్న థియేట‌ర్ల‌లో ఈ స‌మ‌స్య‌కు ఫుల్ స్టాప్ పెడ‌తారా అన్న‌ది వేచి చూడాల్సిందే. థియేట‌ర్ల‌లో ఫుడ్ పై ఇష్టాను సారం పెంచిన రేట్ల కార‌ణంగానే ఫ్యామిలీలు నెల‌కు ఒక సినిమాకు కూడా రాలేని ప‌రిస్థితులు త‌లెత్తాయి. ఈ ప‌ద్దతి ఇప్ప‌టికైనా మారేనా?