Begin typing your search above and press return to search.

పూరి-డేవిడ్ వార్న‌ర్‌.. టైటిల్ ఫిక్స్‌!

By:  Tupaki Desk   |   16 May 2020 4:30 PM
పూరి-డేవిడ్ వార్న‌ర్‌.. టైటిల్ ఫిక్స్‌!
X
ఆస్ట్రేలియా స్టార్ క్రికెట‌ర్ డేవిడ్ వార్న‌ర్‌.. కొన్ని రోజులుగా టిక్ టాక్ వీడియోల‌తో ఎలా సంద‌డి చేస్తున్నాడో తెలిసిందే. త‌న‌కున్న ఇండియ‌న్ ఫాలోయింగ్‌ను దృష్టిలో ఉంచుకుని ఇక్క‌డి పాట‌ల‌కు అత‌ను డ్యాన్సులేస్తూ అల‌రిస్తున్నాడు. ముందు హిందీ పాట‌తో మొద‌లుపెట్టి ఆ త‌ర్వాత తెలుగు పాట‌ల‌పైకి ఫోక‌స్ మ‌ళ్లించాడ‌త‌ను. అల వైకుంఠ‌పుర‌ములో సినిమాలోని బుట్ట‌బొమ్మ‌తో పాటు రాములో రాములా పాట‌కు కూడా అత‌ను స్టెప్పులేసిన సంగ‌తి తెలిసిందే. అలాగే పోకిరి సినిమాలోని ఒక డైలాగ్‌తో అత‌ను చేసిన టిక్ టాక్ వీడియో కూడా ఓ రేంజిలో పేలింది. త‌న వీడియోల‌కు వ‌స్తున్న రెస్పాన్స్ చూసి వార్న‌ర్ మ‌రింత‌గా రెచ్చిపోతున్నాడు. తాజాగా అత‌ను బాహుబ‌లి అవ‌తారం ఎత్తి.. అమ‌రేంద్ర బాహుబ‌లి అని నేను అంటూ చెప్పిన డైలాగ్ ఓ రేంజిలో పేలింది.

ట్విట్ట‌ర్, ఫేస్ బుక్, వాట్సాప్.. ఎలా ఎక్క‌డ చూసినా వార్న‌ర్ టిక్ టాక్ వీడియోలు విస్తృతంగా క‌నిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే.. వార్న‌ర్ పోకిరి డైలాగ్‌ను ఇమిటేట్ చేసిన‌పుడు ఆ సినిమా ద‌ర్శ‌కుడు పూరి జ‌గ‌న్నాథ్ కూడా స్పందించిన సంగ‌తి తెలిసిందే. వార్న‌ర్‌లో మంచి న‌టుడున్నాడ‌ని.. సినిమాల్లో న‌టిస్తే బాగుంటుంద‌ని అన్నాడు. దానికి వార్న‌ర్ బ‌దులిస్తూ స‌న్‌రైజ‌ర్స్ వాళ్లు విడిచిపెడితే త‌ప్ప‌కుండా న‌టిస్తా అన్నాడు. ఈ సంభాష‌ణ త‌ర్వాత నెటిజ‌న్లు రెచ్చిపోయి మీమ్స్ త‌యారు చేశారు. వార్న‌ర్‌ను ఇస్మార్ట్ శంక‌ర్ అవ‌తారంలోకి మార్చి ఒక మీమ్ పోస్ట‌ర్ వ‌దిలారు. తాజాగా వార్న‌ర్, పూరి కాంబినేష‌న్లో సినిమా అంటూ.. డేవిడ్ భాయ్ పేరుతో ఒక పోస్ట‌ర్ రెడీ చేశారు. అందులో త‌న‌పైకి తుపాకులు ఎక్కు పెట్టి ఉండ‌గా.. ఠీవిగా వార్న‌ర్ నడిచి వ‌స్తున్న‌ట్లు చూపించారు. పూరి అంటే మాఫియా సినిమాల‌కు ప్ర‌సిద్ధి. ఈ నేప‌థ్యంలోనే డేవిడ్ భాయ్ అని పేరు పెట్టిన‌ట్లున్నారు. ఈ పోస్ట‌ర్లు ఇప్పుడు ట్విట్ట‌ర్లో మంచి వినోదాన్నందిస్తున్నాయి.