Begin typing your search above and press return to search.

మెగా కోడలిని ఆకాశానికెత్తేస్తున్నారు!

By:  Tupaki Desk   |   21 Oct 2019 11:57 AM GMT
మెగా కోడలిని ఆకాశానికెత్తేస్తున్నారు!
X
మెగాస్టార్ కోడలిగా - రామ్ చరణ్ భార్యగా ఎంతో గుర్తింపు ఉన్నప్పటికీ.. దాని కంటే సొంతంగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకోవాలని ఆరాటపడుతుంటుంది ఉపాసన. తన తాత వారసత్వాన్ని కొనసాగిస్తూ వైద్య-వ్యాపార రంగాల్లో సత్తా చాటుతున్న ఆమె.. సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌ గా ఉంటుంది. ఉత్తమమైన ఆరోగ్య విధానాల గురించి జనాలకు అవగాహన కల్పించే ప్రయత్నం చేస్తుంటుంది. అలాగే క్షేత్ర స్థాయిలోకి దిగి మంచి కార్యక్రమాలు చేపడుతుంటుంది. తాజాగా ఆమె సోషల్ మీడియా ద్వారా ఇచ్చిన ఒక బోల్డ్ మెసేజ్ ఆమెపై ప్రశంసల జల్లు కురిపిస్తోంది. ఇండస్ట్రీ జనాలు నోరు మెదపకుండా సైలెంటుగా ఉన్న అంశం మీద ఉపాసన గట్టిగా గళం వినిపించి నెటిజన్ల దృష్టిని ఆకర్షించింది.

దక్షిణాది సినిమా కళాకారులపై పక్షపాతం ప్రదర్శించిన నరేంద్ర మోడీ తీరును ఉపాసన దుయ్యబట్టిన సంగతి తెలిసిందే. మహాత్మ గాంధీ 150వ జయంతిని పురస్కరించుకుని స్వచ్ఛ భారత్ సహా కొన్ని మంచి కార్యక్రమాలపై జనాల్లో అవగాహన పెంచేందుకు మోడీ సినీ కళాకారులతో సమావేశం నిర్వహించిన సంగతి తెలిసిందే. ఐతే దిల్ రాజు - రకుల్ ప్రీత్ లాంటి ఒకరిద్దరు మినహాయిస్తే దక్షిణాది ప్రముఖులెవ్వరూ లేరు. రకుల్ కూడా ఉత్తరాది అమ్మాయే అన్న సంగతి తెలిసిందే. దక్షిణాదిన రజనీకాంత్ - చిరంజీవి - కమల్ హాసన్ సహా ఎందరో దిగ్గజాలున్నారు. వాళ్లెవ్వరినీ ఈ కార్యక్రమానికి పిలవలేదు. కేవలం బాలీవుడ్ స్టార్లతోనే మీటింగ్‌ ను నింపేశారు. ఇదేం పక్షపాతం అంటూ ఉపాసన మోడీని ప్రశ్నించింది. తన బాధను వెళ్లగక్కింది. ఓవైపు ఇండస్ట్రీ జనాలు మౌనం పాటిస్తుండగా.. ఉపాసన మాత్రం సూటిగా విషయాన్ని ఎత్తి చూపింది. ఈ ధైర్యం నెటిజన్ల ప్రశంసలందుకుంటోంది. కేవలం తెలుగు వాళ్లే కాదు.. దక్షిణాదిన వివిధ భాషలకు చెందిన వాళ్లు ఆమెను కొనియాడుతున్నారు. ఆమెకు మద్దతుగా గళం విప్పుతూ శభాష్ మెగా కోడలా అంటున్నారు.