Begin typing your search above and press return to search.

సోషల్ మీడియాలో కొత్త ట్రెండ్.. సోనూభాయ్ కే పన్నులు కట్టేద్దాం

By:  Tupaki Desk   |   27 July 2020 6:15 AM GMT
సోషల్ మీడియాలో కొత్త ట్రెండ్.. సోనూభాయ్ కే పన్నులు కట్టేద్దాం
X
పెద్ద పెద్ద వ్యవస్థలు చేయలేని పనులు ఒక వ్యక్తి వ్యవస్థగా మారి చేయటం సాధ్యమా? అంటే.. అదెలా కుదురుతుందని అంటారు. మనసుంటే మార్గం ఉంటుందన్న మాటకు తగ్గట్లు.. అప్పుడప్పుడు కొందరు వ్యవహరిస్తారు. ఇప్పుడు అలానే చేస్తూ.. దేశ వ్యాప్తంగా ఆసక్తికర చర్చకు తెర తీస్తున్నారు బాలీవుడ్ తో పాటు.. పలు భాషల్లో చిత్రాలు చేసే నలుడు సోనూ సూద్. కరోనా వేళ.. మిగిలిన నటీనటులకు భిన్నంగా ఆయన వ్యవహరిస్తున్న తీరుపై యావత్ భారతావని ఆయన్ను విపరీతంగా పొగిడేస్తోంది. సాయం అవసరమైతే.. సర్కారుకు చెప్పే కన్నా సోనూభాయ్ కు చెబితే పని అవుతుందన్నట్లుగా ఇప్పుడు ఆయన ఇమేజ్ పెరిగిపోయింది.

మిగిలిన సెలబ్రిటీల మాదిరి మాటలు ఎక్కువ.. చేతలు తక్కువలా కాకుండా.. కష్టంలో ఉన్న వారిని ఆదుకునేందుకు ఆయన చేస్తున్న ప్రయత్నాలు పలువురిని ఆకట్టుకుంటున్నాయి. ఇప్పుడు ఆయనకు వస్తున్న పేరు చూసి పెద్ద పెద్ద రాజకీయనాయకులు సైతం అసూయ పడేలా మారింది. లాక్ డౌన్ వేళలో.. సొంతూరుకు వెళ్లేందుకు ఇబ్బంది పడుతున్న ఎంతోమందికి ప్రత్యేకంగా బస్సులు ఏర్పాటు చేసి పంపారు. తర్వాతి కాలంలో రైళ్లను బుక్ చేసి మరీ తరలించారు.

ఇది సరిపోదన్నట్లుగా.. ఎవరూ ఊహించని రీతిలో విదేశాల్లో చిక్కుకున్న భారతీయుల్ని తన సొంత ఖర్చులతో స్వదేశానికి రప్పిస్తూ అందరికి ఆదర్శంగా నిలవటమే కాదు.. ఆయనిప్పుడు యూత్ ఐకాన్ గా మారారు. ప్రభుత్వాలు సైతం చేయలేని పనిని.. తానొక్కడే చేస్తున్న తీరు ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. నిన్నటికి నిన్న చిత్తూరుజిల్లాకు చెందిన రైతు కష్టం గురించి తెలుసుకొని.. రోజు వ్యవధిలో సోనాలికా ట్రాక్టర్ నుపంపి.. ఆ కుటుంబాన్ని సంతోషంతో ఉక్కిరిబిక్కిరి అయ్యేలా చేస్తోంది. ఐటీ ఉద్యోగికి ఉద్యోగం పోయి ఆర్థిక ఇబ్బందుల్లో చిక్కుకొని ఉంటే.. ఫోన్ నెంబరు తెలుసుకొని మరీ సాయం అందించటం.. ఫూణెకు చెందిన 85 ఏళ్ల బామ్మకు అండగా ఉంటానని మాట ఇవ్వటం.. ఆమెకు సరికొత్త ఉపాధిని కల్పించటం లాంటివెన్నో చేస్తున్నారు.

మాట ఇవ్వటం ఈజీ. దాన్ని నిలబెట్టుకోవటం అంత తేలికైనది కాదు. ఆ విషయంలో సోనూ స్టైల్ భిన్నంగా ఉంటుందని చెబుతున్నారు. మొన్నామధ్య కిర్గిస్థాన్ లో చిక్కుకుపోయిన భారతీయుల్ని వెనక్కి రప్పిస్తున్నట్లు చెప్పిన సోనూ.. తాజాగా ఫిలిప్పీన్స్ లో చిక్కుకున్న వారిని కూడా వెనక్కి తీసుకురానున్నట్లు చెప్పారు. ‘మీరంతా త్వరలో భారత్ లో ఉంటారు. దిగులుపడొద్దు’ అంటూ చేసిన ట్వీట్ ఫిలిప్పీన్స్ లో చిక్కుకున్న వారికి కొత్త ధైర్యాన్ని ఇస్తోంది.

ఇలా చేతికి ఎముక లేనట్లుగా చేస్తున్న సాయాన్ని చూసిన పలువురు సోషల్ మీడియాలో కొత్త నినాదాన్ని తెర మీదకు తెస్తున్నారు. హామీ ఇచ్చిన గంటల్లోనే పనులు పూర్తి అవుతున్నాయి.. ప్రభుత్వానికి పన్నులుకట్టే బదులు.. సోనూభాయ్ కు పన్నులు కట్టేద్దామంటూ పిలుపునిస్తున్నారు. సోనూసూద్ కు ప్రజల్లో.. మరి ముఖ్యంగా సోషల్ మీడియాలో పెరుగుతున్న ఆదరణకు ఇదో నిదర్శనంగా చెప్పాలి.