Begin typing your search above and press return to search.

వీళ్లుంటే చాలు బిజినెస్ 200 కోట్లు దాటాల్సిందే

By:  Tupaki Desk   |   29 Dec 2021 8:33 AM GMT
వీళ్లుంటే చాలు బిజినెస్ 200 కోట్లు దాటాల్సిందే
X
`బాహుబ‌లి` , సాహో త‌రువాత తెలుగు సినిమా మార్కెట్ కంచెలు దాటింది. బ‌డ్జెట్ హ‌ద్దులు దాట‌డంతో బిజినెస్ కూడా అదే స్థాయిలో దాటి తెలుగు సినిమాకు స‌రికొత్త క్రేజ్‌ని తెచ్చిపెడుతోంది. తెలుగులో సినిమా అంటే యావ‌త్ దేశ వ్యాప్తంగా వున్న సినీ వ‌ర్గాలు ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నాయి. హిట్‌, బ్లాక్ బ‌స్ట‌ర్ అన్న మాట వినిపించిందా వెంట‌నే రంగంలోకి దిగేసి రీమేక్‌ల కోసం డ‌బ్బింగ్ కోసం కోట్లు కుమ్మ‌రించేందుకు రెడీ అయిపోతున్నారు. ఎంత డిమాండ్ చేసినా మ‌రో మాట మాట్లాడ‌కుండా ఇచ్చిన ఆఫ‌ర్ కు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చేస్తున్నారు.

అలా మ‌న టాలీవుడ్ లో వున్న ఆరుగురు టాప్ స్టార్ల సినిమాల‌కు దేశ వ్యాప్తంగా భారీ డిమాండ్ ఏర్ప‌డింది. దీంతో ఆ ఆరుగురు హీరోలు టాలీవుడ్ కు సిక్స్ పిల్ల‌ర్స్ గా మారుతున్నారు. వారే ప్ర‌భాస్‌, మ‌హేష్ బాబు, ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్‌, యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌, మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్‌. ఈ ఆరుగురు హీరోల సినిమాలు ఇప్పుడు బిజినెస్ వ‌ర్గాల‌కు హాట్ ఫేవ‌రేట్స్ గా మారిపోయాయి. ఓ సినిమా మొద‌లైందా? అందులో ఈ ఆరుగురు హీరోల్లో ఎవ‌రైనా వున్నారా.. లెక్క‌లు మారిపోతున్నాయి.

భారీ బిజినెస్ కు రెక్క‌లు తొడిగేస్తున్నాయి. బిజినెస్ ఏకంగా 200 కోట్లు చ‌క‌చ‌కా జ‌రిగిపోతోంది. ఒక‌ప్పుడు మ‌న వాళ్ల సినిమా అంటే 50 కోట్లు దాట‌డ‌మే గ‌గ‌నంగా వుండేది కానీ టైమ్ మారింది. ఇప్పుడు బాల్ బాలీవుడ్ కోర్టు నుంచి టాలీవుడ్ కోర్టుకు మారింది. దేశ వ్యాప్తంగా తెలుగు సినిమాకు డిమాండ్ పెరిగింది. ఇదే ఇప్ప‌డు మ‌న హీరోల సినిమాకు వ‌రంగా మారి కాసుల వ‌ర్షం కురిపిస్తోంది. క‌నీవినీ ఎరుగ‌ని స్థాయిలో బిజినెస్ జ‌రిగేలా చేస్తోంది.

ప్ర‌భాస్ నుంచి అల్లు అర్జున్ వ‌ర‌కు ఇలా మ‌న‌కున్న ఆరుగురు టాప్ స్టార్ల‌లో ఏ స్టార్ సినిమా అయినా బిజినెస్ 200 కోట్లు దాటాల్సిందే. టాలీవుడ్ లో ఇప్పుడిదే ట్రెండ్ గా మారింది. అందుకు త‌గ్గ‌ట్టుగానే బ‌డ్జెట్ లు కూడా కేటాయిస్తుండ‌టంతో మ‌న స్టార్ల రేంజ్ ఒక్క‌సారిగా మారిపోయింది. బాలీవుడ్ వ‌ర్గాల‌కే విస్మ‌యాన్ని క‌లిగిస్తోంది. దీనికి ప్ర‌ధాన ఎక్జాంపుల్ `ఆది పురుష్‌`. బాలీవుడ్ లో ఎంతో మంది స్టార్లు వుండ‌గా కేవ‌లం ఈ ప్రాజెక్ట్ ని ప్ర‌భాస్ తో మాత్ర‌మే చేయాల‌ని బాలీవుడ్ ద‌ర్శ‌క నిర్మాత‌లు ముందుకు రావ‌డం ఇందుకు అద్దంప‌డుతోంది. ప్ర‌భాస్ న‌టిస్తున్న తొలి మైథ‌లాజిక‌ల్ మూవీ `ఆది పురుష్‌`.

దీని బ‌డ్జెట్ 500 కోట్లు. అంటే బిజినెస్ ఎంత లేద‌న్నా అంత‌కు మించి జ‌రిగే అవ‌కాశం వుంది. వీఎఫ్ ఎక్స్ కే దాదాపు 300 కోట్లు ఖ‌ర్చు చేస్తున్నారు. దీంతో ఈ సినిమాపై భారీ అంచ‌నాలు ఏర్ప‌డ్డాయి. ఆ అంచనాల‌కు మించే బిజినెస్ జ‌రిగే అవ‌కాశం వుంద‌ని తెలుస్తోంది. ప్ర‌భాస్ న‌టిస్తున్న మ‌రో చిత్రం `స‌లార్‌`. ఈ మూవీ బ‌డ్జెట్ 150 కోట్లు.. బిజినెస్ అంత‌కు మించి వుంటుంద‌న్న‌ది తెలిసిందే. ఇక రామ్ చ‌రణ్ - ఎన్టీఆర్ క‌లిసి చేస్తున్న సినిమా `ఆర్ ఆర్ ఆర్‌`.. దీని బ‌డ్జెట్ 400 కోట్లు.. దీని ప్రీ రిలీజ్ బిజినెస్ దాదాపు 890 కోట్లు...

ఇక బ‌న్నీ న‌టించిన `పుష్ప ది రైజ్` బ‌డ్జెట్ 125 నుంచి 130 కోట్లు. ఇటీవ‌ల విడుద‌లైన‌న ఈ చిత్రం 248. 70 కోట్లు వ‌సూలు చేసింది. రానున్న రోజుల్లో 325 నుంచి 350 కోట్ల వ‌ర‌కు క‌లెక్ట్ చేసే అవ‌కాశం వుంద‌ని నిర్మాతల్లో ఒక‌రైన న‌వీన్ యెర్నేని చాలా కాన్ఫిడెంట్ గా చెబుతుండ‌టం గ‌మ‌నార్హం. ఇక రామ్ చ‌ర‌ణ్ - శంక‌ర్ ల సినిమా గురించి కూడా ఇక్క‌డ ప్ర‌త్యేకంగా చెప్పుకోవాల్సిందే. ఈ సినిమా బ‌డ్జెట్ 200 కోట్లు అని తెలిసింది. కేవ‌లం 7 నిమిషాల పాటు సాగే ట్రైన్ ఫైట్ కే శంక‌ర్ 70 కోట్లు ఖ‌ర్చు చేయ‌బోతున్నార‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది.

ఇక ఈ సినిమా బిజినెస్ ఏ రేంజ్ లో జ‌ర‌గ‌నుందో ఊహించుకోవ‌చ్చు. ఇలాగే మ‌హేష్ `స‌ర్కారు వారి పాట‌`, ఎన్టీఆర్ - కొర‌టాల‌, బ‌న్నీ - కొర‌టాల సినిమాల‌కు సంబంధించి కూడా ఆస‌క్తిక‌ర‌మైన వార్త‌లు వినిపిస్తున్నాయి. గ‌తంతో పోలిస్తే ఈ ఆరు గురు హీరోలు ఇప్పుడు టాలీవుడ్ బిజినెస్ కు స్ట్రాంగ్ పిల్ల‌ర్స్ గా నిలిచారు. వీరి సినిమా అంటే క‌ళ్లుమూసికుని 200 కోట్ల‌కు మించి బిజినెస్ జ‌రిగిపోతోంది. ఇది టాలీవుడ్ కు శుభ‌ప‌రిణామం.