Begin typing your search above and press return to search.

నాగ్ కి ప్ర‌శ్న‌.. మీ భార్య మధ్యతరగతిని ఎందుకు వేధిస్తోంది?

By:  Tupaki Desk   |   25 Dec 2022 3:35 AM GMT
నాగ్ కి ప్ర‌శ్న‌.. మీ భార్య మధ్యతరగతిని ఎందుకు వేధిస్తోంది?
X
మూగ జీవాలను హింసించ‌డం చంప‌డం నేరం. వాటిని సినిమాల్లో న‌టింప‌జేసేందుకు హింసించ‌డం వేధించ‌డం నేరం. ఈ సృష్టిలో ప్ర‌తి ప్రాణికి జీవించే హక్కు ఉంది. మేధావి అయిన మాన‌వులు ప్రాణుల‌ను ఇబ్బందుల‌కు గురి చేసి లేదా సంహ‌రించి మ‌నుగ‌డ సాగించ‌డం ఆర్జ‌న చేయాల‌నుకోవ‌డం అమానుషం అవుతుంది. వీధుల్లో క‌రిచే ఊర‌ కుక్క‌ల‌ను సైతం చంపడం నేరం. వాటికి వ్యాక్సినేషన్ వేయ‌డం ద్వారా ర్యాబిస్ వంటి ప్ర‌మాద‌క‌ర రోగం రాకుండా మ‌నుషులు త‌మ‌ను తాము కాపాడుకోగ‌ల‌రు. సృష్ఠి ధ‌ర్మం ప్ర‌కారం మ‌నుషులు మూగ ప్రాణుల మ‌నుగ‌డ‌కు ఎలాంటి విఘాతం క‌లిగించ‌కూడ‌దు. బ్లూ క్రాస్ సిద్ధాంతం ప్ర‌కారం.. ఏ మూగ ప్రాణికి అపాయం క‌లిగినా వారిని క‌ఠినంగా శిక్షించాలి.

కార‌ణం ఏదైనా కానీ ఇటీవ‌లి కాలంలో మూగ జీవాల‌ను సినిమాల్లో న‌టింపజేయ‌డం ఆపేశారు. గ‌జ‌రాజు.. రాజేంద్రుడు గ‌జేంద్రుడు.. మై డార్లింగ్ ప‌ప్పీ! లాంటి సినిమాల‌ను చూసేందుకు వీల్లేకుండా పోయింది. కుక్క‌లు పిల్లులు లేదా పులులు సింహాల్ని ఏనుగుల‌ను లేదా ఎద్దును కేవ‌లం యానిమేష‌న్ బొమ్మ‌ల రూపంలో మాత్ర‌మే పెద్ద తెర‌పై చూడ‌గ‌లం. బాహుబ‌లి లో సైతం భ‌ళ్లాలుడితో త‌ల‌ప‌డే భారీ ఎద్దును యానిమేషన్ లోనే క్రియేట్ చేసిన సంగ‌తి తెలిసిందే. చాలా సినిమాల్లో కుక్క పిల్ల‌ల్ని కూడా యానిమేష‌న్ చేసి చూపించారు. జాతీయ అంత‌ర్జాతీయ స్థాయిలో పాపుల‌రైన బ్లూక్రాస్ రాక‌తో సినిమా వాళ్ల‌కు అలా క‌ళ్లెం ప‌డింది.

ఇక బ్లూక్రాస్ అధినేత‌గా అమ‌ల అక్కినేని సేవ‌ల గురించి తెలిసిందే. కానీ ఈ సేవ‌ల‌ను కొంద‌రు సినిమా వాళ్లు తీవ్రంగా నిర‌సించారు. త‌మ క్రియేటివిటీని చంపేసే ప్ర‌క్రియ ఇద‌ని వాపోయిన వారున్నారు. కొన్ని జీవ‌రాశుల‌ను సినిమాల్లో పాత్ర‌లుగా మ‌లిచే అవ‌కాశం కోల్పోయినందుకు ద‌ర్శ‌క‌ర‌చ‌యిత‌లు యానిమేటెడ్ బొమ్మ‌లను మాత్ర‌మే తెర‌పై చూసేందుకు విసుగు చెందిన ప్రేక్ష‌కులు కూడా బ్లూక్రాస్ ని తిట్టుకున్నారు. ఏదేమైనా ఇది ప్రాణుల మ‌నుగ‌డ‌కు సంబంధించిన అంశం. ఈ విష‌యంలో బ్లూక్రాస్ ని ఎదురించే సాహ‌సం ఎవ‌రూ చేయ‌లేర‌న్న‌ది వాస్త‌వం.

అయితే హైద‌రాబాద్ కి చెందిన ఒక మ‌ధ్య‌త‌ర‌గతి యువ‌కుడు బ్లూక్రాస్ అధినేత్రి అమ‌ల అక్కినేనిపై విరుచుకుప‌డుతూ కింగ్ నాగార్జున‌నే సూటిగా ప్ర‌శ్నించాడు. ``మీ భార్య మిడిల్ క్లాస్ ని ఎందుకు వేధిస్తోంది?`` అనేది నాగార్జున‌కు అత‌డి సూటి ప్ర‌శ్న‌. గ్రేట‌ర్ హైద‌రాబాద మున్సిప‌ల్ కార్పొరేష‌న్ GHMC తమ ప్రాంతంలో వీధికుక్కలను త‌మ వీధుల్లో డంపింగ్ చేయడంతో కలత చెందిన అలాంటి ఒక యువ‌కుడు ఇక్కడకు వచ్చారు. ఎందుకిలా చేశారంటూ జీవీఎంసీని నిల‌దీశాడు. అయితే మున్సిప‌ల్ కార్పొరేషన్ అధికారులు వెల్లడించిన విషయాలు ఆయనను కలవరానికి గురిచేశాయి.

దీనిని త‌ట్టుకోలేని ఆ యువ‌కుడు తీవ్ర ఆవేద‌న‌తో ఒక లేఖాస్త్రాన్ని అక్కినేని కుటుంబంపై సోష‌ల్ మీడియాల్లో సంధించాడు. ``దూకుడు మీదున్న‌ వీధి కుక్కలపై నా ఫిర్యాదుపై GHMC స్పందించింది. సుప్రీంకోర్టు లో అమల అక్కినేని ఫిర్యాదు కారణంగా నివాసితుల ఫిర్యాదుల విష‌యంలో తాను నిస్సహాయంగా ఉన్నాన‌ని ప్రైవేట్ కాంట్రాక్టర్ (కుక్క‌ల‌ను తోలే బండికి) పేర్కొన్నాడు. మీ భార్య మధ్యతరగతిని ఎందుకు వేధిస్తోంది? వీధి కుక్కలన్నింటినీ మీ ఇంటి ముందు పడవేస్తే సరి...! నాగార్జున గారు ఆలోచించండి`` అని లేఖ‌లో త‌న కోపం ప్ర‌ద‌ర్శించాడు ఆ యువ‌కుడు.

నిజానికి హైదరాబాద్ స‌హా అన్ని నగరాల్లో వీధి కుక్కల బెడద కొత్తేమీ కాదు. కొన్నిసార్లు వీధికుక్క‌లు ప‌సికందుల‌ను పీక్కు తిన్న ఉదంతాలు కూడా వార్త‌ల్లో చూస్తున్నాం. వీధుల్లో న‌డిచి వెళ్లే పాద‌చారుల‌కు పిక్క‌లు ప‌ట్టుకుని క‌రిచేసిన కుక్క‌ల‌కు కొదవేమీ లేదు. అయితే పాపం.. GHMC లేదా ఏదైనా కార్పొరేష‌న్ త‌మ ప‌రిధిలో ఏమీ చేయ‌లేని ప‌రిస్థితి ఉంది.

కుక్కలను ప‌ద్ధ‌తిగా ట్రాలీ ఎక్కించి తీసుకుని వెళ్లి వాటికి అంతే గౌర‌వంగా టీకాలు వేసి స్టెరిలైట్ చేయాలి. ఆపై వాటిని ఎక్క‌డి నుంచి ఎత్తుకు వ‌చ్చారో అదే స్థలంలో వదిలివేయాలి.. ఇది నియ‌మం. బ్లూక్రాస్ ఆజ్ఞ‌ను తూ.చ త‌ప్ప‌క ఆచ‌రించి తీరాల్సిందే.

నిజానికి అమ‌ల అక్కినేని ప్ర‌మేయం లేనంత వ‌ర‌కూ ఈ వీధికుక్కలను ఎత్తుకెళ్లి చంపేవారు. దానివ‌ల్ల వీధుల్లో ఊర‌కుక్క‌ల బెడ‌ద నుంచి మ‌నుషులు త‌ప్పించుకున్నారు. కానీ 1994లో బ్లూ క్రాస్ వ్యవస్థాపక సభ్యురాలు అమల అక్కినేని దాఖలు చేసిన పిటిషన్ తో ఈ అమానుష‌ చర్యకు బ్రేక్ ప‌డింది. ప్రస్తుతం కోర్టు ఆదేశాల ప్రకారం GHMC కానీ జీవీఎంసీ కానీ లేదా మ‌రే ఇత‌ర మున్సిప‌ల్ కార్పొరేష‌న్ లో అయినా కేవలం కుక్కలను స్టెరిలైజ్ చేసి వాటిని అవి నివ‌శించే స్థావ‌రాల్లో (వీధుల్లో) తిరిగి వ‌దిలేయాల్సి ఉంటుంది. అంత‌వ‌ర‌కూ మాత్ర‌మే మున్సిప‌ల్ కార్పొరేష‌న్ల‌కు హ‌క్కు ఉంది. కుక్క‌ల‌ను చంపే హ‌క్కు మాన‌వుల‌కు లేదు! అయితే బ్లూక్రాస్.. క‌నీసం గుడ్డిలో మెల్ల‌లాగా వీధికుక్క‌ల దాడికి గురై ఆస్ప‌త్రి పాలైన వారిని ప‌ట్టించుకునే ఆలోచ‌న మాత్రం చేయ‌దు. వీధుల్లో కుక్క‌ల దాడిలో దారుణంగా గాయ‌ప‌డిన చిన్నారులకు కాంప‌న్సేష‌న్ కానీ ఆ కుటుంబాల‌ను ఆదుకునేందుకు ఆర్థిక స‌హాయం కానీ చేసిన‌ట్టు ఎప్పుడూ వార్త‌ల్లో చ‌ద‌వ‌నే లేదు!!!!